13, మే 2021, గురువారం

పాకుతూ వెళ్ళింది

 "ఇటే పాకుతూ వెళ్ళింది" అన్నారు.


అందరు కంగారుగా అటు వెళ్ళారు.


"డిపార్టుమంటు వాళ్ళకు ఫోన్ చెయ్యండి" అన్నారెవరో ....


"వద్దొద్దు .... " అన్నారు మరెవరో.


అందరిలోనూ ఆందోళన, కంగారు, భయం ....


"ఇప్పుడే చూసామండి .... ఇటే పాకుతూ వెళ్ళింది" అన్నాడొకాయన.


ఆ వైపు వెళ్ళారు ....


జాగ్రత్తగా వెదికారు. కనిపించలేదు,


మళ్ళీ అందరిలో ఆందోళన, కంగారు, భయం ....


"ఎటెళ్ళుంటుందో?" అన్న అనుమానం ప్రతి ఒక్కరి ముఖంలో స్పష్టంగా కనపడుతోంది.


"జాగ్రత్త బాబు, అటువైపు స్లోపుగా ఉంది" అన్నాడొక పెద్దాయన.


"పర్లేదులెండి .... " అన్నాడతను.


ఆమెకు కూడా ఆందోళన, కంగారు, భయం ....


అక్కడంతా పొదలు గుబురు గుబురుగా ఉన్నాయి.


"జాగ్రత్తండీ, ముళ్ళ పొదలు" అన్నది ఆమె.


చేతి కఱ్ఱతో పొదల్ని కదిలించాడు. ఎటువంటి అలికిడి లేదు.


మళ్ళీ వెనక్కి వచ్చాడతను. ఆయనతో పాటు ఆమె కూడా వచ్చింది.


అందరిలోను అదే ఆందోళన, అదే కంగారు, అదే భయం ....


'ఇంతలో ఎలా మాయమయింది?' అన్న ప్రశ్న అందరిలోను ఆందోళన కలిగిస్తోంది.


'కనపడకపోతే ఏం చెయ్యాలి?' అన్న ప్రశ్న అందరిలో ఉదయించింది.


ఇంతలో గేటు తీసుకుని ఒక వ్యక్తి లోపలకు వచ్చాడు.


అతడి చేతిలో ఉన్న పాప ఒక్కసారిగా 'ఆమా' అంటూ ఆమె చేతిలోకి దూకింది.


('పాక్కుంటు వెళ్ళేవన్నీ పాములు కావు. భయపడకండి')

కామెంట్‌లు లేవు: