17, మే 2021, సోమవారం

మొగలిచెర్ల .. ఉపదేశం

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...


*శ్రీ స్వామివారి ప్రవర్తన..మాటలు..ఉపదేశం.*


*(ముప్పై వ రోజు)*


శ్రీ స్వామివారు తెల్లవారుఝామునే గదిలోంచి బైటకువచ్చి..ఇంటి ఆవరణలో తిరుగుతూ వుండేవారు..ఒక్కొక్కసారి శ్లోకాలు..దైవ సంకీర్తనలు పాడుతూ వుండేవారు..శ్రావ్యమైన కంఠస్వరం తో అద్భుతంగా గానం చేసేవారు..ప్రభావతి గారికి శ్రీధరరావు గారికి కూడా ఉదయాన్నే లేచే అలవాటు..ప్రభావతి గారు పశువుల ఆలనా పాలనా చూసుకోవడం..గేదెల వద్ద పాలు పితకడం..వగైరాలన్నీ చేసుకుంటూ వుండేవారు..ఆ సమయంలో ఆవిడ సహజంగా ఏదో ఒక స్తోత్రాన్ని మననం చేసుకుంటూ వుండేవారు..కానీ శ్రీ స్వామివారు వారింట్లో అడుగుపెట్టిన తరువాత ..శ్రీ స్వామివారు దాదాపు ప్రతిరోజూ తెల్లవారుఝామున నాలుగు గంటల ప్రాంతంలో తన గానమాధుర్యాన్ని చవిచూపడం అలవాటుగా మారింది..వినేవారికి అదో గొప్ప అనుభూతి..


ఐశ్వర్యం గురించి రాత్రి పొద్దుపోయేదాకా శ్రీధరరావు దంపతులకు వివరించి..రాత్రి తన గదికి వెళ్లిపోయిన శ్రీ స్వామివారు..మళ్లీ తెల్లవారుఝామున నాలుగు గంటలకే వచ్చేసారు..శ్రీ స్వామివారి ఉపదేశాన్ని బాగా అర్థం చేసుకున్న శ్రీధరరావు దంపతులు కూడా ఆ సమయానికి లేచి..కాలకృత్యాలు తీర్చుకుని..ఇంటి ముందుకు వచ్చారు..ఎదురుగా చిరునవ్వుతో శ్రీ స్వామివారు నిల్చుని వున్నారు..


"శ్రీధరరావు గారూ..కొన్ని విషయాలు చెప్పాలని అనిపించింది..సమయం కూడా చక్కగా ఉంది..మీరిద్దరూ తప్పక వినవలసినవి.. మళ్లీ మళ్లీ నాకు కుదరక పోవొచ్చు..లేదా..మీకు ఆ సమయమూ లేక పోవొచ్చు..ఏం తల్లీ!..వింటారా?.." అన్నారు..ఇద్దరూ తలాడించారు..


"శిష్యుడి మానసిక స్థితి..ఆధ్యాత్మిక ఉన్నతి గమనించి..ఆ శిష్యునికి సరైన సమయంలో సరైన మంత్రోపదేశం చేసి..ఆ మంత్రాన్ని శిష్యుని ద్వారా కోటి జపం పూర్తి చేయించి..కోటి జపం చేసేలా దీవిస్తూ..మార్గం నిర్దేశించేవాడే సద్గురువు!..ఉపదేశించిన మంత్రానికి..ఉపదేశం తీసుకున్న వ్యక్తిీ..ఆ మంత్రం పరిపూర్తి చేసినప్పుడే..మంత్రోపదేశం చేసిన గురువుకు కూడా అపాత్రదానం చేసాననే భావన లేకుండా పరిపూర్ణ తృప్తితో సద్గతి పొందుతాడు!.."


"దైవాన్ని నమ్మిన వాళ్ళు చెడిపోవడం ఏ యుగంలోనూ లేదు!..దైవ నామొచ్చారణతో జన్మ జన్మల పాపాలూ ప్రక్షాళన అయి తీరుతాయి..కోరరాని కోర్కెలు తీర్చేవాడు దేవుడు కానేకాదు!..భక్తులకు ఏది శ్రేయస్కరమో..ఏ క్షణంలో తన రక్షణ అవసరమో..అది ప్రసాదించేవాడు ఒక్క భగవంతుడు మాత్రమే!..నీవు చేయవలసిందల్లా..విడవకుండా..అచంచల విశ్వాసంతో..ఆయన పాదాలను మనసా, వాచా, కర్మణా నమ్మి శరణాగతి పొందడమే!.."


"దైవ జపం విశ్వాసం తో చేస్తే..సంపదలు మాత్రమే కాదు..అష్టసిద్ధులూ వశం అవుతాయి..కానీ వాటిని ఇతరులకు హాని కొరకు ఉపయోగిస్తే..రాక్షసులుగా మారతారు..అవి అందించిన భగవంతుని చేతిలోనే చావుదెబ్బ తింటారు..అలాకాక.. ధర్మమార్గాన వాటిని సమాజహితం కొరకు వినియోగిస్తే..వారు మహాత్ములు అవుతారు..అదొక యోగం..వారినే యోగులు అంటాం.." 


ఇంతవరకూ చెప్పిన శ్రీ స్వామివారు..హఠాత్తుగా పక పక మని నవ్వసాగారు..వింటున్న దంపతులిద్దరూ ఆశ్చర్యపోయారు..ఆ తెల్లవారుఝామున శ్రీ స్వామివారి స్వచ్ఛమైన నవ్వు..అదీ తెరలు తెరలుగా నవ్వడం..వారికి అర్ధం కాలేదు..


ఇంతలో శ్రీ స్వామివారే తమ నవ్వును ఆపుకొని..ప్రభావతి గారి వైపు చూసి.."అమ్మా..నిన్న రాత్రి నీకు అష్టైశ్వర్యాల గురించి బోధ చేసాను కదా!..నీవు ధన వ్యామోహం లో పడకూడదని అంతదూరం చెప్పాల్సి వచ్చింది..ఆ ఒక్క సందేహాన్ని తీర్చడం కోసం నేను ఎంతో సమయాన్ని వెచ్చించి..మీ సందేహాలను నివృత్తి చేయాల్సి వచ్చింది..మీరు ఈ జ్ఞానం నా ద్వారా పొందాలని ఆ భగవంతుడి నిర్ణయం..గృహస్తుల సందేహాలకు ఎంత సమయం ఇలా కేటాయించాలనో..అని నాకు నవ్వు తెప్పించింది..శ్రీధరరావు గారూ మీకు కూడా బోధ పడిందా?.." అన్నారు శ్రీ స్వామివారు..


"నాలోనూ చాలా సందేహాలు నివృత్తి అయ్యాయి స్వామీ.." అన్నారు శ్రీధరరావు గారు..శ్రీ స్వామివారి బోధలో..శ్రీధరరావు గారికి బాగా ఆకట్టుకున్న విషయం..సమాజహితం తో కూడుకున్న ధర్మాచరణ!..అది గృహస్తులకు అత్యవసరం..


"చివరగా ఒక్కమాట!..ఫలానా పూజ చేస్తే..దేవుడు నెత్తిన మొట్టాడు..అంటూవుంటారు కొందరు..అది తప్పు!..నిజమైన భక్తుడిని దైవం నెత్తిన మొట్టడు.. అనవసర కోరికలు..మోసం..పరనిందా.. పరులకు హాని..ఇత్యాదులను దేవుడు క్షమించడు!..అదీ అసలు రహస్యం..అది తెలుసుకొని మసలుకోండి!.." అని చెప్పి..


"అమ్మా..త్వరగా ఒక గ్లాసు పాలు ఇవ్వమ్మా!..బాగా ఆకలిగా ఉంది.." అని అడిగారు స్వామివారు..ఆసరికే కొద్దిగా వెలుతురు వస్తోంది..ప్రభావతి గారు గబ గబా గేదె దగ్గరకు వెళ్లి, పాలు పితికి.. వెచ్చచెసి ఇచ్చారు..శ్రీ స్వామివారు ఆ పాలు త్రాగి..మళ్లీ తన గదిలోకి వెళ్లి ధ్యానం లో కూర్చున్నారు..


అవధూత లక్షణం..శ్రీ దత్తాత్రేయ అవతారం..రేపు..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్.. శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: