🌹🌹🌹🌷🌷🌹🌹🌹
👆శ్రీపతి- శ్రీమతి ( Fully locked down) పాతహాస్యకథ
శ్రీమతికి నీ శ్రీపతి రాయునది!
నువ్వు లేక బొత్తిగా సోపతి పోయింది భామా!
చిన్నప్పుడు ఈటీవీ వారి " విధి" సీరియల్ రంధిలో పడి మా తిండీతిప్పలు మర్చిపోయే మా అమ్మానూ, బామ్మనూ చూస్తూ మానాన్న.. "విధి "బలీయమయినది. మనమంతా " విధివంచితులం", ఏడింటికల్లా విధిగా రాత్రిపూట ఇంటిపనంతా నామీదే పడుతోంది. విధి నామీద పగపట్టింది".... అంటూ విధవిధాలుగా ఆ" విధి" ని తిడుతూవుంటే ఏవిటో అనుకునేవాడిని. కానీ పెద్దయ్యాకా అదే విధి నన్నూ కోవిదు రూపంలో వంచిస్తుందనుకోలేదు!
నువ్వు నిదానంగా వద్దామనుకుని నిజామాబాదులో తిష్టేసేసావు. ఇక్కడ పనిమనిషి విధులు మానేయడంతో మా అమ్మ రెండు వీధులు పోలీసు కళ్ళుకప్పి దాటేసి మా శ్రీనిధి అక్క ఇంటికి ఉడాయించింది. నేనిప్పుడు ఎడారిలో విమానం కూలిపోయిన పాపం పసివాడిలా దిక్కూమొక్కూ లేకుండా ఉన్నా!
కాఫీ ఒక్కటి నేర్పిన పుణ్యవతివి నువ్వు! ఆ కషాయపానం అయ్యాకా ఫలహారంగా ఉప్మా చేద్దామనుకున్నానా! అప్పుడొచ్చింది ఓ సందేహవాహిని. ఉప్మాలో ఎవరి ప్రాముఖ్యత ఎంతని! ఉప్పుదా: ఉప్పుడురవ్వదా అని!
పైగా నువ్వు చేసే ఉప్మాలో స్పూనుస్పూనుకూ అడ్డం పడే కరివేపాకూ హెచ్చరించింది నన్ను మర్చిపోకు గురూ అంటూ! ఉప్పుడునూక వెతుకులాటలో ఋుష్యమూక పర్వతం మీద హనుమంతుడు కనబడ్డట్టు... నాకు దాని కజిన్ సిస్టర్ ఉప్మానూక కనిపించింది. ఓ అరగంట తర్జనభర్జనల అనంతరం నా ఆరవ పంచేంద్రియం(??)... అదేనోయ్ సిక్స్త్ సెన్సును అనుసరించి ఉప్మానూకని వరించాను! ( సవరించాను) !
యూ గొట్టంలో గొట్టంగాళ్లెందరో ఉప్మాతయారీ చూపిస్తున్నారన్న ప్రాధమికసూత్రం మర్చిపోయి ఉద్ధండపిండంలా ఉప్మా చేద్దామనుకున్నా! కళ్ళు మూసుకుని ధ్యాననిమగ్నుడనై... ఉప్మాకు ఆనుపానులన్నీ ఊహించి ఉపక్రమించా!
ఆయుధపూజకు ముందు అమ్మవారిని పూజించి... మూకుడు బయటకు తీసాను. లౌక్ డౌన్ కారణంగా.. సాలెపురుగొకటి మూకుట్లో ఇంచక్కా జాలం అల్లుకుని.. ట్రాంపాలిన్ ఆడుకుంటోంది. నన్ను చూసి కూడా లెక్కలేకుండా చూస్తుంటే... కొంపతీసి అది కరోనాని మోసుకొచ్చిన ఫారిన్ స్పైడర్ కాదు కదా అని డర్ అయిపోయా! మోడీజీ క్రిందటేడు చెప్పినట్టే అన్నీ బాగా నీళ్ళతో కడిగా.... పోపుసామాన్లతో సహా!
అయితే ఆదిలోనే అంసపాదు పడింది. విజయా వారి నూనె పేకట్టు నుండి నూనె గ్రహించే విషయంలో... పేకట్ కు పైన పెట్టాలిసిన గాటు ... కింద అయిమూలగా ఒకంగుళం వెడల్పులో కత్తిరించానా.... ఇంక చూడు చినుకులా రాలి, నదులుగా మారి వరదలై పొంగింది... నూనె! ఇంక ఉప్మా ఏంటి నా తలకాయ. ఇల్లంతా ప్రవహిస్తున్న నా తైలసముద్రాన్ని ఆపడానికి బాల్కనీలో ఆరేసిన మా అమ్మ చీరలు రెండు తెచ్చి ఆ నూనెమీద పడేసి నియంత్రించాను.
కనీసం ఆవకాయ అన్నం అఘోరిద్దామని .. కుక్కర్ పెట్టడానికి బియ్యం డబ్బా తీసేసరికి... నల్లపూసల్లాంటివేవో నడయాడుతుంటే కాస్త హిట్ కొడదామని చూస్తే మూడు రకాల హిట్లున్నాయి ఇంట్లో! ఏది కొట్టాలా బియ్యంలోకి అని ఆలోచిస్తుంటే... ఆమె వచ్చింది! అదేనోయ్! మన వాచ్మేన్ భార్య మనకు తాత్కాలికంగా కుదిరిన సహాయకురాలు. ఆమె చూపులు బాగాలేవు. ఆమె నన్ను గుచ్చిగుచ్చి చూస్తోంది. ఒకేసారి చాలావేపులకు చూడగలుగుతోంది. నాకేసి నిరసనగా చూస్తూ, నా శబ్దభేరి పగిలేట్టు... గిన్నెలూ గట్రా విసురుతూ ఇల్లు క్లీన్ చేస్తోంది.
ఇప్పుడు నేనేం చెయ్యాలి. నువ్వొచ్చేసరికి అస్థిపంజరమే మిగులుతుందేమో! అమ్మ, ఆలి కన్నా అన్నమే ఎక్కువ కళ్ళముందు కదులుతోంది! ఇంక డాబు వదలి యూట్యూబు షరాబుల్ని ఆశ్రయిద్దామనుకుంటున్నా! ఇంక ఈ కార్డుపై ఖాళీలేదు. అడ్రసు స్థలంలో కూడా రాసేసా కనుక ఫోటో తీసి వాట్సప్ లో పంపుతున్నా! చిత్తగించవలెను... ఇట్లు చిత్తం చెదిరిన నీ శ్రీపతి!
🌞🌞🌞🌞🌞🌞
పతీ! శ్రీపతి! నీ సమర్ధత మరోసారి నిరూపించుకున్నావు.. సంతోషం. ఆ యూగొట్టాల వంటలు నీ వల్ల కాదు కానీ... మనింట్లో చిన్ననిచ్చెన భుజాన వేసుకో. మన వీధిలో పది అపార్టుమెంట్ల గోడలు దూకాకా.... ఎడమవేపుకు తిరుగు. అక్కడ మరో మూడు గోడలు దూకు మీ అక్క ఇల్లు వస్తుంది. అక్కడ దూకేయి! మీ బావగారు ఢిల్లీలో ఇరుక్కుపోయారు కనుక నువ్వు యధేచ్ఛగా తినచ్చు అక్కడ.
మనకు ఉచితాలు అచ్చిరావు కనుకా ముందే ఓ పాతికవేలు మీ అక్క చేతిలో పెట్టు. అసలే కరువురోజులు. ముందు నువ్వా ఫేసుబుక్ గ్రూపుల భాష సాధన చెయ్యడం మాని... వంట ప్రాక్టీస్ చేస్తే నీ అస్తుల మీద కండ చేరుతుంది. లేకపోతే నువ్వన్నట్టు అస్థిపంజరమే.
యదార్ధాల వాకిట్లో ఉన్నాం. మాటలు ఇంత సొంపుగానే వస్తాయి నాకు. మీ అమ్మకు ఆ చీరలకు గాను ఐదువేలు చేతిలో పెట్టకపోతే రౌరవాది నరకాలు రౌద్రరసంతో కలిపి చూపించేయగలరు. పిల్లలు "పాపం నాన్న"! అని ఏడుస్తున్నారు. ...
వాచ్మేన్ భార్యచూపులు అంతే! పాపం ఆమెకు మెల్ల! ఆ విషమేమీ నవ్వేదికాదు! ఉంటా!
.....ఇట్లు వంటతంటా తప్పించుకున్న...మతిలేని పతికి సతి శ్రీమతి! ఈసారి ఉత్తరాలు పోస్ట్ చేస్తున్నపుడు ఫేమిలీ వాట్సప్ గ్రూపులో పోస్ట్ చేసే అవివేకపు పని చెయ్యవని ఆశిస్తున్నా!
☄️☄️☄️☄️☄️☄️
ధన్యవాదాలతో
ఓలేటి శశికళ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి