10, ఆగస్టు 2021, మంగళవారం

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*దశమస్కంధము - ఉత్తరార్ధము - ఎనుబది ఏడవ అధ్యాయము*


*శ్రుతిగీతలు*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*87.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*


*దురవగమాత్మతత్త్వనిగమాయ తవాత్తతనోఃచరితమహామృతాబ్ధిపరివర్తపరిశ్రమణాః|*


*న పరిలషంతి కేచిదపవర్గమపీశ్వర తే చరణసరోజహంసకులసంగవిసృష్టగృహాః॥11981॥*


ప్రభూ! పరమాత్మజ్ఞానము లభించుట ఏమాత్రమూ సులభముగాదు (ఎంతయు కష్టము). అట్టి నీ ఆత్మతత్త్వమును బోధపఱచుటకై శ్రీరాముడు, శ్రీకృష్ణుడు మున్నగు అవతారములను దాల్చి, నీవు నీ యొక్క వివిధ లీలలను నెఱపుచుందువు. మధురమై, పారవశ్యమును గూర్చెడి నీ లీలామృతములను గ్రోలినవారు తాపత్రయములనుండి (ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవిక తాపములనుండి) విముక్తులై పరమానందసాగరమున మునుగుదురు. కొందరు పరమ భక్తులు నీ లీలా కథా శ్రవణములను తప్ప మోక్షమునుగూడ కోరుకొనరు. ఇంకను కొందరు నీ పాద కమలములను సేవించుటయందే నిరతులై మిగుల పుణ్యాత్ములైన పరమహంసలవలె భాగవతోత్తములతోగూడి నీ కథశ్రవణ సుఖమును అనుభవించుచు ఐహికములైన సాంసారిక బంధములను తెంచుకొందురు (సాంసారిక బంధములనుండి బయట పడుదురు). నీ పవిత్ర కథా శ్రవణమునందు నిరతిగలిగిన భక్తులు మహాయోగులకు ప్రాప్యమగు ముక్తిని సైతము తమ మనస్సులలో తలంపరు.


*87.22 (ఇరువది రెండవ శ్లోకము)*


*త్వదనుపథం కులాయమిదమాత్మసుహృత్ప్రియవత్ చరతి తథోన్ముఖే త్వయి హితే ప్రియ ఆత్మని చ|*


*న బత రమంత్యహో అసదుపాసనయాఽఽత్మహనో యదనుశయా భ్రమంత్యురుభయే కుశరీరభృతః॥11982॥*


స్వామీ! ఈ శరీరము నీ సేవలకే సాధనమై, నీ మార్గమును అనుసరించినప్పుడు ఆత్మహితైపి, సుహృత్తు, ప్రియవ్యక్తివలె, ఇది సహకారియగును. వాస్తవముగా నీవు హితుడవు, ప్రియమైనవాడవు, ఆత్మస్వరూపుడవు, మిక్కిలి సులభుడవు. దుర్లభమైన మానవ శరీరమును పొందియు జనులు సర్వవిధముల క్షేమంకరుడవైన నిన్ను సేవింపక విషయసుఖముల యందు అనురక్తులై నశ్వరమైన ఈ దేహమునే సేవించుచుందురు. అట్లొనర్చుట ఆత్మహత్యా సదృశము. తత్ఫలితముగా వారి మనోవృత్తులు, వాసనలు, దేహేంద్రియ సుఖపరములగును. అట్టి కుసంస్కారముల ప్రభావమున వారు పశుపక్ష్యాదుల శరీరములను పొంది మిగుల భయానకమైన జననమరణరూప సంసారచక్రముననే పరిభ్రమించు చుందురు. ఇది పరమ శోచనీయము.


*87.23 (ఇరువది మూడవ శ్లోకము)*


*నిభృతమరున్మనోఽక్షదృఢయోగయుజో హృది యన్మునయ ఉపాసతే తదరయోఽపి యయుః స్మరణాత్|*


*స్త్రియ ఉరగేంద్రభోగభుజదండవిషక్తధియో వయమపి తే సమాః సమదృశోఽఙ్ఘ్రిసరోజసుధాః॥11983॥*


పద్మనాభా! పరమయోగులు ప్రాణములను, మనస్సును, ఇంద్రియములను వశపరచుకొని, యమనియమాది యోగసాధనలద్వారా నిన్నే ధ్యానించుచు పరమపదమును పొందుదురు. కానీ, నీ యెడ వైరభావముతోనైనను సర్వదా నిన్నే స్మరించుచుండెడి శిశుపాలాది భూపాలురును, శేషనాగుని శరీరమువలె దృఢమై, సుకుమారమైన నీ భుజములపై ఆసక్తులై, నిరంతరము నిన్ను స్మరించుచుండెడి (పదహారువేలమంది) స్త్రీలును నీ పరమపదమునే పొందుదురు. సర్వదా నీ చరణారవిందములను బాగుగా ధారణ చేయుచుండెడు శ్రుతులమగు మేము కూడ సమదర్శనముగల నీకు సమానులమేకదా! నీలో ఎటువంటి రాగద్వేషభావములు లేవు. అందుకే నీవు సమదర్శివి.


*87.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*


*క ఇహ ను వేద బతావరజన్మలయోఽగ్రసరం యత ఉదగాదృషిర్యమను దేవగణా ఉభయే|*


*తర్హి న సన్న చాసదుభయం న చ కాలజవః కిమపి న తత్ర శాస్త్రమవకృష్య శయీత యదా॥11984॥*


బ్రహ్మాదిదేవతలు, సనకాది మహర్షులు, మరీచ్యాదిఋషులు, ఇంద్రవరుణాది లోకపాలకులు, ఇంద్రియాధిష్ఠాన దేవతలు - వీరందరునూ నీ సంకల్పముద్వారా ఉత్పన్నమైన వారు. ఈ విధమగ నీవు అందరికంటే అగ్రేసరుడవు. ఆశ్చర్యమేమనగా - నీ తర్వాత, నీ నుండి ఉత్పన్నమైనవారలు నీ గురుంచిగానీ, *జన్మ కర్మ చ మే దివ్యమ్* దివ్యములైన నీ జన్మ, కర్మల గురుంచిగానీ ఎట్లు? ఏమని? తెలియుదురు? అంతేగాదు, యోగనిద్రద్వారా శయనించుటకు సంకల్పించినప్పుడు, నీవు ఈ సమస్త జగత్తును నీలో లయము చేసెదవు. అప్పుడు జగత్తు అనే కార్యముగానీ, ప్రకృతి అనే కారణముగానీ, కాలముయొక్క వేగముగానీ ఏదీ ఉండదు. అప్పుడు వేదము నీలో లయమైయుండును. ఈ రీతిగా సృష్టియొక్క ఆద్యంతముల యందు నీవు ఒక్కడవే ఉందువు.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని ఉత్తరార్ధమునందలి ఎనబది ఏడవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

కామెంట్‌లు లేవు: