Srimadhandhra Bhagavatham -- 57 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu
పామును మంధరపర్వతమునకు చుట్టారు. అందరూ కలిసి తిప్పాలి. అది క్రిందకు జారిపోకూడదు. దేవదానవులిరువురూ చిలకడం ప్రారంభించారు. గిరగిరమని పర్వతం తిరిగింది. భుగభుగభుగమని పాలసముద్రం లేచింది. నురగలు లేచాయి. కెరటములు లేచాయి. పక్షులు, పాములు, తాబేళ్లు, చేపలు, మొసళ్ళు ఎగిరెగిరి పడుతున్నాయి. కొన్ని చచ్చిపోతున్నాయి. విపరీతమయిన ధ్వని చేస్తోంది. దానికి తోడు వీళ్ళ అరుపులు. అంత కోలాహలంగా ఎవరి మానాన వారు మంధరపర్వతమును గిరగిర తిప్పేస్తున్నారు. వాసుకి ‘మీరు సరిగ్గా చిలకడం లేదు వదలండి’ అని కేకలు వేశాడు. వాళ్ళందరూ వాసుకిని వదిలేశారు. పట్టు తప్పిపోయి మంధర పర్వతం జారి క్రిందపడిపోయింది. అందరూ శ్రీమన్నారాయణుని వైపు చూశారు. ఎవ్వరూ గమనించలేని స్థితిలో ఆది కూర్మావతారమును స్వీకరించాడు. కొన్ని లక్షల యోజనముల వెడల్పయిన పెద్ద డిప్ప. ఆ దిప్పతో పాలసముద్రం అడుగుకి వెళ్ళి ఇంతమంది కదల్చలేని మంధరపర్వతమును తన వీపుమీద పెట్టుకున్నాడు. ముందు వచ్చి తుండమును అటూ ఇటూ ఆడిస్తున్నాడు. తన నాలుగు కాళ్ళను కదల్చకుండా తానే ఆధారమయి, మంధరపర్వతమును వీపుపై ధరించి ఉన్నాడు. ఆ కూర్మము నిజంగా ఆహారమును తినినట్లయితే ఈ బ్రహ్మాండములనన్నిటిని జీర్ణము చేసుకొనగలదు. అటువంటి ఆదికూర్మమై పాలసముద్రం క్రింద పడుకున్నాడు. ఇపుడు మంధరపర్వతమును ఆదికూర్మం భరిస్తోంది. మరల మంధరపర్వతమును వాసుకిని చుట్టి రాక్షసులు తలవైపు దేవతలు తోకవైపు ఉండి చిలకడం ప్రారంభించారు. భూమి అదిరిపోతోంది. సముద్రంలోంచి కెరటములు పైకి లేస్తున్నాయి. సిద్ధులు, చారణులు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు ఆకాశంలో నిలబడిపోయి ఆ దృశ్యమును చూస్తున్నారు.
ఎక్కడో సత్యలోకంలో బ్రహ్మగారు భావసమాధిలో ఉన్నారు. ఈ చప్పుడు ఆయన చెవుల్లో పడి ఆయన బహిర్ముఖుడయ్యాడు. సత్యలోకంలోంచి బయటకు వచ్చి ఏమిటి ఈ చప్పుడు? అన్నారు. అక్కడి వాళ్ళు స్వామీ! పాలసముద్రమును చిలుకుతున్నారు. అందులో నారాయణుడు కూడా ఉన్నాడు అన్నారు. బ్రహ్మగారు కూడా పైనుంచి క్రిందకు చూస్తున్నారు. ముందు అమృతం రాలేదు. హాలాహలం ముందు పుట్టుకు వచ్చింది. అది ఒక్కసారి పాలసముద్రం మీద నుండి పైకి లేచింది. ప్రళయకాలంలో ఉండే అగ్నిహోత్రం ఎలా ఉంటుందో అలా ఉన్నది. అది వెంట తరుముతుంటే దేవతలు రాక్షసులు అందరూ వాసుకిని వదిలిపెట్టి పరుగు మొదలు పెట్టారు. అన్ని లోకములలో అగ్నిహోత్రం ప్రబలి పోతున్నది. పరుగెత్తి పరుగెత్తి కైలాసపర్వతం మీద వున్న పరమశివుని అంతఃపురము దగ్గరకు వెళ్ళి అక్కడి ద్వారపాలకులు అడ్డు పెట్టగా వారిని పక్కకు తోసివేసి లోపలి ద్వారం దగ్గరకు వెళ్ళి అక్కడే నిలబడి రక్షించు అని అరుస్తున్నారు. స్వామి పరమశివుడు వీరి అరుపులు విని ఏదో ఆపద సంభవించి ఉండవచ్చునని బయటకు వచ్చారు. వారు శంకరునితో ‘ఈశ్వరా! నీవు ఈ విశ్వమంతా నిండి నిబిడీ కృతమయిన వాడివి. నీవు తండ్రివి. మేము చెయ్యకూడని పని ఒకటి చేశాము. ఇంట్లో ఏదయినా శుభకార్యం చేస్తున్నప్పుడు మనకొక సంప్రదాయం ఉన్నది. ముందుగా తల్లిదండ్రులకు నమస్కారం చేసి వారికి బట్టలు పెట్టి పీటలమీద కూర్చుంటారు. దేవదానవులు ఆ పని చేయలేదు. స్వామికి నమస్కరించలేదు. అందుకని స్వామి వీళ్ళకి పాఠం నేర్పాలి అనుకున్నాడు. వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు ‘మేము మంధరపర్వతం పెట్టి సముద్రమును చిలికితే హాలాహలం జనించింది. లోకములను కాల్చేస్తోంది. దయచేసి దానిని నీవు స్వీకరించవలసినది’ అన్నారు.
మూడుమూర్తులకు మూడు లోకములకు మూడు కాలములకు మూలమగుచు
భేదమగుచు దుది నభేదమై యోప్పారు బ్రహ్మమవగ నీవ ఫాలనయన!
నీవు భూతభవిష్యద్వర్తమాన రూపములలో ఉంటావు. నీవే బ్రహ్మవిష్ణు మహేశ్వరుల రూపంలో ఉంటావు. నీవే సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త రూపంలో ఉంటావు. అందుకని మూడింటికి ఆధారమయిన మూలపురుషుడవు కనుక ఈశ్వరా! ఈ హాలాహలమును నీవు పుచ్చేసుకో’ అన్నారు. వారి కోరికను విన్న పరమశివుడు వెంటనే పార్వతీ దేవి వద్దకు వెళ్ళాడు. అమ్మవారు చిరునవ్వులు చిందిస్తూ తాంబూలం వేసుకుని కూర్చుని ఉన్నది. శంకరుడు ఆమెవంక చూసి ‘కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషము వేడిమి; ప్రభువై
యుంటకు నార్తుల యాపద, గెంటించుట ఫలము; గాదె గీర్తి మృగాక్షీ!!
ఈ ఘట్టము వినిన వాళ్లకి కొన్ని కోట్ల జన్మల వరకు అయిదవతనం తరిగిపోకుండా కాపాడుతుంది. ఈ ఘట్టంలో అమ్మవారి మంగళసూత్రం గురించి వస్తుంది. ‘చూసావా పార్వతీ! నీళ్ళలోంచి వేడి పుట్టింది. పాపం పిల్లలందరూ ఏడుస్తున్నారు. ప్రభువు అన్నవాడు బిడ్డలకు కష్టం వస్తే ఆదుకోవాలి. అందుకని వాళ్ళను రక్షించాలని అనుకుంటున్నాను’ అన్నాడు. ఆవిడ సమస్త బ్రహ్మాండములకు తల్లి. మాతృత్వము ఒక్కొక్కసారి భర్తృత్వమును కూడా తోసేస్తుంది. అది తల్లితనానికి ఉన్న గొప్పతనం. అందుకని మాతృత్వమును ఆమెలోంచి ఉద్భుదం చేస్తున్నాడు శంకరుడు. ‘మీ అన్నయ్య స్థితికారుడు. లోకముల నన్నిటిని నిలబెట్టాలి. ఇపుడు లోకములకు ఇబ్బంది వచ్చింది. మరి నేను ఆయనను సంతోష పెట్టాలి కదా! అందుకని నేను హాలాహలమును త్రాగేస్తాను.
శిక్షింతు హాలాహలమును భక్షింతును మధురసూక్ష్మ ఫలరసము క్రియన్
రక్షింతు ప్రాణి కోట్లను వీక్షింపుము నీవు నేడు వికచాబ్జముఖీ!
నేను ఈ హాలాహలమును చిన్న ద్రాక్షపండును తినేసినట్లు తినేస్తాను. దానివలన నాకేమీ ఇబ్బంది రాదు. అలా చేసి ఈ ప్రాణికోట్లనన్నిటిని రక్షిస్తాను. అది నా దివ్యమయిన లీల. నాకేమయినా అవుతుందని నీవేమాత్రం బెంగ పెట్టుకోనవసరం లేదు. నేనెలా తినేస్తానో సంతోషంగా చూస్తూ ఉండు’ అన్నాడు. పార్వతీ దేవి ‘సరే, మీకు ఎలా ఇష్టమయితే అలా చేయండి’ అంది.
మ్రింగెడు వాడు విభుండని మ్రింగెడిది గరళమనియు మేలని ప్రజకున్
మ్రింగు మనె సర్వమంగళ, మంగళ సూత్రంబు నెంత మది నమ్మినదో!
ఆవిడకు శంకరుడు త్రాగబోయేది విషం అని తెలుసు. విషం త్రాగితే ప్రమాదమనీ తెలుసు. త్రాగుతున్న వాడు తన భర్త అనీ తెలుసు. అయినా త్రాగమంది. ఆవిడ సర్వమంగళ. అందుకని తాగెయ్యమన్నది. శంకరుని జీవనమునకు హేతువు పార్వతీదేవి మెడలోని మంగళసూత్రమని పోతనగారు తీర్పు ఇచ్చారు. దేవతలందరూ జయజయధ్వానాలు చేస్తుంటే హాలాహలమునకు ఎదురువెళ్ళి దానిని చేతితో పట్టుకుని ఉండగా నేరేడు పండంతచేసి గభాలున నోట్లో పడేసుకుని మింగేశాడు. ఎదురు వెళ్ళినప్పుడు కానీ, పట్టుకున్నప్పుడు కానీ, నోట్లో పెట్టుకున్నప్పుడు కానీ మ్రింగినప్పుడు కానీ వేడికి ఆయన ఒంటిమీద ఒక్క పొక్కు పుట్టలేదు. ఇంత చల్లటి చంద్రుడు కందిపోలేదు. ఆయన చల్లని చూపులతో అలానే ఉన్నాడు. శంకరుని పాదములు నమ్ముకున్న వాడు హాలాహలం లాంటి కష్టము వచ్చినా కూడా అలా చల్లగా ఉంటాడు. అటువంటి వానికి బెంగ ఉండదు. ఆయన నోట్లో పెట్టుకుని మ్రింగుదామనుకున్నాడు. కంఠం వరకు వెళ్ళింది.
ఉదరము లోకంబులకును సదనంబగు టెరిగి శివుడు చటుల విషాగ్నిం
గుదురుకొన గంఠబిలమున బదిలంబుగ నిలిపె సూక్ష్మఫలరసము క్రియన్.
మింగేస్తే అడుగున అధోలోకములు ఉన్నాయి. కాలిపోతాయని మింగలేదు. పైన ఊర్ధ్వలోకములు ఉన్నాయి. కక్కితే ఊర్ధ్వలోకములు పోతాయి. పైకీ వదలలేదు, క్రిందకీ వదలలేదు. కంఠంలో పెట్టుకున్నాడు. ఆయన అలా చేసేసరికి పార్వతీ దేవి చాలా సంతోషించింది. లోకం పొంగిపోయింది. అప్పటినుండి ఆయనకు నీలలోహితుడు, నీలగ్రీవుడు అని పేరు వచ్చింది. ఆయనకు నీలకంఠుడు అని పేరు. ‘నీలకంఠా అని పిలిస్తే చాలు ఆయన పొంగిపోతాడు. హాలాహాల భక్షణం కథ వీనిన వాళ్లకి మూడు ప్రమాదములు జరుగవు. ఈ కథ వినిన వాళ్ళని పాము కరవదు. హాలాహలభక్షణం కథను నమ్మిన వాళ్ళని తేలు కుట్టదు. అగ్నిహోత్రంలో కాలిపోయే ప్రమాదములు రావు. అంతంత శక్తులు ఇటువంటి లీలలయందు ఉన్నాయి. వాటిని క్షీరసాగర మథనంలో ఆవిష్కరించి వ్యాస భగవానుడు ఫలశ్రుతి చెప్పారు.
మళ్ళీ అందరూ బయలుదేరి ఆనందంతో పాలసముద్రం దగ్గరకి వెళ్ళిపోయారు.క్షీరసాగర మథనం మొదలుపెట్టారు. అలా మథిస్తుంటే సురభి కామధేనువు పైకి వచ్చింది. ఆ కామదేనువుకి అందరూ నిలబడి నమస్కారం చేశారు. దేవమునులకు లౌకికమయిన కోరికలు ఉండవు. వారు కామధేనువు పాలతో హవిస్సులను అర్చిస్తాము అని అన్నారు. లోక కళ్యాణార్థం హవిస్సులను ఇస్తారు. ఆ గోవును స్వామి దేవమునులకు ఇచ్చి మీరు దీని పాలతో దేవతలకు హవిస్సులను అర్పించాలి. దేవతలు సంతోషించి వర్షములు కురిపిస్తారు. అందరూ బాగుంటారు. అందరికీ పనికి వచ్చేవాడికి కామధేనువు ఉండాలి. కామధేనువు దేవమునులకు ఇవ్వబడింది. వారు దానిని పుచ్చుకున్నారు.
https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage
instagram.com/pravachana_chakravarthy
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి