29, అక్టోబర్ 2022, శనివారం

నాగుల చవితి

 *ॐ              నాగుల చవితి శుభాకాంక్షలు* 


*పుట్టలో పాలు*


   "తోక తొక్కితే తొలగిపో! 

    నడుం తొక్కితే నా వాడనుకో! 

    పడగ తొక్కితే కస్సుబుస్సుమని మమ్ములను భయపెట్టకు తండ్రీ!" అని పుట్టలో పాలుపోస్తూ నమస్కరిస్తాం. 


విశేషం 


పాము 

* తోక తొక్కితే పగపడుతుందంటారు. అంటే ద్వేషంతో రెచ్చిపోతుంది. 

* నడుం తొక్కితే, బాధతో తొక్కినవాడి అంతు చూస్తుంది. 

* పడగ తొక్కితే బుసకొడుతూ భయపెడుతుంది. 


*ఖలునకు నిలువెల్ల విషం* 


తలనుండు విషము ఫణికిని, 

    వెలయంగా తోకనుండు వృశ్చికమునకున్ 

తలతోకయనక యుండు ఖలునకు 

    నిలువెల్ల విషము గదరా సుమతీ! 


*మనం సర్పమా? గోవు అవుతామా?* 


దోషో గుణాయ గుణినాం 

    మహదపి దోషాయ దోషిణాం సుకృతమ్ I 

తృణమివ దుగ్ధాయ గవాం 

    దుగ్ధమివ విషాయ సర్పాణామ్ ॥ 


* గుణవంతునికి ఎదుటివాని దోషాలు, దోషాలుగా కనబడక, సద్గుణాలతోనే చూడబడతాయి. 

  ఎవరకీ అక్కఱకురాని గడ్డితిని ఆవు, అందఱికీ పనికివచ్చే పాలనిస్తుంది కదా! 


* దోషికి ఎదుటివాని మంచిగుణాలు కూడా దోషాలుగానే కనబడతాయి. 

    అందరికీ ఉపయోగపడే పాలని తీసికొని, అందఱినీ చెరిపే విషాన్నిస్తుంది పాము. 


          *పన్నగ శయనా నారాయణా!*

         *- పన్నగ భూషణ సదాశివ !* 


*ఆదిశేషుడు - వాసుకి* 


* ఆదిశేషుడు విష్ణుమూర్తికి పానుపయ్యాడు. 

    స్వామికి సేవచేస్తూంటాడు. 

   *మనమూ జీవలోకమంతటా వ్యాపించియున్న విష్ణువుని  సేవించుకొంటాం.* 


* వాసుకి శివునికి ఆభరణమయ్యాడు. 

    స్వామితోపాటు గౌరవం పొందుతుంటాడు. 

    *వాసుకి శివునితో కూడియుండడం వలన గౌరవం కలిగినట్లే,* 

    *మనలోని చిదానందరూపుడైన శివునితో కూడి మంగళకరమైన జీవితాన్ని కలిగియుంటాం.* 


*సముద్రమథనం* 


    దేవతలూ రాక్షసులూ, 

    మంధర పర్వతాన్ని కవ్వంగాచేసి, 

    వాసుకిని కవ్వానికి తాడుగా చేసి, 

    విషం శివుడు త్రాగగా, 

    అమృతం దేవతల పరమై శాశ్వతత్వాన్నిచ్చింది. 


*అన్వయం* 

 

    *మెదడనే మంధర పర్వతంతో,* 

    *నరాలనే వాసుకితో, చిలికి,*  

   *"చిదానందరూప శివోఽహం శివోఽహం" అన్నట్లు,* 

     *మనలోని శివుడుగా మనం,*  

    *"రాగద్వేషాదు"లనే విషాన్ని మ్రింగి (లేకుండా చేసికొని),*

    *"ఆత్మతత్వం" తెలుసుకొని,*

      *ఆ అమృతంతో  శాశ్వతులమవుదాం.* 


                              =x=x=x= 


    — రామాయణం శర్మ 

             భద్రాచలం

కామెంట్‌లు లేవు: