29, అక్టోబర్ 2022, శనివారం

వేద పరిరక్షణ – మన కర్తవ్యం

 వేద పరిరక్షణ – మన కర్తవ్యం


ఒకసారి చెన్నపురిలో స్వామి వారికి కనకాభిషేకం జరిగింది. భక్తుల కోరిక మేరకు ఆయన కంచి నుండి చెన్నైకు ఒక దేవస్థాన కుంభాభిషేకానికి విచ్చేశారు. అప్పుడు ఆయన వచ్చిన కార్యం గురించి ఇచ్చిన అనుగ్రహభాషణం సంగ్రహంగా:


“నేను ఒక పల్లెటూరులో హాయిగా నా పూజలు జపాలు, ధ్యానాలు చేసుకుంటూ మఠం నడుపుకుంటూ వున్నాను. నేనిక్కడకు మీరిచ్చే కానుకల కోసమో, కనకంతో అభిషేకం మీద మక్కువతోనో రాలేదు. చిన్న మఠం నడుపుకోవడానికి నాకు పల్లెటూరులో వచ్చే విరాళాలు చాలును. మీ అందరి సంతోషం కోసం నన్ను పిలిచారు. కానీ దీనితో పాటు నా వ్యాపారం కూడా కొంత వుంది అందుకు రాక తప్పలేదు.


వేదం, దాని అనుష్టానం అడుగంటుతోంది. దాని ప్రాముఖ్యత తెలియజేయడానికి అటువైపు బ్రాహ్మణులను ఉద్యుక్తులను చెయ్యాలని నా కర్తవ్యం. ఆరిపోతున్న ఈ దీపాన్ని పునరుద్ధరించాలని నా తాపత్రయం. ఇటువంటి మహానగరాల్లో నా మాటలు వినడానికి వేలల్లో, లక్షల్లో వచ్చారు. ఏ ఒక్కడు, ఏ పది మందో నా మాట విని ఆచరించినా నా కార్యం సఫలీకృతమవుతుంది. నాలుగు తీపి మాటలు చెప్పడానికి కాదు నేనోచ్చింది, ఏది సరైన మార్గమో తెలియచేసి పాటించగలిగేలా చెయ్యాలని వచ్చాను. దీనివలన మీలో చాలామందికి మనస్తాపం కలిగించిన వాడనవ్వవచ్చు.


మీలో ఎందరో బ్రాహ్మణులు మీ వైదిక విధులను వదిలేసి ఆధునిక జీవన సరళికి అలవాటు పడ్డారు. కానీ మీరు ఈ విజ్ఞానాన్ని చూస్తూ వదులుకోవడాన్ని నేను హర్షించాను. మీ పిల్లలకు 8వ ఏట నుండి 18 ఏళ్ళు వచ్చేవరకు రోజుకొక్క గంట వేదం నేర్పించండి. వాటి ప్రయోగం నేర్పించండి. అదే నాకు నిజమైన కనకాభిషేకం. ఎక్కడో విదేశాలలో ఒక యూనివర్సిటీ లో మంచి కోర్స్ వుందంటే మీరు వెనుకాడక శ్రమకోర్చి వెళ్లి నేర్చుకుంటున్నారు. వేదాభ్యాసం శ్రమతో వ్యవహారం అని వదలవద్దు. అది శ్రమైనా దాని వలన మీకు కలిగే శ్రేయస్సు అపారం. ఎందరో విదేశీయులు మన వేదాంతాన్ని, వేదసారాన్ని తెలుసుకోవడం కోసం మన దేశాన్ని ఆశ్రయిస్తున్నారు. మనమే మన వేదాన్ని అపహాస్యం చేసుకోవడం ఎంతవరకు సబబో ఆలోచించండి. వేదం ప్రపంచ శాంతికి ఉద్దేశించబడింది. మనది వేదభూమి. కలిలో కల్కి అవతరించబోయేది దక్షిణదేశంలో ఒక సనాతన బ్రాహ్మణుని ఇంటిలోనే. ఎవడైతే వేదమతదూషణ, ఖండన చేస్తారో వారిని అంతమొందిస్తాడు. నేడు సంఘంలో కట్టుబాట్లు లేకుండా పోయాయి. విచ్చలవిడితనం ఎక్కువయిపోయింది. ఈ కట్టుబాట్లు మనిషిని దిద్దడానికే కానీ అతడిని ఇబ్బంది పెట్టడానికి కాదు. 


ఆది శంకరాలు ఆయన దేహత్యాగం చేసేముందు అందరినీ ఉద్దేశించి ఆయన బోధనా సారాంశంగా ఐదు శ్లోకాలను చెప్పారు. అందులో మొదటిది “వేదం నిత్యం అధియతం”. ఇప్పుడు నా కర్తవ్యం కూడా అదే. అన్ని చోట్లకు వెళ్లి వాళ్లకు ఇదే ఉపదేశిస్తున్నాను. ఇన్ని వేలమందిలో కనీసం ఒక పదుగురైనా నా మీద గౌరవంతో నేను చెప్పినట్టు చేయ్యకపోతారా అని. పట్టణీకరణ వలన ఎన్నో సదుపాయాలు వచ్చినా వాటితో ఎన్నో అనర్ధాలు కూడా వచ్చాయి. స్వధర్మాన్ని నిరసిస్తున్నారు. మీరు కొద్దిగానైనా పూర్వపు పద్ధతులను అనుసరిస్తానంటేనే నేను మరల వస్తాను. ఒక ఉద్యోగం చేస్తున్న ఒక లాయరు ఒక విధమైన వస్త్రధారణతో ఉండట్లేదా, అలాగే ఒక ప్యూను. అలాగే బ్రాహ్మణుడు కూడా పంచకచ్చ, శిఖా వుంచుకోవాలి. ఇప్పటికే ఎన్నో ఇబ్బందుల్లో వున్నారు, నేను వచ్చి మళ్ళీ మీ లోపాలను గుర్తు చెయ్యాలా? మీ మనోల్లసానికి కచేరీలు చేసేవారు ఎందరో వున్నారు. నేనిక్కడకు కచేరి చెయ్యడానికి రాలేదు ధర్మం ప్రభోధించడానికి వచ్చాను. నేను ఎవరిమీదా అజమాయిషీ చేయ్యగోరట్లేదు. మీ చెవులు కొంత సమయం నాకు కేటాయించమని కోరుతున్నాను. ఇప్పటికే ఎంతో నష్టపోయాము. ఇంకా పోయినదాని గురించి శోకించడం కన్నా మిగిలి వున్న కొద్దిపాటి సంస్కారాన్ని ఉద్ధరించాలి. పురాతనమైనది అంతా గొప్ప అని చెప్పను అలాగని నవ్యమైనది అంతా రోత అని చెప్పను. అన్నింటిలో మంచిని గ్రహించాలి. భక్తి, జ్ఞానం, సంస్కారం గురించి కొంత చెప్పాను. కానీ ఇవన్నీ ఒక విత్తునుండి వచ్చినవే. అదే వేదం, వేదసంస్కారం, సనాతన ధర్మం. దాన్ని వదిలి మిగతావాటిని పట్టుకున్నా లాభం లేదు. 


ప్రతి బ్రాహ్మణుడు వేదం నేర్చుకోవాలి. తన కుమారునికి వేదం నేర్పాలి. ఇది చెయ్యలేకపోయినా వేదఘోష ఆగకుండా వేదాభ్యాసం చేసేవారిని ప్రోత్సహించాలి. అవి పోషణకోసం ఎదురుచూస్తున్నాయి. వేదం నేర్పెవారికి, నేర్చుకునేవారికి సరైన ఆర్ధిక చేయూతనివ్వాలి. ఇంకా వేదపాఠశాలలు నెలకొల్పాలి. సరైన విధానంలో పరీక్షలు జరగాలి. చదువుకునేప్పుడు, ఉత్తీర్ణత అయ్యాక వారికి తగిన ప్రోత్సాహకాలు ఇవ్వాలి. కొన్ని ట్రస్ట్లు మొదలయ్యాయి. మీరు నేరుగా చెయ్యలేకపోతే వీరి ద్వారా ప్రోత్సహించండి. ప్రతి ఒక్కరు నాకోసం ప్రతి నెలలో మీ జన్మ నక్షత్రంలో ఒక్క రూపాయి కిడ్డి బ్యాంకు లో వెయ్యండి (ఇప్పుడు మనం వందగా అన్వయించుకోవచ్చు). సంవత్సరాంతానికి ఇది 12/- (మనం 1200 అనుకుందాం) అవుతాయి. దాన్ని వేదపరిరక్షణ నిధికి జమ చెయ్యండి. మీరు నాకు స్వయంగా ఇస్తున్నారనుకోండి. తప్పేమీ లేదు నేనే అడుగుతున్నాను కదా!!. మీకు మఠం నుండి ఆశీర్వచనాలు, ప్రసాదం అందుతాయి. నేను మీకు విధించిన టాక్స్ లేదా సుంకం అనుకోండి. వేదపరిరక్షణ మన అందరి కర్తవ్యం. భావితరాలకు మనం అందివ్వబోయే గొప్పవరం. ఈ పరిరక్షణకు ఈ కొద్ది మంది ఎలా సరిపోతారా అనుకోకండి. ఊరి మొత్తానికి విద్యుత్తు ఉత్పత్తి చేసే కేంద్రంలో 4-5 పని చేస్తే ఊళ్ళో లక్షలమందికి శక్తి వస్తున్నట్టు ఈ బ్రాహ్మణులు జనాభాలో ఈ కొద్దిపాటి వున్నా వారు వేదగానం చేస్తే చాలు కోటానుకోట్ల జనాలు చల్లగా వుంటారు. వారిని ప్రశాంతంగా చూసుకోవలసిన బాధ్యత మీది, నాది అందరిదీ.


--- శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి అనుగ్రహ భాషణం నుండి


#KanchiParamacharyaVaibhavam #Paramacharya

కామెంట్‌లు లేవు: