28, అక్టోబర్ 2022, శుక్రవారం

మహాస్వామి వారి మేధస్సు

 మహాస్వామి వారి మేధస్సు


ఈ విషయం నా దగ్గరకు చికిత్సకు వచ్చే కోయంబత్తూరు వ్యక్తి ఒకరు చెప్పారు. 1960లలో మహాస్వామివారు కోయంబత్తూరు విచ్చేసినప్పుడు దారిలో వస్తున్నా మహాస్వామివారికి ఈ వ్యక్తి పూర్ణకుంభం సమర్పించాడు. తరువాత స్వామివారితో, “పరమాచార్య స్వామివారికి బహుశా గుర్తులేదేమో, ముప్పై ఏళ్ల క్రితం ఇదే రోడ్డులో మీరు వచ్చినప్పుడు మా నాన్నగారు మీకు పూర్ణకుంభం సమర్పించారు” అని చెప్పాడు. అందుకు స్వామివారు, “అవును. కాని అప్పుడు మీరు ఎదురుగా ఉన్న ఇంటిలో ఉండేవారు. ఇప్పుడు ఉన్న ఇంటిలో కాదు కదా!” అని అన్నారు. అంతటి జ్ఞాపకశక్తికి సూపర్ హ్యూమన్ అన్న విశేషణం కూడా సరిపోదేమో!


ఒకసారి మేము కర్నూలులో అనుకోకుండా చరిత్ర, భూగోళం గురించిన పాఠం విన్నాము. మేము శ్రీమఠం మకాంచేసిన ప్రాంతంలోని ఒక కుటీరంనుండి ఒక ఉపాధ్యాయుడు కంబోడియా మరియు థాయ్ ల్యాండ్ దేశాల ప్రజలు, చరిత్ర, మతాలు, ఆచారాలు, వారి జీవన విధానం గురించిన పాఠం చెప్పడం లీలగా విన్నాము. మేమనుకున్నాము బహుశా ఎవరో వేదపండితుడు పాఠశాలలో చదువుతున్న తన కుమారునికి బోధిస్తున్నాడు అని. కొద్దిసేపటి తరువాత ఆ కుటీరం నుండి మహాస్వామివారు బయటకువచ్చారు. అప్పుడు మాకు అర్థం అయ్యింది. ఇప్పటిదాకా మహాస్వామివారు అంతకు కొద్దిరోజుల ముందే సన్యాసం స్వీకరించిన బాల పెరియవతో సంభాషిస్తున్నారని. అన్ని విషయాలపై మహాస్వామివారికున్న పట్టు చూసి ఆశ్చర్యపోయాము.


పరమాచార్య స్వామికున్న మేధస్సు, వివిధ విషయాలపై ఉన్న అవగాహన అసాధారణం. ఒకసారి కాంచీపురం దగ్గర ఉన్న శివాస్థానంలో మహాస్వామివారు మకాం చేస్తున్నారు. దర్శనానికి మేమి అక్కడకు వెళ్ళాము. ఒక భక్తుడు అక్కడకు వచ్చి భౌతికశాస్త్రానికి సంబంధించిన ఒక సిద్ధాంతం గురించిన వ్యాసం అచ్చువేయబడిన కాగితాలను స్వామి ముందు పెట్టాడు. మద్రాసు విశ్వవిద్యాలయానికి పి హెచ్ డి కోసం దీన్ని సమర్పిస్తున్నాని, స్వామివారి ఆశీస్సులు కావాలని తెలిపాడు. అది చాలా సాంకేతికమైన క్లిష్ట విషయం. స్వామి కొన్ని క్షణాలు ఇరవై పేజీలున్న ఆ పొత్తాన్ని చూసి దాన్ని పక్కన పెట్టి ప్రసాదం ఇచ్చి పంపారు. కొద్దిసేపటికి ఆ భక్తుడు వెల్లిపోయిన తరువాత న ఆవైపు తిరిగి,

స్వామివారు : “దీన్ని తీసుకుని, ఆ చెట్టు నీడలో కూర్చుని, దీన్ని జాగ్రత్తగా చదివి, దాని సారాశం నాకు చెప్పు”


నేను దాన్ని తీసుకుని ఒక అరగంట పాటు దాన్ని చెదివి స్వామివద్దకు తిరిగొచ్చాను.


స్వామివారు : దాన్ని చదివావా? అర్థం అయ్యిందా?


నేను దాని గురించి చెప్పడం మొదలుపెట్టాను. రెండు మూడు నిముషాల తరువాత స్వామివారు మధ్యలో ఆపారు.


స్వామివారు : నువ్వు చెబుతున్నది నేను అంగీకరించను. మొదటి పేజిలో ఉన్న రెండవ పేరా, నాల్గవ పేజిలో ఉన్న మొదటి పేరా ఒకదానికొకటి విరుద్ధంగా లేవూ? వెళ్ళు మరలా చదువు.


నేను ఆశ్చర్యపోయాను. నేను మరలా చెట్టు నీడకు వెళ్లి శ్రద్ధగా చదివాను. పరమాచార్య స్వామివారు చెప్పింది నిజం. అరగంట పాటు చదివినా నాకు కనపడని ఆ విషయం, కేవలం క్షణాల్లో భక్తులకు దర్శనం ఇస్తూ ఒకసారి అలా తిరిగేసిన స్వామివారికి కనపడింది.


నన్ను వారు పరీక్షిస్తున్నారు అని అర్థం అయ్యింది. బహుశా అహంకారమనే బుడగని సుతిమెత్తగా బద్దలుకొడుతున్నారు.


--- ప్రొ. యస్. కళ్యాణరామన్, న్యూరోసర్జన్, చెన్నై. “మూమెంట్స్ ఆఫ్ ఎ లైఫ్ టైం” నుండి.


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: