ॐ ఆరు సుఖాలు
అర్థాగమో నిత్య మరోగితా చ
ప్రియా చ భార్యా ప్రియవాదినీ చ I
వశ్యశ్చ పుత్రోఽర్థకరీ చ విద్యా
షడ్జీవ లోకస్య సుఖాని రాజన్ ॥
- విదురనీతి
1. సంపదలు ఆగమ రూపంగా వస్తూ ఉండాలి. అవి ఉన్నదాన్ని నాశనం చేసి రాకూడదు.
2. వాటిని అనుభవించడానికి మనం నిత్యమూ ఆరోగ్యంగా ఉండాలి.
రోగిష్ఠి వారికి సంపదలున్నా అనుభవించే యోగ్యత ఉండదు.
3. మనకు నచ్చిన ప్రియురాలైన భార్య ఉండాలి.
ప్రియురాలు అంటే పరలోక సుఖాన్ని అందించేది అని అర్థం.
అందఱు భార్యలూ ప్రియురాండ్రు కాలేరు.
ఇది ఈ లోకంలో భర్తచేసే ధార్మిక కార్యక్రమాలన్నిటికీ భార్యగా సహకరించడం వలన, వాటి ధర్మఫలం భర్తకి లభిస్తుంది.
(భర్తకు లభించే పుణ్యంలో సగం భార్యకి చెందుతుంది)
4. ఆమె ఎప్పుడూ భర్తకి ఇష్టమైన విధంగా పలికే హృదయజ్ఞురాలైనది కావాలి. అప్పుడే అర్థాంగి (better half) అవుతుంది.
(కుమ్మరి పురుగులా, కందిరీగలా అస్తమానూ దొలిచేదీ, గొణిగేదీ కాకూడదు
- ధూళిపాల వారి వ్యాఖ్య).
5. తన మాట విని, తనకు అనుకూలంగా నడుచుకునే వశ్యుడైన పుత్రుడు మరొక గొప్ప సౌఖ్యం.
మన సంపదకు ముఖ్య వారసుడూ, అనుభోక్తా, ఆహ్లాద కారుడూ అయిన కుమారుడు కలిగి ఉంటే, అది ఉన్నతమైన సంపద.
6. విద్యావంతులమై, ఆ విద్య మనకు ప్రయోజనకారి ఐనప్పుడు అది అసలైన సంపద. అది సౌఖ్యకారిణి అవుతుంది.
ఎంతటి వేదశాస్త్ర పండితుడైనా, మునిగిపోతున్న నావనుండి ఉరికి ఈతతో రక్షించుకో గలిగినప్పుడే ప్రయోజనం. మన జీవనాన్ని సురక్షితం చెయ్యాలి విద్య.
మనకు ఎన్ని సంపదలున్నా, మన పనులు మనమే చేసుకోవలసివస్తే, అది సంపదలోకి లెఖ్ఖరాదు. దాసదాసీ జనులవల్ల మన సంపద అనుభవంలోకి వస్తుంది.
కొన్ని దేశాలలో ఈ విధానం లేక, వాటిననుసరించే మన దేశంలోనూ అది ప్రవేశించింది. తద్వారా ఇతరుల ఉపాధికి గండిపడుతోంది.
=x=x=x=
— రామాయణం శర్మ
భద్రాచలం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి