17, డిసెంబర్ 2022, శనివారం

పండితులను గౌరవించే పరమాచార్యులు

 పండితులను గౌరవించే పరమాచార్యులు


నా మాతామహులు శ్రీమాన్ కృష్ణ శాస్త్రిగారు పెద్ద సంస్కృత పండితులు. 1940-50ల కాలంలో మయూరంలోని మునిసిపల్ హైస్కూలులో ఉపాధ్యాయులుగా పనిచేశారు. వారికి సంస్కృతంలో ఉన్న అపార పాండిత్యంతో భాష్యం, యోగా వాసిష్టం, జ్ఞాన వాసిష్టం బోధించేవారు.


మా తాతగారి పాండిత్యం, జ్ఞానం గురించి తెలుసుకున్న మహాస్వామి వారు వారిని కంచి మఠానికి ఆహ్వానించినట్టు నేను విన్నాను. కానీ మఠాధిపతులు అందరూ పూర్ణ సన్యాసులవలే కాకుండా రాజ సన్యాసులవలే కిరీటం, సింహాసనం, రాజులవలే బిరుదులతో ఉంటారని శాస్త్రిగారు వెళ్లడానికి సుముఖత చూపలేదు. కానీ మహాస్వామి వారికి శ్రీ కృష్ణ శాస్తి గారిని గౌరవించాలని కోరిక.


తమిళ ఖర నామ సంవత్సరంలో, పరమాచార్య స్వామివారు మయూరంలో మకాం చేస్తున్నారు. అప్పుడు ఒకనాటి ఉదయం శాస్త్రిగారు పరిమళ రంగనాథ దేవాలయ తిరుమంజన వీధిలోని తమ గృహంలో పాఠం చేస్తున్నారు. ఎవరూ అనుకోని విధంగా మహాస్వామి వారు శాస్త్రిగారి ఇంటికి వచ్చి, బయట అరుగుపైన కూర్చుని పాఠం పూర్తయ్యేదాకా ఓపికగా వింటున్నారు.


స్వామివారి రాక గురించి తెలియగానే శాస్త్రి గారు పరుగుపరుగున బయటకు వచ్చి స్వామివారిని గౌరవించారు. తరువాత మహాస్వామి వారు ఒక వెండి పళ్ళెం, ఉన్ని శాలువా, చీర, పంచె, ధనం మరియు ప్రసాదంతో శాస్త్రిగారిని సత్కరించి, వారి సంస్కృత పాండిత్యానికి ఇది సన్మానంగా భావించమని కోరారు.


కృష్ణ శాస్త్రి గారి కుమార్తె అయిన మా తల్లిగారు మాతృశ్రీ పార్వతీ అమ్మాళ్, ఈ విషయాన్ని తన జీవితంలో చాలా అరుదైన, అమోఘమైన మరపురాని సంఘటనగా చెబుతారు.


మహాస్వామి వారు సిద్ధి పొందే కొన్ని రోజులకు ముందు, కాంచీపురంలో నేను వారిని దర్శించుకుని, ‘మయూరమ్ శ్రీ కృష్ణ శాస్త్రి గారి మనవడినని’ తెలిపినప్పుడు, స్వామివారు నా మాటలను అర్థం చేసుకుని నన్ను ఆశీర్వదించారు. అది నాకు ఆధ్యాత్మిక ఉల్లాసాన్ని కలగజేసింది.


సంస్కృత పండితులను వెతికి పట్టుకుని, వారిని గౌరవించే పరమాచార్య స్వామివారి ఉదార స్వభావాన్ని మనం సునిశితంగా పరిశీలించాలి.


--- యమ్. ఆర్. బాలసుబ్రమణియన్, తిరుచ్చి. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 6


అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: