1, జులై 2023, శనివారం

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 107*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 107*


మగధ సామ్రాజ్యపు పొలిమేరలలో విడిది చేశాయి మలయకేతు సేనలు. తుచాత, మలయా, కాశ్మీర, సింధు, పారశీక రాజ్యాల సైన్యాలు గుడారాలు నిర్మించుకొని విశ్రాంతి తీసుకుంటూ యుద్ధ ప్రకటనకై ఎదురుచూడసాగాయి. 


బాగురాయణుడు ఒంటరిగా నున్న మలయకేతును దర్శించి "రాక్షసామత్యులకీ చంద్రగుప్తునికీ మధ్య పరస్పర రహస్య వార్తలు జరగకుండా మనం జాగ్రత్త పడడం మంచిది" అన్నాడు. 


మలయకేతు తల పంకించి "నిజం, కానీ గూడచర్యం జరగకుండా కట్టడిచేసే ఉపాయం ఏమిటి ?" అని అడిగాడు. 


అలెగ్జాండర్ అనంతరం మలయకేతుని అంటిపెట్టుకుని ఉన్న వినయుడు కల్పించుకుని "ఏముందీ.... సర్వసైన్యాధ్యక్షులు మన బాగురాయణుల వారి వద్ద నుంచి గుర్తింపు పత్రం లేకుంటే ఎవ్వరినీ మన శిబిరాలు దాటి వెళ్ళనివ్వరాదు. లోనికి రానివ్వరాదు" అని సలహా ఇచ్చారు. 


మలయకేతుకి ఆ సలహానచ్చి బాగురాయణుడిని సర్వసైన్యాధ్యక్షునిగా ప్రకటించి అతని వద్ద నుంచి అనుమతి పత్రం లేనిదే ఎవ్వరూ రాకపోకలు జరపరాదని శాసించాడు. ఆ శాసనం తక్షణం అమలులోకి వచ్చింది.


రాక్షసామాత్యునికి మాట మాత్రం చెప్పకుండా మలయకేతు అంత ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నా రాక్షసుడు మారుమాట్లాడలేకపోయాడు. కానీ... 


"మగధలో మా చేతిక్రింద పనిచేసిన బాగురాయణుడికి సర్వసైన్యాదక్ష పదవి కట్టబడితే... అతని నాయకత్వం క్రింద మేము పనిచెయ్యలేము...." అంటూ భద్రభట, డింగరాత్తా, బలగుప్తాదులు బహిరంగంగానే విభేదించి ఆ యుద్ధంలో తాము ఎవ్వరి పక్షానా పాల్గొనేది లేదని చెప్పి వెళ్ళిపోయారు. 


ఇక యుద్ధ ప్రకటనకు ముహూర్తాన్ని త్వరగా పెట్టించమని రాక్షసుడిని ఆదేశించాడు మలయకేతు. రాక్షసుడు తక్షణం జీవసిద్ధిని పిలిపించుకొని యుద్ధ ప్రారంభానికి ముహూర్తాన్ని నిర్ణయించమన్నాడు. 


జీవసిద్ధి చాలా సేపు చేతివేళ్ల మీద, గోచార, గ్రహగతుల లెక్కలు గుణించి "మలయకేతుకి విజయం లభించే సూచనలు ఏ మాత్రం కానరావడం లేదు. మూడు, నాలుగు రోజుల వరకూ గ్రహాల గతులు బాగాలేవు. ఆ తర్వాతే సుముహూర్తం విషయము ఆలోచించడం మంచిది" అన్నాడు. 


అప్పటికే మలయకేతు నుంచి తీవ్ర నిరాదరణ ఎదుర్కొంటున్న రాక్షసుడు, ఇప్పుడు ముహూర్తం కుదరకపోతే అతడు తనని మరింత అవమానిస్తాడన్న భయంతో, ఆ విసుగుని జీవసిద్ధి మీద ప్రదర్శిస్తూ "మూడు నాలుగు రోజుల దాకా ముహూర్తాలు లేవంటావేమిటి ? అప్పుడు నందుల విషయంలో ఇలాగే తాత్పర్యం చేశావు. అది వాళ్ళ చావుకు వచ్చింది. ఇప్పుడెవరి పీకల మీదికి తెద్దామనీ.... ?" అంటూ చిరాకుపడ్డాడు. 


ఆ మాటలకు జీవసిద్ది మండిపడి "చావులూ, పీకలు కొయ్యటాలు మీలాంటి వాళ్ళు చేస్తారు... మా కలాంటి దుర్భుద్దులు లేవు. ఇంత మాట పడ్డాక మీ స్నేహం మాకొద్దు. మీ ఇష్టమొచ్చిన వాళ్ళని పిలిపించుకొని పెట్టించుకోండి... ముహూర్తాలు...." అనేసి ఆ గూడారం నుంచి బయటికి వెళ్లిపోయాడు. 


ఆ సంఘటనతో నిశ్చేష్టుడయ్యాడు రాక్షసుడు. 

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: