ॐ ఆషాఢ మాసం - ప్రత్యేకత - III
చాతుర్మాస్య దీక్ష
ఆషాఢ మాసంలోని పౌర్ణమి నుంచీ ప్రారంభించి, సన్యాసులూ,
శుక్ల ఏకాదశి నుంచీ ప్రారంభించి ఇతరులూ నాలుగు మాసాలపాటు ఒకే చోట ఉండి, ప్రత్యేకంగా చేసే దీక్షయే "చాతుర్మాస్య దీక్ష".
ఒక అభిప్రాయం
పూర్వం చాలా ప్రదేశాలలో మట్టిదారులే ఉండేవి.
వర్షాకాలంలో సంచరించుట కష్టంగా ఉండేది.
ఆ కాలంలో వర్షాలు కూడా ఎక్కువ. నదులు దాటటానికి ఇప్పటిలాగా వంతెనల సౌకర్యాలు లేవు. రవాణా వ్యవస్థకూడా ఉండేది కాదు.
అందుచేత ఆ నాలుగు నెలలు ఒక్క దగ్గరే ఉండి చాతుర్మాస్యం చేపట్టుచుండేవారు.
మరిప్పుడు ఆచరించాలా? అనే సందేహం కలగుతుంది.
అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఇది ఆచరించవలసిన దీక్షయే!
యతులు
1. పరివ్రాజకులుగా సంచరిస్తూ ఉండేవారు (Moving Saints)
2. స్థిరంగా ఉండే, ఆశ్రమ - పీఠాధిపతులు (Stationary Saints)
దీక్ష - ప్రమాణాలు
1. శ్రుతి ప్రమాణం
"అష్టౌమాస ఏకాకీ యతిశ్చరేత్" అనే శ్రుతివచనాన్ని అనుసరించి,
యతీశ్వరుడు సంవత్సరంలో ఎనిమిది నెలలు సంచరించుచునే ఉంటాడు.
ఆయన ఒక్కొక్క రాత్రిని ఒక్కొక్క చోట గడుపుచూ తిరుగుతుంటారు.
సంచార సమయంలో సాయంకాలం అయ్యేచోట ఆగి, అచ్చట సజ్జనులు సమకూర్చెడి భిక్షను స్వీకరిస్తారు.
ఆ రాత్రికి అచట ఉండి, మరునాడు ఆ ప్రదేశాన్ని వీడి, వెళ్ళిపోతుంటారు.
(Moving Saints)
కాబట్టి మిగిలిన నాలుగు మాసాలూ ఈ దీక్ష ద్వారా ఒకేచోట నివసించి,
- శక్తి పెంచుకుంటూ,
- జ్ఞానాన్ని అక్కడ వారికి సమగ్రంగా పంచిపెడతారు.
2. రామాయణ ప్రమాణాలు
(i) రాజు లేని రాజ్యం గురించి చెబుతూ,
రాజు లేని రాజ్యంలో,
- ఎల్లప్పుడూ ఒంటరిగానే సంచరించువాడూ,
- ఇంద్రియ నిగ్రహం కలవాడూ,
- మనస్సులో ఆత్మస్వరూపాన్ని గూర్చి ధ్యానము చేయువాడూ,
ఎక్కడ సాయంకాలం అవతుందో, అక్కడనే గృహంగా భావించి ఆ రాత్రి నివసించేవాడూ అయిన ముని సంచరించడు - అనడం సంచార మునుల (Moving Monks) విధి తెలియజేస్తుంది.
నారాజకే జనపదే
చరత్యేకచరో వశీ I
భావయన్నాత్మనాత్మానం
యత్ర సాయంగృహో మునిః ৷৷
- అయోధ్యకాండ 67/23
(ii) సీతను వాల్మీకి ఆశ్రమసమీపంలో వదలి వస్తున్నప్పుడు, లక్ష్మణునితో సుమంత్రుడు
పూర్వము అత్రి మహర్షి పుత్రుడైన దుర్వాస మహాముని,
చాతుర్మాస్య దీక్షకై,
పవిత్రమైన వసిష్ఠాశ్రమమునందు నివసించెను.
(వార్షిక్యమ్ = వర్షాకాల సంబంధమైన చాతుర్మాస్యమును)
- అనడం ద్వారా, ఈ దీక్ష పాటింపబడేదని తెలుస్తుంది.
(వశిష్ఠుడు, భరద్వాజుడు, అగస్త్యుడు,... - Stationary Monks,
దుర్వాసుడు - Moving Monk)
పురా నామ్నా హి దుర్వాసా
అత్రేః పుత్రో మహామునిః I
వసిష్ఠస్యాశ్రమే పుణ్యే
వార్షిక్యం సమువాస హ ॥
- ఉత్తరకాండ 51/2
(iii) సుగ్రీవ పట్టాభిషేకానంతరం, వర్షాకాలం, లక్ష్మణునితో శ్రీరాముడు
"పరమహంస"లుగా కీర్తింపబడు సన్యాసులు చాతుర్మాస్య దీక్షల కారణంగా సంచారములు మానుకొని తమ ఆశ్రమములకు చేరిరి
- అనే ధ్వని వచ్చేవిధంగా,
"మానస సరోవరమునందు నివసించుటకు ఆరాటపడే హంసలు స్వస్థానానికి బయలుదేరాయి."
(సంప్రస్థితా మానసవాసలుబ్ధాః
- కిష్కింధ 28/16 ) అంటాడు.
ఈ దీక్ష అసలు లక్ష్యం
అ) చాతుర్మాస్య వ్రతం ఒకవైపు ఆరోగ్యానికి సంబంధించినది.
చాతుర్మాస్య వ్రతం పాటించే విధానం ఆషాడ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకూ
- మొదటి నెలలో కూరలు,
- రెండవ నెలలో పెరుగు,
- మూడవ నెలలో పాలు,
- నాల్గవ మాసం లో పప్పు దినుసులూ తినకూడదు.
(వీటి వివరాల తరువాయి భాగంలో)
ఆ) మరొకవైపు ఆధ్యాత్మికం.
భాగవతం వంటి గాథలు వింటూ ఆధ్యాత్మిక చింతనతో ఈ నాలుగు నెలలూ గడపాలి.
క్రమక్రమంగా వైరాగ్యాన్ని పొందే అభ్యాసమే ఈ దీక్ష.
మనం కూడా, మనమన గురుదేవులను ఆశ్రయించి, ఈ దీక్ష పాటిస్తూ, తద్వారా, ఇహపర సుఖాలు రెండూ పొందుదాం.
=x=x=x=
— రామాయణం శర్మ
భద్రాచలం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి