27, సెప్టెంబర్ 2023, బుధవారం

మహాలయ పక్షాల ప్రాధాన్యత

 మహాలయ పక్షాల ప్రాధాన్యత


భాద్రపద బహుళ పాడ్యమి నుంచి భాద్రపద అమావాస్య వరకు మధ్యనున్న పదునైదు దినములనూ ‘మహాలయ పక్షములు’ అంటారు. మరణించిన మన తండ్రి, తాత, ముత్తాతలను తలచుకుని పుత్రులు నిర్వహించే శ్రాద్ధ, తర్పణ, పిండప్రదానాది పితృయఙ్ఞ విధులన్నీ జరుపుకోవడానికి నిర్దేశిచబడిన ఈ పదునైదు రోజులనే ‘మహాలయ పక్షాలు’ అంటారు. వీటినే ‘పితృపక్షము’లనీ.., ‘అపరపక్షము’లనీ కూడా అంటారు. మరణించిన మన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి, వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షముల ముఖ్యోద్దేశ్యము.


పితృదేవతలకు ... ఆకలా?


అనే సందేహం మీకు కలుగవచ్చు. ఈ కనిపించే సకల చరాచర జగత్తు మొత్తం ‘ఆకలి’ అనబడే సూత్రం మీదనే నడుస్తోంది.


అన్నాద్భవంతి భూతాని - పర్జన్యాదన్న సంభవః

యఙ్ఞాద్భవతి పర్జన్యో - యఙ్ఞః కర్మ సముద్భవః


అన్నము వలన ప్రాణికోటి జన్మిస్తుంది. వర్షము వలన అన్నము లభిస్తుంది. యఙ్ఞము వలన వర్షము కురుస్తుంది. ఆ యఙ్ఞము కర్మ వలననే సాధ్యమౌతుంది. అంటే....

అన్నం దొరకాలంటే .... మేఘాలు వర్షించాలి.

మేఘాలు వర్షించాలంటే....దేవతలు కరుణించాలి.

దేవతలు కరుణించాలంటే...వారి ఆకలి తీరాలి. వారి ఆకలి తీరాలంటే యఙ్ఞాల ద్వారా వారి వారి హవిర్భాగాలు వారికి అందజేయాలి. ఎందుకు ఇంత తతంగం అని అడగొచ్చు.


మరణించిన ప్రాణి ‘ఆత్మ’ రూపంలో పితృలోకంలో ఉంటుంది. ఆ ఆత్మ తన పూర్వ కర్మానుభవం కోసం తిరిగి ఈ భూమిమీద ‘జీవాత్మ’గా అవతరించడానికి... అన్నాన్ని ఆశ్రయించి, తద్వారా పురుష ప్రాణి దేహంలో ప్రవేశించి, శుక్ల కణముగా రూపొంది, స్త్రీ గర్భకోశంలో ప్రవేశించి, శిశువుగా రూపాంతరం చెంది ఈ భూమి మీదకు వస్తుంది.

మరణిచిన మన పితరులకు మోక్షం కలగాలంటే .. కర్మ పరిపక్వం కావాలి. అలా జరగాలంటే ..పితృదేవతలు దేహధారణ చేసి ఈ లోకం లోకి రావాలి. అలా రావాలంటే వారికి అన్నాన్ని అందించాలి. అది రక్తం పంచుకు పుట్టిన పుత్రులే అందించాలి. అప్పుడే వారికి పితృఋణం తీరుతుంది. ఋణం తీరడమే ‘మోక్షం’ అంటే. రేపు మనకైనా ఇంతే.


తద్దినాలు పెడుతున్నాం కదా... మహాలయ పక్షాలు పెట్టాలా?


అనే సందేహం తిరిగి మీకు కలుగవచ్చు. మరణించిన తండ్రి తిథినాడు పుత్రుడు తద్దినం పెట్టడం హిందూ సాంప్రదాయంలో అనాది నుంచి వస్తున్న ఆచారం. పితృతిథినాడు పుత్రుడు తన తండ్రి, తాత, మత్తాతలను తలచుకుని పితృయఙ్ఞాన్ని నిర్వహిస్తాడు. మరి పుత్రులు లేనివారి సంగతి ఏమిటి? వారి గతి అథోగతేనా? అంటే..‘కాదు’ అంటుంది శాస్త్రం. మన కుటుంబాలలో ఏ కారణం చేతనో పెళ్లికాని సోదర, సోదరీలు మరణించి ఉండవచ్చు. లేదా..పెళ్లయినా సంతానం కలుగని దంపతులు మరణించి ఉండవచ్చు. లేదా ప్రమాదాల్లో మరణించిన చిన్నపిల్లలు ఉండవచ్చు. లేదా యుద్ధాలలో కానీ, శిక్షల ద్వారా కానీ, ఆత్మహత్యల ద్వారా కానీ, ప్రకృతి వైపరీత్యాల (వరదలు, భూకంపాలు) ద్వారా కానీ గుర్తు తెలియక మరణించి ఉండవచ్చు. అటువంటివారందరికి కూడా తిలోదకాలిచ్చి వారిని ఊర్థ్వలోకాలకు పంపడం కోసం ఈ ‘మహాలయ పక్షాలు’ నిర్దేశించబడ్డాయి. పితృతిథి నాడు మూడు తరాలవారికి (తండ్రి, తాత, ముత్తాత) మాత్రమే తిలోదకాలతో, పిండప్రదానం యివ్వబడుతుంది. కానీ ఈ ‘మహాలయ పక్షాలు’ పదునైదు రోజులు మన వంశంలో మరణిచిన వారందరికీ మాత్రమే కాక, పుత్రులు లేని గురువులకు (గురువు కూడా తండ్రితో సమానం) స్నేహితులకు కూడా తిలోదకాలతో, పిండప్రదానం ఇచ్చే అర్హత, అధికారం మనకు ఉంది. దీనినే ‘సర్వ కారుణ్య తర్పణ విధి’ అంటారు. ఏ కారణం చేతనైనా తద్దినం పెట్టలేని పరిస్థితి ఏర్పడి, తద్దినం పెట్టకపోతే.., ఆ తద్దినం పెట్టని దోషం ‘మహాలయం’ పెట్టడం వలన పోతుంది. మహాలయ పక్షాలు పదునైదు రోజులు మన పితృదేవతలు ‘మా వారసుడు పితృయఙ్ఞం చేయకపోతాడా.., మా ఆకలా తీర్చకపోతాడా’ అనే ఆశతో మన ఇంటిని ఆవహించి ఉంటారు. పితృయఙ్ఞం చేసిన వారసునికి సకల ఐశ్వర్యాలు కలగాలనీ...పిల్లపాపలతో ఆనందంగా ఉండాలనీ దీవిస్తారు. పితృయఙ్ఞం చేయని వారసుని వంశం.. నిర్వంశం కావాలని శపించి కోపంగా వెళ్ళిపోతారు. వంశం నిర్వంశం కావడం అంటే... సంతానం కలుగక పోవడమే కదా. సంతనం లేనివారి గతి ఎలా ఉండుందో తెలుసుకున్నాం కదా. అందుచేత తప్పకుండా ‘మహాలయ పక్షాలు’ పెట్టి తీరాలి.

కామెంట్‌లు లేవు: