3, నవంబర్ 2023, శుక్రవారం

నాగ స్తుతి

 శుభోదయం🙏


నాగ స్తుతి 

          ------------------- 


                  చ:  బహువన  పాదపాబ్ధి  కులపర్వత  పూర్ణ  సరస్సరస్వతీ


                       సహిత  మహా  మహీభర  మజస్ర  సహస్ర  ఫణాళిఁ  దాల్చి, దు


                       స్సహ తర  మూర్తికిన్  జలధి శాయికిఁ  బాయక  శయ్యయైన, య


                       య్యహిపతి  దుష్కృతాంతకుఁ  డనంతుడు,మాకు  బ్రసన్నుడయ్యెడున్! 


                           ఆం:  భారతము-- ఆదిపర్వము-  నన్నయ భట్టు ; 


                                       ఈరోజు కార్తీక  శుక్ల  చతుర్ధి. నాగుల  చవితి. గావున  నాగస్మరణము  నాగపూజనము మనసంస్కృతిలో

నొకభాగము. కడుపు చలవకై  మాతృమూర్తు లీనాడు ఉపవసించి  భక్తి శ్రధ్ధలతో  పుట్టలోపాలు బోసి సకల నాగ సమాహారము నారాధింతురు.నాగారాధన సంతతి ప్రదమని  మనవారి  విశ్వాసము. అందువలన నేఁడు సర్పరాజగు ఆదిశేషుని స్తవము ఈపద్యమున చేయబడు చున్నది.


                          ఉదంకుడు పౌష్యునిదేవేరి కుండలములను  నాగులనుండి తిరిగి పొందుటకై  నాగలోకమున కేగి వారలను ప్రసన్నులను

గావించుటకై  నాగస్తుతి  యొనర్చెను. అందులో నొకపద్యమిది.


అర్ధములు: బహువనములు: అనేక మైన యడవులు; పాదప- వృక్షములు; అభ్ధి- సముద్రము; పూర్ణ- నిండిన;  సరః సరస్వతీ-నదులు సరస్సులు; సహిత- కూడిన; మహామహీభరము- గొప్పభూభారమును; అజస్ర- నిరంతరము; సహస్ర- వేయి; ఫణాళి-పడగల సముదాయము; దుస్సహతరమూర్తి- భరింప వీలుగానియాకారముగలవాడు: జలధిశాయి- సముద్రమున పరుండు; బాయక-విడువని; శయ్య-పానుపు; దుష్కృతాంతకుడు-పాపులను దునుమాడు వాడు; అనంతుడు- ఆదిశేషువు; ప్రసన్నుడగుట-దయగలవాడగుట; 


                భావము: అనేకమైన యడవులు ,(పర్వతములు) వృక్షములు , కులపర్వతములతోను నిండి, నదీనదములతోను సరస్సులతోను కూడియున్న సువిశాలమైన యీ భూభారమును  యెల్లవేళలయందునూ  తన వేయిపడగలపై  మోయుచు, సకల లోక గర్భుడై  మోయ శక్యముగాని శ్రీమహా విష్ణువునకు  పాల సముద్రమున  పానుపుగా  నుండి, లోకకంటకులను మట్టుబెట్టు  అనంతుడగు ఆదిశేషుడు  మాకు కరుణాళు వగుగాక!


                  భూమి మిగుల దొడ్డది. పర్వతాలూ వనాలూ  నదీనదాలూ యిలా సమస్త వస్తుజాలముతో  గూడినది.అట్టి భూభారమునొకవంక తన వేయి పడగలపై నిరంతరము మోయుచు. సకల లోకములను తనలోమోయుచున్న  ఆవిష్ణుదేవుని గూడ

మోయుట దుష్కరమైనదిగదా! అట్టి యనంత బలశోభితుడగు అనంతుడు మమ్ముకరుణించుగాక!  


                                సర్పరాజులలో  ఆదిశేషుడు మిన్న. తత్పూజనచే  సర్వ సర్ప సంతతులును ప్రసన్నములగును.


                  కావున నేటి  సర్పస్తవమువలన  మిత్రులకు వారికుటుంబ సభ్యులకు  సర్ప భాధయుడుగు గాక !


                                                             స్వస్తి!!🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

కామెంట్‌లు లేవు: