3, నవంబర్ 2023, శుక్రవారం

శుక్రవారం నియమం..*

 *శుక్రవారం నియమం..*


"సార్..నా పేరు ఖాదర్ భాషా..ఇప్పుడు అవధూత గారి మందిరం తెరచి ఉన్నదా?..అక్కడికి వచ్చి స్వామి సమాధి చూడొచ్చా?.." అని పోయిన ఆగస్ట్ లో ఫోన్ చేసాడు.."ఇరవై రోజుల క్రితం నుంచి స్వామివారి మందిరం తెరచి ఉంచాము..ప్రస్తుతానికి స్వామివారి సమాధి వద్దకు ఎవరినీ పంపటం లేదు..మరో వారం తరువాత అధికారులు అనుమతి ఇస్తే..స్వామివారి సమాధి వద్దకు భక్తులకు ప్రవేశం కల్పిస్తాము.." అని చెప్పాను.."ఓహో..అలాగా..సరే సార్..మరో వారం పది రోజుల తర్వాత ఫోన్ చేస్తాను.." అని చెప్పాడు..అంతటితో ఆ సంభాషణ ముగిసిపోయింది..


మరో 15 రోజుల తరువాత ఒక గురువారం నాడు ఉదయం తొమ్మిది గంటలప్పుడు ఓ యాభై ఏళ్ల వ్యక్తి నేను కూర్చున్న చోటుకి వచ్చి.."నమస్తే సార్..నా పేరు ఖాదర్ బాషా..మీతో కొన్నాళ్ల క్రిందట ఫోన్ లో మాట్లాడాను..మీతో 10 నిమిషాలు మాట్లాడాలి..సమయం ఉందా?" అన్నాడు.."చెప్పండి.." అని కుర్చీ చూపించాను..దగ్గరగా కూర్చున్నాడు.."చెప్పండి.." అన్నాను..


ఒక్కసారిగా కళ్ళు మూసుకొని..రెండుచేతులతో నమస్కారం చేస్తూ..అలానే రెండు నిమిషాలు వున్నాడు..ఆ తరువాత కళ్ళు తెరచి.."ఈ స్వామివారు చాలా మహిమ గలవారు సార్..పోయిన ఏడాది నవంబర్  నెలలో నేను మొదటిసారిగా ఇక్కడికి వచ్చాను సార్..నాకు ఒక మిత్రుడు ఈ ప్రదేశం గురించి..స్వామివారి గురించి చెప్పాడు..ఆ సమయం లో నేను తీవ్రమైన ఆర్ధిక బాధలో వున్నాను..నేను పుట్టినప్పటి నుంచి ఏనాడూ ఒకరివద్ద చేయి చాచి ఏమీ అడగలేదు..వ్యాపారం చేసాను..కలిసొచ్చింది.. నేనూ నా సంసారం హాయిగా ఉన్నాము..మాకు ఇద్దరు కుమార్తెలు..ఇద్దరికీ లక్షణంగా పెళ్లి చేసాను..మా బంధువర్గం లో నావల్ల సహాయం పొందని వారు ఎవ్వరూ లేరు..కొన్నాళ్ల తరువాత నా అదృష్టం తిరగబడింది..వ్యాపారము దెబ్బతిన్నది..నా నుంచి లబ్ది పొందిన ఏ ఒక్కరూ నా కష్ట కాలం లో కనీసం ముఖం కూడా చూపలేదు..అదేసమయం లో నా భార్య అనారోగ్యం పాలైంది..ఏ మందులూ పనిచేయలేదు..ఒక సంవత్సరం బాధపడి మరణించింది.. నేను ఒంటరి వాడినై పోయాను..వ్యాపారం చేద్దామన్నా ఆసక్తి లేదు..ఏదో నిరాశ..ఎటూ దిక్కుతోచలేదు.. కడప చుట్టుపక్కల ఉన్న అన్ని దర్గాలకు వెళ్ళాను..నీలకంఠరావుపేట దర్గా దగ్గిర నా మిత్రుడు కలిసి..ఈ స్వామిగురించి చెప్పాడు..అతనికి ఈ స్వామివారి భక్తురాలు అష్రాఫ్ జాన్ గారు స్వామివారి గురించి చెప్పారట..నాకు చెప్పాడు..మరో రెండురోజుల్లో ఇక్కడికి వచ్చాను సార్.." 


"ఆరోజు గురువారం సార్..ఆరోజు ఇక్కడే వున్నాను..ఆ రాత్రికి నిద్ర చేసాను..ఈ మధ్య కాలం లో అంత ప్రశాంతంగా నిద్ర పోయింది ఇక్కడే సార్..స్వామివారి సమాధి దర్శించుకున్నాను..నా బాధ చెప్పుకున్నాను..ప్రక్కరోజు శుక్రవారంనాడు స్వామివారి సమాధి దర్శించుకొని వెళ్లబోతూ ఉండగా..ఆరోజు స్వామివారి మందిరం శుభ్రం చేస్తున్నారని తెలిసింది..నేనూ పాల్గొంటాను అని పూజారి గారిని అడిగాను..ఆయన సరే అన్నారు..మీ పూజారులు అందరితో పాటు స్వామివారి సమాధిని నేనూ శుభ్రం చేసాను సార్..మీ పూజారులు అందరికీ అవకాశం ఇస్తారు సార్..నాకెందుకో చాలా బాగా అనిపించింది..అంతా అయిపోయిన తరువాత..స్వామివారి కి హారతి ఇచ్చారు..కళ్లకద్దుకొని..ఆ మధ్యాహ్నం ఇక్కడే భోజనం చేసి..వెళ్ళిపోయాను..ప్రక్కరోజు ప్రొద్దుటూరు వెళ్ళాను..స్వామివారిని తలుచుకుంటూ  నడచిపోతున్నాను..ఇంతలో ఒకతను ఎదురువచ్చాడు..నా దగ్గరికి వచ్చి పలకరించాడు..ఐదారేళ్ల క్రితం అతనికి కొంత డబ్బు ఇచ్చి వున్నాను..ఆ సంగతి గుర్తు చేసి..నా చేతిలో కొంత డబ్బు పెట్టి.."మిగిలిన డబ్బు త్వరలో ఇస్తానని చెప్పి.." వెళ్ళిపోయాడు..నాకు ఏమీ అర్ధం కాలేదు..అతని నుంచి డబ్బు వస్తుందని ఏనాడూ అనుకోలేదు..ఆరోజంతా స్వామినే తలచుకున్నాను..ఆ డబ్బు పెట్టి మళ్లీ వ్యాపారం మొదలు పెట్టాను..నాకు ఇవ్వాల్సిన వాళ్ళు ఒక్కొక్కళ్ళుగా కొంత కొంత సర్దుబాటు చేశారు..మళ్లీ గాడిన పడ్డాను..మునుపటి వేదన లేదు..ఈరోజు ఇక్కడే ఉంటాను సార్..రేపు మీరు అనుమతి ఇస్తే..మీ పూజారులతో పాటు నేనుకూడా స్వామివారి సమాధిని శుభ్రం చేసి..ఆ నీళ్లు నెత్తిన చల్లుకుని..హారతి తీసుకొని వెళతాను.." అన్నాడు.."ఒక సహాయం చేయండి సార్..నాకు వీలున్నప్పుడల్లా ఇలా గురువారం వచ్చి ఇక్కడ నిద్రచేసి..శుక్రవారంనాడు స్వామివారి సమాధి ని తాకి శుభ్రం చేసి వెళుతుంటాను..అందుకు ఒప్పుకోండి.." అన్నాడు.


శుక్రవారంనాడు తన సమాధిని శుభ్రం చేసి పని అతనికి కేటాయించారు..అతను కూడా ఆ పనితోనే స్వామివారికి దగ్గర అవుతున్నాడు.. ఒక్కొక్కళ్లకు ఒక్కొక్క విధంగా తనమీద విశ్వాసాన్ని వాళ్ళ మనసులో స్థిరపరుస్తారు స్వామివారు..ఆ విషయం మాకు పదే పదే ఋజువు అవుతూ ఉంటుంది..


సర్వం..

శ్రీ దత్తకృప!!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగిలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523 114..సెల్ : 94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: