3, నవంబర్ 2023, శుక్రవారం

శ్రీ దేవీ భాగవతం

 శ్రీ దేవీ భాగవతం

.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||


సుకన్యా నాసత్య సంవాదం

ఒకరోజున - రూపయౌవన సంపన్నులూ రవిపుత్రులూ అయిన అశ్వినులు (నాసత్యులు) క్రీడా

వినోదపరాయణులై ఆ ఆశ్రమ ప్రాంతానికి వచ్చారు. సమీపసరోవరంలో స్నానంచేసి తడిబట్టలతో మడిగా

ఆశ్రమానికి నీళ్ళు తీసుకువెడుతు సుకన్యాదేవిని చూశారు. దేవకన్యలా మెరిసిపోతున్న ఆమె సౌందర్యానికి

ముగ్ధులయ్యారు. దగ్గరగావెళ్ళి గజగామినీ! ఒక్కక్షణం నిలబడు. మేమిద్దరం దేవపుత్రులం. నిజం

చెప్పు. నువ్వు ఎవరి అమ్మాయివి? నీ భర్త ఎవడు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఒంటరిగా స్నానానికి

వచ్చావంటే ఏమిటి కథ? పద్మపత్ర విశాలాక్షీ! మరొక లక్ష్మీదేవిలాగా ఉన్నావు. నీ విషయమంతా

తెలుసుకోవాలనుకుంటున్నాం. నీ సుకుమారమైన పాదాలు ఈ కఠినమైన నేలమీద నడుస్తోంటే మాకు

గుండెలు తరుక్కుపోతున్నాయి. తన్వంగీ! నువ్వు విమానాలలో తిరగవలసినదానివి. ఇలా వట్టికాళ్ళతో

నేలమీద సంచరించవలసినదానవు కాదు. అనావిష్కృతవై ఈ అడవిలో ఇలా ఎందుకు ఉంటున్నావు?

ఎక్కడికి వెడుతున్నావు? నూరుమంది దాసీలతో కదలవలసినదానివి. రాకుమారివో? అప్పరపవో? నీ

తల్లిదండ్రులు ఎవరోకానీ పరమధన్యులు. నీ పతిదేవుడి అదృష్టాన్ని వర్ణించి చెప్పడం మావల్ల కాదు. నీ

కదలాడుతున్న పాదాలు ఈ భూమిని దేవలోకంకన్నా పావనం చేస్తున్నాయి.

దేవలోకాధికా భూమిరియం చైవ సులోచనే ॥

ప్రచలంశ్చరణస్తేఽద్య సంసావయతి భూతలమ్ ॥

సౌభాగ్యాశ్చ మృగాః కామం యే త్వాం పశ్యంతి వై వనే

యే చాన్యేపక్షిణః సర్వే భూరియం చాతిసాననా

(4-37)

ఈ అడవిలో రోజూ నిన్ను తనివితీరా చూడగలుగుతున్నాయి ఈ పక్షులూ మృగాలూ, ఎంత

అదృష్టం చేసుకున్నాయో! నిరంతరం స్పర్శను అనుభవిస్తున్న ఈ నేల ఎంత పావనమైనదో! హే

సులోచనే! పొగడ్తలకేమిగానీ సత్యం చెప్పు. నీ తల్లిదండ్రులెవరు? నీ భర్త ఎవడు? ఎక్కడ ఉన్నాడు?

అతడిని చూడాలి మేము

కామెంట్‌లు లేవు: