1, డిసెంబర్ 2023, శుక్రవారం

 #ఆర్షధర్మానికి_శ్రీరామరక్ష


ఆదిశంకరులు ప్రతిపాదించిన అద్వైతసిద్ధాంతం క్రొత్తదేమీకాదు. సనాతనమైన ఉపనిషత్తు హృదయమే. 'చతుర్ధం మన్యంతే అద్వైతం' 'ద్వితీయాద్ వై భయం భవతి' - మొదలైన శ్రుతివాక్యాలు చాటిన సత్యమిది. ఈ వేద హృదయాన్ని సుప్రతిష్ఠితం చేసి, దాని ఆధారంగా వైదికమార్గప్రవర్తకులై, సమగ్రఅర్షధర్మ పరిరక్షణ చేశారు జగద్గురు శంకర భగవత్పాదులు. వేలయేళ్ళు గడచినా, కలిదోషాలు ప్రకోపిస్తున్నా, వేదధర్మదీప్తి విశ్వంలో వ్యాపించడానికి వారి అవతారం ప్రధానకారణం.


శంకరుల అవతారకార్యంలో ముఖ్యంగా మూడు అంశాలుగా విభజించవచ్చు.

#మొదటి_అంశం :- వాఙ్మయావిష్కారం. వ్యాసుని అనంతరం అంత విస్తృతసాహిత్యాన్ని అందించినది శంకరులే. ప్రస్థానత్రయ భాష్యం, ప్రకరణగ్రంథాలు, స్తోత్రసాహిత్యం అని మూడు భాగాలుగా శంకర వాఙ్మయం అధ్యయనం చేయవచ్చు. జ్ఞానానికై వేదవిహితకర్మాచరణ ద్వారా చిత్తశుద్ధిని, శ్రుతిసమ్మతమైన దక్షిణాచారబద్ధమైన ఉపాసనద్వారా చిత్తైకాగ్రతనీ, ఈశ్వరానుగ్రహాన్నీ సాధించి శ్రోతియుడూ, బ్రహ్మనిష్ఠుడూ, అయిన సద్గురువుద్వారా వేదాంతవిద్యని గ్రహించి, శ్రవణమనననిధిధ్యాసలను సాధనచేయాలనేది శంకరులబోధ.


#రెండవ_అంశం :- అసేతుశీతాచలం యోగశక్తితో పర్యటించి, ఆనాటి మేధావులతో సశాస్త్రీయ, తార్కిక, తాత్విక వాదంతో చర్చించి, వేదసత్యాన్ని ప్రతిపాదించడం. ఈదిశగా సాక్షాత్తు శివావతారుల పాదస్పర్శతో భారతావని పులకించి తనదివ్యత్వాన్ని ప్రస్ఫుటంగా భాసింపజేసుకుంది. అనేకపుణ్యక్షేత్ర, తీర్థాలను సేవించి, సందర్శించి, తన స్తోత్ర వాఙ్మయంతో ఆదేవతలను ఆనందింపజేశారు.


#మూడవ_అంశం :- ధర్మజ్ఞానాలను మానవజాతికందించిన వేదపథం నిష్కంటకంగా, నిరాటంకంగా నిలిచేలా దేశపు నాలుగుదిక్కులలో పీఠాలను ప్రతిష్ఠించారు. వీటినే చతురామ్నాయ పీఠాలు అని వ్యవహరిస్తాం. ఈ పీఠాల ద్వారా నిరంతరం శంకర వాఙ్మయం, ధర్మ పరిరక్షణ జరుగుతాయి.


ఈమూడు మహాకృత్యాలద్వారా శంకరులు తన అవతారతత్త్వాన్ని ప్రకటించారు. ఘోరకలిలో కూడా అఖండ సనాతనధర్మజ్యోతిని పరిరక్షించారు. శంకరులతపశ్శక్తి, అవతారమహిమ వలన ఆపీఠాలద్వారా నేటికీ దేశక్షేమానికి, ధర్మానికి రక్షణ సమకూరుతున్నది. ఈశంకరవిజయానికి హేతువు వారి నియమపూర్వకవ్యవస్థానిర్మాణమే. కఠిన నియమములను పాటిస్తూ, పీఠమర్యాదలను నిలబెట్టే పీఠాధిపతుల ఉనికియే ఆవిజయాన్ని శాశ్వతం చేసింది.

शुचिर्जितेन्द्रियो वेदवेदांगादिविशारदः |

योगज्ञ स्सर्वशास्त्राणा मस्मदास्थान माप्नुयात् |

उक्तलक्षणसंपन्न स्स्या च्चे न्मत्पीठभाग् भवेत् ||

పవిత్రజీవనం కలవాడు, జితేంద్రియుడు, వేదవేదాంగశాస్త్రపండితుడు, సర్వశాస్త్రయోగాలను తెలిసినవాడు- 'శంకర'నామంతో ఆయా పీఠాలను అధిష్టించాలని శంకరశాసనం.


अस्मत्पीठे समारूढः परिव्राडुक्तलक्षणः |

अह मे वेति विज्ञेयो यस्य देव इति श्रुतेः ||

పైలక్షణాలు కలిగి, నాపీఠాన్ని అలంకరించినపరివ్రాట్టు "నేనే'' అని భావించాలి. యస్య దేవే అనే శ్రుతివాక్యం ప్రమాణంగా....అని శంకరవచనం. ''यस्य देवे परा भक्तिः - यथा देवे तथा गुरौ". ఈశ్వరునియందువలె గురువునందు భక్తి ఉండాలి. (కరోపనిషత్తు) ధర్మప్రతిష్ఠాపనార్ధమై పీఠమర్యాదలను, పరంపరను పరిరక్షిస్తూ అఖండజ్ఞానవైరాగ్యాలతో, నిర్వహణాసామర్థ్యంతో, అపారతపశ్శక్తి ప్రభావంతో ఆచార్యులు నేటిదాక సాగిస్తూ వచ్చిన గురుత్వం ఒక మహాద్భుతం. ప్రధానంగా ప్రథమపీఠమైన దక్షిణామ్నాయ శృంగేరీ శారదా పీఠం, ఆదిశంకరులతపస్థలి. తత్పూర్వమే అది విభాండకఋష్యశృంగులతపోభూమి. తాను ప్రత్యక్షం చేసుకున్న శారదాంబను సంపూర్ణకళలతో అచట ప్రతిష్ఠించారు శంకరులు. అటునుండి నేటిదాకా శృంగేరీపీఠంలో ఆదిశంకరదీప్తి గంగానదిలా అఖండంగా ప్రసరిస్తూనే ఉంది. 12వ పీఠాధీశ్వరులైన జగద్గురు శ్రీవిద్యారణ్యస్వామివారు సనాతనధర్మానికీ, భరతవర్షానికీ చేసిన మహోపకారం ఒకఘనచరిత. దారూ మూర్తి అయిన శారదాంబను సువర్ణమూర్తిగా వీరిచేతిచలువతో సాక్షాత్కరించినది. 'కర్ణాటకసింహాసనప్రతిష్ఠాపనాచార్య' బిరుదాంకితంగా నాటినుండి, నేటివరకూ ధర్మసామ్రాజ్యపాలన అవిచ్ఛిన్నంగా సాగుతూ, ఆచంద్రతారార్కంగా భాసిల్లుతుందనేసత్యాన్ని చాటుతోంది. అపరోక్షానుభూతిలో ఆదిశంకరులు విశదపరచిన 'అష్టాంగయోగానుష్ఠాననిష్ఠ, తపశ్చక్రవర్తులలో' ప్రకాశిస్తూ, ధర్మరక్షణ చేస్తున్నది.


శంకరుల తరువాతి పీఠాధిపతులలో 36వ పీఠాధిపతిగా వర్దిల్లుతున్నవారు అనంత శ్రీ విభూషిత జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీ తీర్ధ మహాస్వామివారు. వేదఋషి పరంపరకు, సాంఖ్యయోగవేదాంతవిద్యకు, కఠోరయతి నియమాలకు, అపారకారుణ్యానికీ సాకారమూర్తులు. వారిచరితలోని జ్ఞాన, ధర్మ, యోగ మహిమలు కొన్నిదశాబ్దాలుగా అనేకులకి స్వానుభవాలు. ఆసేతుశీతాచలం పరివ్రాడ్ధర్మంతో వీరు పర్యటించినప్పుడు ఆయాక్షేత్రాలు దివ్యత్వాన్ని సంతరించుకున్నాయి. పీఠనిర్వహణ, వేదాంతవిద్యాప్రతిష్ఠాపన, ప్రపంచవ్యాప్తంగా ఉన్న శారదాపీఠాల సక్రమవ్యవహారం, అసంఖ్యాకభక్తులకు ఆశీస్సులతోపాటు ధర్మసాధనకు, జ్ఞానలబ్ధికి ఇస్తున్నస్ఫూర్తి... ఇవన్నీ 'ఆదిశంకరులపునరాగమనం' అనేభావాన్ని భక్తజనులకు కలిగిస్తున్నది. తాను జీవన్ముక్తులై, లోకసంగ్రహణార్థం యతిధర్మాలను క్రమం తప్పకుండా పాటిస్తూ, లోకక్షేమం కోసం నిత్యం చంద్రమౌళీశ్వరార్చన, శ్రీచక్రార్చన, అసంఖ్యాక చండీయాగాదిక్రతునిర్వహణ మొదలైనవంటివి పీఠాధీశ్వర మర్యాదలపాలనకు ప్రత్యక్షోదాహరణలు. ఆర్షవిద్యలపరిరక్షణార్థం నిర్వహిస్తున్న విద్యాసంస్థలను, సర్వజనోపయోగంగా వైద్యసంస్థలను, ప్రజాహితకర కార్యాలను కూడా నిర్వహిస్తున్నారు. వీరివరకు కొనసాగిన పీఠాధీశులతపోవైభవం వీరియందు రాశీభూతమై నేటికాలాన్ని ధర్మదీప్తులతో ప్రకాశింపజేస్తున్నది.


శ్రీశ్రీశ్రీ భారతీతీర్థుల తపఃపూతగురుదృష్టికి ఉత్తరాధికారిగా గోచరించిన, శ్రీశ్రీశ్రీ విధుశేఖరభారతీ స్వామివారు అవిచ్ఛిన్న ఆచార్యపరంపరలో 37వ పీఠాధిపతిగా సనాతనధర్మానికి మరింత బలిమినిచ్చేదివ్యతేజంగా ప్రభాసిస్తున్న శ్రీశ్రీ విధుశేఖరభారతీస్వామి వారికి అనేకానేక సాష్టాంగ నమస్కారాలు.


----------------------------------------------


గమనిక :- పోస్టును కాపీ చేసి, వేరే ఏదైనా సమూహాలకు షేర్ చేసేవారు గమనించండి, దయచేసి హాష్ ట్యాగులు, పేజీ లింకులు & పోస్ట్ లింక్‌లను తొలగించవద్దు, తొలగించకుండా షేర్ చేయండి.


For More Please Like, Share & Follow :- https://www.facebook.com/SringeriSankaraMathamNarasaraopet/


Please Subscribe :- https://youtube.com/channel/UCE0XDs30snh3rgeYwk-ztdg

కామెంట్‌లు లేవు: