24, మే 2024, శుక్రవారం

శ్రీ కంచి పరమాచార్య స్వామివారి జయంతి

 జయ జయ శంకర !! హర హర శంకర !!

కాంచి శంకర కామకోటి శంకర !!


వైశాఖ బహుళ పాడ్యమి శ్రీ కంచి పరమాచార్య స్వామివారి జయంతి. ‘ఆదిశంకర భగవత్పాద స్థాపిత మూలామ్నాయ సర్వజ్ఞపీఠమైన కంచి కామకోటి పీఠం 68వ పీఠాధిపతులు జగద్గురువులు “శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి” వారి జయంతి (వర్ధంతి). ఆయనను భక్తులు పరమాచార్య అని, మహాస్వామి అని, పెరియవా, శ్రీ చరణులు, నడిచే దైవం అని పలు నామలతో పిలుచుకునేవారు. ఆయన పరమాత్మస్వరూపం, కాషాయం కట్టిన కామాక్షి స్వరూపం, తలపైన చంద్రుడు లేని పరమశివుడు (పేరులోనే ఉందిగా). జటాజూటం లేని ఈశ్వరుడు. అపర శంకరావతారులు.


ఆది శంకరాచార్య స్వామివారు సనాతన ధర్మాన్ని బ్రతికించడానికి ఈ భూమిపైన 32 సంవత్సరాలు ఉంటే, పరమాచార్య స్వామి వారు సన్యాసాశ్రమ ధర్మాలను నిలబెట్టడానికి శతాయుష్కులై 100 సంవత్సరాలు జీవించారు (20 May 1894 – 8 Jan 1994). ఆయన జీవితం గురించి పరిశీలిస్తే, 13వ ఏటనే సన్యాసం తీసుకున్నారు. ఆనాటి నుండి సనాసాశ్రమ ధర్మం ప్రకారం వాహనం ఎక్కరాదు అని బ్రతికినంతకాలం పాదచారి అయి భారతదేశం 3 సార్లు పర్యటించారు.


ఒక్క మాటలో చెప్పాలంటే ధర్మం ఒక రూపం ధరిస్తే అది సాక్షాత్ పరమాచార్య స్వామివారే. త్రేతాయుగంలో శ్రీరామచంద్ర మూర్తి ఎంతటి ధర్మమూర్తో ఈ కలియుగంలో మహాస్వామి వారు అంతటి ధర్మ స్వరూపులు. ఆయన ఒక పాదం ధర్మం మరొక పాదం సత్యం. ధర్మం సత్యం అనే రెండు పాదాలతో ఆసేతు సీతాచలం కాలినడకన యాత్ర చేసి ధర్మస్థాపన చేసారు.


దలైలామ అంతటి వారే ‘ఈ శతాబ్ధపు నిజమైన సన్యాసి అంటే పరమాచార్య స్వామి వారే’ అని వేనోళ్ల పొగిడారు. కామకోటి పీఠానికి 68వ జగద్గురువుగా అపర శంకరావతారులుగా ఈ దేశానికి వారు చేసిన సేవ అనన్యసామన్యం. పరమ నిరాడంబరత్వం, అపార కరుణా స్వరూపం, జ్ఞాన స్వరూపం. ఆయన చిత్రపటాన్ని తదేకంగా ఒక్క నిముషం చూస్తే చాలు మన మనస్సు ప్రశాంతతను పొందుతుంది. అంతటి మహానుభావులు పరమాచార్య స్వామి వారు.


87 చాతుర్మాస్యాలు చేసిన ఒకేఒక్క సన్యాసి, ఆయన నడిచే విశ్వవిద్యాలయం, వారికి తెలియని విషయం ఈ ప్రపంచంలోనే లేదు. 23 భాషలయందు దిట్ట. గాలిలో విభూతి తీయడం గొలుసులు తీయడం వంటి అనవసరమైన మహిమలు ఆయన ఎన్నడూ ప్రదర్శించలేదు. ఆయన వద్ద ఉంటే మనకు భగవంతుని సన్నిధిలో ఉన్నాము అనే భావన మనకు కలుగచేయడమే పెద్ద మహిమ. అణిమాది అష్టసిధ్ధులు ఆయన వశం. సకల శాస్త్రాల యందు ఆయన దిట్ట. వేదమన్నా శాస్త్రమన్నా ప్రాణం. గోవుల కోసం తన ప్రాణాలను సైతం వదులుకోవడానికి సిధ్ధపడ్ద త్యాగి.


లక్షల కుటుంబాలను సదాచారం వైపు, వైదిక అనుష్టానం వైపు మళ్ళించి సనాతన ధర్మాన్ని ఉధ్ధరించారు. ఆయన అవతారం రాకుండా వుండి ఉంటే ఈవాళ మనం ఈమాత్రం కూడా ధర్మాన్ని ఆచరించేవారం కామేమో. అలాంటి మహాపురుషుడు జన్మించిన ఈ రోజు ఆయాన్ను స్మరించుకోవడం పాప హరణం.


జయ జయ శంకర హర హర శంకర

కంచి శంకర కామకోటి శంకర

కామెంట్‌లు లేవు: