24, మే 2024, శుక్రవారం

పదవిని బట్టి విలువ!

 శు భో ద యం🙏


పదవిని బట్టి  విలువ!

              

           ఉ: "స్థాన  విశేష మాత్రమున  'తామఱపాకున  నీటిబొట్ట'! నిన్


                 బూనిక  మౌక్తికంబనుచుఁ బోల్చినమాత్రన  నింత గర్వమా?


                 మానవతీ శిరోమణుల  మాలిక లం దునఁ గూర్ప వత్తువో?


                 కానుక లీయవత్తువొ?  వికాసము నిత్తువొ?  విల్వ నిత్తువో?


                  చాటుపద్యం-- నందితిమ్మన-- రాయల యాస్థాని!


                       

                            విచిత్రమైన పద్యమే ! కానీ  లోకంలో  నకీలీల బారిన పడి బాధపడుతున్నవారెందరో?  అలాంటి కవులెవ్వరో  రాయల పరిసరాలలో చేరి డాబుచేస్తూ, తిమ్మనకు దక్కవలసిన గౌరవాన్ని  దక్కకుండా చేస్తున్నారేమో? వారిని మనస్సులో 

పెట్టుకొని  తిమ్మనగారు యీపద్యం వ్రాశారు.


               "  ఉదయపువేళలో  సరోవరాలలో  కనిపించే  దృశ్యం,తామఱాకుపై పడిన  నీరు ముత్యంలా  తళతళలాడుతూ  కనిపిస్తుంది.సూర్యరస్మి వలన తామరపాకుకుండే  స్నిగ్ధత్వంవలన  ఆవిధంగా కనిపిస్తుంది.చూచేవారికది ముత్యమేమోనని  భ్రమకల్గిస్తుంది.

అది నీరేగానీ  ముత్యంగాదు. అదిగో దాన్ని నిందిస్తున్నట్లుగా  సాకుచేసికొని  తిమ్మనగారు  యీవిధంగా అంటున్నారు.


                            "ఓనీటి చుక్కా! తామఱపాకుపై  నిలచి నేను  ముత్యాన్నని డాబులు కొట్టబోకు. తెలియని వారు నిన్ను ముత్య

మనుకొనినంత మాత్రమున నీకంతగర్వమా? నీవేమైనా  ఆడవారి పూమాలలలో  నలంకరింప దగియున్నావా? కానుకలిచ్చుటకు పనికివత్తువా? నీవల పరిసరములకేదైన వికాసము కలుగునా? అమ్ముకొందమనిన నీకేమైన  విలువయున్నదా? గాలివాటుకు నీటిలోకిజారితివా? ఇకనీపనిశూన్యము. ఇంతదానికంత మిడిసిపడుటయేల? మేలుగాదు సుమా?"-అని హెచ్చరిక!


                   నేడు గూడా  యేమాత్రము విలువలేనికొందరు  మహానాయకుల నాశ్రయంచి  తామేదో మహనాయకులమన్నట్లు

డాబులు చేయువారున్నారు. అట్టి నకిలీల కందరకూ యాపద్యము చెంపపెట్టు.


                      మహా కవుల  నర్మగర్భసందేశము  లిట్లుండు🌷ను!


                                               స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷

కామెంట్‌లు లేవు: