24, మే 2024, శుక్రవారం

ఔషధే చింతయే ద్విష్ణుం

 🙏🏻 ఓం నమో నారాయణాయ నమః 🙏🏻


ఔషధే చింతయే ద్విష్ణుం 

భోజనే చ జనార్ధనమ్ |

శయనే పద్మనాభం చ 

వివాహే చ ప్రజాపతిమ్ ||


యుద్ధే చక్రధరం దేవం 

ప్రవాసే చ ప్రజాపతిమ్ |

నారాయణం తనుత్యాగే 

శ్రీధరం ప్రియసంగమే ||


దుస్స్వస్నే స్మర గోవిందం 

సంకటే మధుసూదనమ్ |

కాననే నారసింహం చ 

పావకే జలశాయినమ్ ||


జలమధ్యే వరాహం చ 

పర్వతే రఘునందనమ్ |

గమనే వామనం చైవ 

సర్వకాలేషు మాధవమ్ ||


షోడశైతాని నామాని 

ప్రాతరుత్థాయ యః పఠేత్ |

సర్వపాప వినిర్ముక్తో 

విష్ణు లోకే మహీయతే ||



ఔషధసేవనం బాచరించెడి వేళ

          వినుతించ వలయును 'విష్ణు' నెపుడు

భోజనమ్మును తాను భుజియించు వేళలో 

          తలచ తగును 'జనార్దను'ని మదిని

శయనించు సమయాన సంతృప్తి తోడను 

          ప్రార్తించ వలయును 'పద్మనాభు'

ప్రార్థించవలె 'ప్రజాపతి' యంచు వినయాన 

          పరిణయ వేళందు భక్తితోడ

సమరంబు నందున 'చక్రధరా' యంచు

          జపియించ వలయును జయము పొంద

పరదేశమున నుండ హరిని 'ప్రజాపతి'

         యనుచు పలుకతగు న్నాత్మ యందు

తనువు నొదులు వేళ తా బల్క వలయును

         'నారాయణా' యంచు నయము గాను

ప్రియసంగమమునందు ప్రియమార స్వామిని 

        'శ్రీధరా' యనుచును చెప్ప తగును

దుస్వప్నముల యందు దుఃఖించకను తాను

       'గోవింద' యని మది కొలువతగును

సంకటసమయాల సద్భక్తి తోడను

        'మధుసూదన' నతగు మదిని నరుడు 

విపినంబునందున వెఱవక మనుజుండు

         కోరి దల్చ తగును 'నారసింహు'

అగ్నిజ్వాలల మధ్య ననయంబు మదియందు 

         'జలశాయి' భజనమ్ము సల్ప తగును

పర్వతంబుల మధ్య 'పట్టాభిరఘురాము'

        నెంచంగ వలయును నెపుడు నరుడు

గమనంబు నందున కల్కంగ నశ్రమ

        భక్తి నెంచ తగును 'వామనుడి'ని

సర్వకాలములందు సర్వేశు "మాధవున్"

        మదిదల్చ వలెనెప్డు మానవుండు

శుభము లిచ్చు "విష్ణు షోడశనామముల్"

యుదయ వేళ యందు చదివి తేని

సర్వ పాపరాశి సమసియు మనుజుండు 

విష్ణునెలవు చేరు విమల మతిని.


✍️గోపాలుని మధుసూదన రావు 🙏

కామెంట్‌లు లేవు: