ఆ.
అధరమందు పుట్టు మధుర వాక్కుల చేత
కుదిరినట్టి మైత్రి కూలుపోవు
హృదయమందు పుట్టు పదిలమౌ స్నేహమే
చెదరదెప్పుడైన చిన్న సూరి
:
పెదవులు పలికినమాటలు
కుదరుగ నిలుపవుగ మైత్రి గూలగజేయున్
హృదయము బలికిన మాటలు
చెదరక కలకాలముండు స్నేహము గూర్చున్
జనమంచి
జీవులందు నీవు జనుల-జీవమీవు
ద్వైతమున నీవుతెలియన-ద్వెతమీవు
సర్వమునునీవు సకలార్ధ-సాక్షినీవు
పతిత పావన!వేణుగోపాలదేవ!!-డా.గుడిసేవ.
శ్రీ రామ స్తుతి🙏
సీ.ఘనమైన హారముల్ కాంచన చేలముల్
ధరియించి కొలువైన ధర్మపాల !
మహనీయ శ్రీరామ ! మధుర మధుర నామ !
ధరణిపాలకరామ ! ధన్యచరిత !
జానకీ ప్రాణేశ ! జగదభి రామయ్య !
కాకుత్థ్సవంశజా ! ఘనచరిత్ర !
రఘువంశ చంద్రమా ! రాజిత గుణధామ
కమనీయరఘువరా ! కావు మమ్ము
తే.వల్కలమ్ముల ధరియించి వనము కేగి
దనుజ దర్పమ్ము నణచిన ధర్మవీర !
సవనమును గాచి బ్రోచిన శౌర్యరామ !
దశరథాత్మజ ! రఘురామ ! ధర్మతేజ !
సాహితీ శ్రీ జయలక్ష్మి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి