30, జులై 2024, మంగళవారం

పాప కర్మల వైపే

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐

పాప కర్మల వైపే మనుష్యులు మ్రొగ్గు చూపుటకుగల కారణములు

🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*పాపపుణ్యాల గురించి చాలా మందికి మంచి అవగాహనే ఉంది. పాపపుణ్యాలు క్రమంగా సత్కర్మల మరియు దుష్కర్మల ఫలితమని వారికి తెలుసు. మంచి చెడుల మధ్య తేడాను గ్రహించగలిగినా ఆశ్చర్యకరంగా మానవుడు పాపపు కర్మలలోనే నిమగ్నుడవుతాడు.*


*ఒకసారి దుర్యోధనుని యిలా ప్రశ్నించారు. ''మీరు రారాజు. శాస్త్రాలను చదివారు. ధర్మమంటే ఏమిటో తెలుసు. అయినా మీరు యిలా ఎందుకు ప్రవర్తిస్తారు?'' అందుకు దుర్యోధనుడు -*

*जानामि धर्मं न च मे प्रवृत्तिः जानाम्यधर्मं न च मे निवृत्तिः ||*

*''ధర్మమంటే ఏమిటో నాకు తెలుసు. అయినా నా మనస్సు దాని వైపు మొగ్గటం లేదు. అధర్మమూ నాకు తెలుసు. కాని నామనస్సు పాప కర్మలను ఆచరించటానికే ఇష్టపడుతోంది.'' అని సమాధానమిచ్చుట ఆశ్చర్యకరమైన విషయం.*


*శ్రీకృష్ణ భగవానుని మాటలను వింటున్న అర్జునుడు ''దేవా ! నీవు బోధించే విషయం తెలుస్తున్నా మనిషి ప్రవర్తన చూస్తే వింతగా అనిపిస్తోంది'' అని ప్రశ్నించాడు.*

*अथ केन प्रयुक्तोऽयं पापं चरति पूरुषः |*

*अनिच्छन्नपि वार्ण्षेय बलादिव नियोजितः ||*

*''మనిషికి తాను ఏమి చేస్తున్నాడో తెలిసి చేసినా ఎవరి బలవంతం మీదనో చేస్తున్నట్లు పాపపు పనులనే చేస్తుంటాడు. దానికి కారణమేమిటి ?''  దానికి శ్రీకృష్ణ భగవానుని సమాధానం ఇది -*

*काम एष क्रोध एष रजोगुणसमुद्भवः |*

*महाशनो महापाप्मा विद्ध्येनमिह वैरिणम् ||*

*కామము మరియు క్రోధమనబడు శత్రువులు రజో గుణం వలన ఉద్భవించుచున్నవి. అవి మహా పాపిష్ఠమైనవి. అవే మనిషిని బలవంతంగా పాపానికి ప్రేరేపిస్తాయి.*


*పై అభిప్రాయం మనకు క్రొత్త కాదు. మనందరికీ సామాన్యంగా తెలిసినదే.  అయితే మళ్ళీ మళ్ళీ మనం దానిని గురించి చర్చించాలి. ఎందుకంటే మనం దానిని ఆచరణలోకి తీసుకురాలేకపోతున్నాం కదా. కామం, క్రోధం అనేవి ప్రతి మనిషికి బద్ధ శత్రువులు. మనిషికి మొదట యిష్టం లేకపోయినా పాపకార్యాలు చేసేటట్లు ఈ రెండూ బలవంతపరుస్తాయి. కామక్రోధాలను అదుపులో ఉంచుకున్నట్లయితే పాపం చేయాలనిపించదు.*


*ఒక వస్తువును తీవ్రంగా కోరుకోవటం కామమైతే, ఆ వస్తువు లభించకపోతే లేదా దానిని కోల్పోతే క్రోధం వస్తుంది. क्रुद्धो हन्याद्गुरूनपि - క్రోధంతో ఉన్నవాడు ఏమైనా చేస్తాడు. చివరికి తన గురువుగారిని హింసించటానికి కూడ వెనకాడడు.*


*శ్రీకృష్ణభగవానుడు కామ క్రోధాలను తొలగించుకోవలసిన అవసరం గురించి భగవద్గీతలో వివరించాడు. కామక్రోధాల బంధువులే లోభ, మోహ, మద, మాత్సర్యాలు.*


--- *జగద్గురు శ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామివారు.*


*శ్రీ గురుభ్యోనమః!*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*ఓం శాంతిః శాంతిః శాంతిః!*

*సర్వేజనా సుఖినోభవంతు!!*

*ఓం తత్సత్!!*


*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*

*ఓం నమః శివాయ!!!*

🛐🛐🛐🛐🛐🕉️🛐🛐🛐

*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

కామెంట్‌లు లేవు: