14, అక్టోబర్ 2024, సోమవారం

మొబైలు వాడని తల్లి కావాలి*

  *మొబైలు వాడని తల్లి కావాలి*


ఈ సంఘటన మీ హృదయాలను కదల్చివేయగలదు. 


అది ఒక పాఠశాలలోని ఐదవ తరగతి గది. విద్యార్థులందరు పది సంవత్సర వయస్సుగల పిల్లలే. ఏమీ తెలియని చిన్నారి దశ. ఇప్పుడిప్పుడే కొద్దిగా లోకం పోకడకు అలవాటు పడుతున్నారు. ఆ తరగతి ఉపాధ్యాయిని వాళ్ళందరికి మీ మీ తల్లులను మీరు ఎలా ఎలా ఇష్టపడుతున్నారు అని కాగితంలో ఒక చిన్న ఫేరా వ్రాయమని పురమాయించారు. 


అందరూ వాళ్ళకు తోచిన విధంగా వ్రాయడం మొదలుపెట్టారు. ఒక విద్యార్థిని వ్రాసిన కథనం ఇదిగో.


*నాకు ఎప్పుడూ నాతో బాటే ఉండే ఆఫ్ లైన్ (offline) అమ్మ కావాలి. మా అమ్మ ఎల్లవేళలా ఆన్ లైన్ (online) లోనే ఉంటున్నారు. నాతో మెలిగే సమయం కన్నా వారు మొబైలుతోటే ఎక్కువ సమయం వెచ్చిస్తారు. నేనూ ఒక మొబైలులా పుట్టి ఉంటే ఎంచక్కా మా అమ్మకు తోడుగా ఉండేదాన్నో. తను ఎక్కడికి వెళ్ళినా తనతో బాటే నన్ను తీసుకెళ్ళేది కదా*. 


*అందువలన నాకు ఈ మొబైలు వాడకాలు, సాంకేతిక పరిజ్ఞానం లేని నిరక్షరాస్యులైన అమ్మనే కావాలి. అంటే ఎల్లకాలం నాతోనే గడిపే ఆఫ్ లైన్ అమ్మ అన్నట్టు*. 


*మా ఎప్పుడూ జీన్సులు, టీ షర్టులు, చూడిదార్లు, లెగ్గింగులు, నైటీలు ధరించకూడదు. చోటూ వాళ్ళ అమ్మలాగా ఎల్లవేళలా ఎంతో హుందాగా కనబడే చీరలోనే కనబడాలి. నా ఒడిలో తల బెట్టి నన్ను ఎప్పుడూ ముద్దులతో ముంచెత్తాలి*. 


*మొబైలు వాడని అమ్మలే వారి వారి కుటుంబానిపై, తండ్రిపై, పిల్లలపై ఎక్కువ సమయాన్ని కేటాయించగలరు*.


*ఆఫ్ లైను తల్లైతే ఇంట్లో ఎటువంటి వివాదాలు, తగాదాలు తలెత్తవు. అమ్మలు చాలా ఓర్పుతో ఉంటారు కాబట్టి ఇలాంటి కలహాలను ప్రోత్సహించరు. అందరికీ అందుబాటులో ఉంటూనే వారి కార్యక్రమాలను కూడా ఎంతో నేర్పుతో కొనసాగించగలరు*.


*మా ఇంట్లో ఎప్పుడెప్పుడు కరెంటు పోతుందానని ఎదురుచూస్తూనే ఉంటాను. ఎందుకంటే కరెంటు పోతే వైఫై పనిచేయదు కాబట్టి ఇక మొబైలును పక్కన బెట్టి మా అందరితోనూ పిచ్చాపాటి మాట్లాడడమే*. 


*ఆఫ్ లైన్ అమ్మ అయితే నాకు ఎంచక్కా పడుకొనే ముందు రామాయణ మహాభారత కథలు చెప్పగలదు కదా. అవి వింటూ నేను నిద్రలోకి జారిపోయేదాన్ని. కాని ఇప్పుడైతే పరుపు మీద పడుకొంటేనే చాలు ఇక విడియో గేమ్స్ ఆడుకోవడమే. నాకైతే ఇవన్నీ రోత రోతగా ఉందన్నట్టు*. 


ఆ విద్యార్థిని  ఇంత పెద్ద వ్యాసం వ్రాయడాన్ని గమనించి ఉపాధ్యాయిని తరగతిలో అందరికి వినబడేటట్టు దాన్ని చదివారు. విద్యార్థులు అందరూ అది విని, చిన్న పిల్లలు కదా, ఘొల్లున ఏడ్వడం మొదలెట్టారు. అందరిని ఆ వ్యాసం అంతలా కదిలించింది. 


అమ్మలందరికీ విన్నపం ఏంటంటే, మీరందరు ప్రస్తుత తరానికి చెందినవారే. ఎంతో చదువుకొని, సాంకేతిక పరిజ్ఞానంతో ఎంతో నిత్యనూతనంగా మెలిగేవాళ్ళే. కాని మీ చిన్నారి పిల్లల గురించి ఆలోచించండి. వారు ఎలా మీ లాలింపుల గురించి ఎదురుచూస్తున్నారో. ఈ రోజుల్లో చరవాణి వాడిని యువతీయువకులు కనబడరు, నిజమే. కాని అదే జీవితం కాదు, లోకం కాకూడదు. మీ కుటుంబానికి కూడా మీరు సమయాన్ని కేటాయించాలి. మీ పిల్లలే భావిభారత పౌరులు. వాళ్ళందరిని చక్కదిద్దే బృహత్తర కార్యక్రమం మీ పైనే ఉంది. మీ ఆలనాపాలనలు వారికి ఎంతో ముఖ్యం. వారందరిని ఈ చిన్నారి దశలోనే తీర్చిదిద్దాలి. ఒక్కసారి పెరిగిన తర్వాత వారు మీపై ఎక్కువ ఆధారపడరు కదా. 


మీరే వారందరికి స్ఫూర్తినిచ్చి వారి భవిష్యత్తుకు చక్కటి పూలబాట వేయాలి. తల్లులే కాదు, తండ్రులకు కూడా ఈ గురుతర బాధ్యతలు వర్తిస్తాయి సుమా. 


కుటుంబ వ్యవస్థ క్షీణించకుండా పిల్లలందరూ అస్తవ్యస్తంగా మెలగకుండా ఉండడానికి తల్లిదండ్రులు వారి వారి బాధ్యతలను గుర్తించి కుటుంబాలను చక్కదిద్దుకుంటారని ఆశిస్తూ ఈ సందేశం అందరికీ అంకితం.

కామెంట్‌లు లేవు: