14, అక్టోబర్ 2024, సోమవారం

శ్రీ మూకశంకర విరచిత మూక పంచశతి

 శ్రీ మూకశంకర విరచిత మూక పంచశతి

శ్రీకామాక్షి పరదేవతా వైభవ వర్ణన

పాదారవిందశతకం

🙏🌸🙏🙏🙏🌸🙏

 

శ్లోకము:-

చిరాద్దృశ్యా హంసైః కథమపి సదా హంససులభం నిరస్యంతీ జాడ్యం నియత జడమధ్యైక శరణమ్ |

అదోషవ్యాసంగాత్ సతతమపి దోషాప్తిమలినం పయోజం కామాక్ష్యాః పరిహసతి పాదాబ్జయుగలీ ||30||

 

 

భావము:

యతులకు ఉపాస్యం అయిన దేవీ చరణములు పద్మాలను నిరసిస్తున్నాయి. పద్మాలు హంస సులభాలు. దేవీ చరణములు సులభాలు కాదు. పద్మాల్య్ జడయుక్తాలు. దేవీ చరణాలు జడ రహితాలు - నిర్ధోషాలు. పద్మాలు ఎలాగూ దేవీ చరణములకు సరిపోవు. శ్రీ చరణాలు విశిష్టములు.

 

*********

 

అమ్మ చరణములను తాబేటి పెంకుతో పోలుస్తూ *కూర్మపృష్ట జయిష్ణు ప్రపదాంవితా* అని లలితా నామాలలో చెప్పిన వశిన్యాది దేవతల అభిప్రాయాన్ని శ్రీ శంకరులు వ్యతిరేకిస్తూ..... అమ్మ పాద వైభవం తెలియ చేస్తున్న *సౌందర్యలహరి* శ్లోక భావాన్ని కొద్దిగా తెలుసుకుందాం....

 

పదం తే కీర్తీనాం - ప్రపద మపదం దేవి విపదాం

కథం నీతం సద్భిః - కఠినకమఠీకర్పరతులాం||

కథం వా పాణిభ్యా ముపయమనకాలే పురభిదా

యదాదాయ న్యస్తం - దృషది దయమానేన మనసా ||88||

**********************************

*భావము:*

అమ్మా..నిన్ను ఆశ్రయించిన వారికి సత్కీర్తులను కలిగించుచు, సకల ఆపదలను తొలగించుచు, మంచికి పుట్టిల్లుగా,చెడులు అనేవి దరిచేరలేని శుభవాకిళ్లుగా వెలుగొందుచుండేవి, నీ పాదముల పైభాగాన ఉండు నీ మీగాల్లు, అటువంటి నీ పాదమును నీ వివాహ వేళ, రాతియందు వధువు పాదము పెట్టించుట అను ఒక తంతుయందు దయాపూర్ణమైన మనసు కల నీ భర్తయైన శివుడు తన చేతితో నీ పాదములు పట్టుకుని రాతియండు ఉంచుటకు ( వధువుచే సన్నికల్లు తొక్కించుట) చాల సందేహించినాడు.ఎందుకనగా అతి మృధులమైన నీ పాదములు ఆ కఠిన రాతి స్పర్శ తో ఎక్కడ కందిపోవునో అని.మరి అంత సున్నితమైన ఆ సుకుమార పాదాన్ని, ఆ పాదంపై నున్న మీగాలుని ( అరికాలు పై భాగం) కొందరు సత్కవులు ( లలితలో వశిన్యాది దేవతలు) కఠినంగా ఉండే ఆడ తాబేలు వీపు చిప్పతో ఉపమానం చెబుతూ ఎలా వర్ణించగలిగారమ్మా!

{ లలితాసహస్రంలో *కూర్మపృష్ట జయిష్ణు ప్రపదాంవితా* అని అమ్మకు ఒక నామం.దీనికి తాబేటి చిప్పను జయించినటువంటి ప్రపదం ( అరికాలి పై భాగం)తో శోభిల్లుదానా అని అమ్మను వశిన్యాది దేవతలు వర్ణించారు. దానినే ఇక్కడ శ్రీ శంకరులు అంత మృధువైన నీ పాదములను అలా వర్ణించుట సరికాదని నిష్కర్షగా చెప్పినారు. ఇక్కడ శ్రీ శంకరులకు అమ్మమీద ఉన్న అమిత మాతృభావ లాలిత్య భక్తి మనకు కనబడుతుంది. నాతల్లి యొక్క అంత మృధుపాదాలు పట్టుకుని అంత కఠినంగా వర్ణిస్తారా...అసలు ఆ మాట అనడానికి వారికి ( వశిన్యాది దేవతలు) మనసెలావచ్చిందని ఆదిశంకరులు కరుణతో విలవిలలాడిపోయారు.అదికదా భక్తి అంటే. అమ్మ మీగాళ్లు అంత మృధువుగా ఉన్నవి.}

 

🔱 ఆ తల్లి 

పాదపద్మములకు నమస్కరిస్తూ 🔱 🙏🌸🌸🌸🌸🌸🙏

కామెంట్‌లు లేవు: