పోతనను కాపాడిన ఆది వరాహం
పోతన తను వ్రాసిన భాగవతాన్ని శ్రీరామచంద్రుడికి అంకితం ఇచ్చాడు. కాని అప్పుడు పరిపాలిస్తున్న రాజు తనకు అంకితం ఇవ్వమని ఎన్నో విధాలుగా ఒత్తిడి చేసాడు. కాని పోతన అందుకు ఒప్పుకోలేదు. ఆ రాజు పోతనను ఎలాగైనా నిగ్రహించి ఐనా భాగవతాన్ని సొంతం చేసుకోవాలని అనుకొన్నాడు. ఒక రోజు ఆ రాజు వేట నెపముతో పోతన నివసిస్తున్న ఇంటి సమీప అడవి ప్రాంతానికి వచ్చాడు. అడవిలో మకాం వెసి తన సైనికులను పోతన ఇంటి వద్దకు వెళ్ళి భాగవతాన్ని తీసుకు రమ్మన్నాడు. ఆ సైనికులు పోతన ఇంటి వద్దకు వెళ్ళేసరికి ఆ ఇంటి ముందు ఒక భారీ తెల్లని అడవి పంది, చాలా ఎత్తుగా కనిపించింది. ఆ పందిని చూసి సైనికులు భయపడి రాజు వద్దకు వెళ్ళారు. రాజు వారిని కోప్పడి తన సైన్యాధిపతులను పంపాడు. వారు కూడా ఆ పందిని చూసి భయపడి వచ్చేసారు. ఇక లాభం లేదనుకొని రాజే బయలుదేరాడు. ఆ రాజు కూడా ఆ పందిని చూసి ఒక బాణం వేసాడు. కాని ఆ పంది గుర్రు అనేటప్పటికి రాజు కూడా వెళ్ళిపోయాడు. కాని రాజు ఆలోచించాడు. అంత పెద్ద పందిని,అది కూడా తెల్లని భారీపంది భూమిపై ఎక్కడా ఉండదు కదా , బహుశా అదీ ఏ మాయో అనుకొన్నాడు. పోతనను రక్షించేందుకు వచ్చిందేమో అనుకొన్నాడు. పశ్చాత్తాపంతో మళ్ళీ పోతన ఇంటి వద్దకు వెళ్ళేసరికి ఆ పంది లేదు. ఇంటి లోనికి వెళ్ళి పోతనను పలకరించాడు. పోతన గారు రాజును ఆహ్వానించగా, రాజు జరిగిన విషయం చెప్పాడు. అది విని పోతన కన్నీళ్ళు పెట్టుకొని బయటకు వచ్చి చూస్తే పంది యొక్క కాలిముద్రలను చూసి ఆ పాదదూళిని తన తలపై వేసుకొన్నాడు. తర్వాత ఒక అత్యద్భుత విషయాన్ని చెప్పాడు. ఆ పందిని రాజు బయట చూసిన సమయంలో పోతన గారు “యజ్ఞ (ఆది) వరాహ మూర్తి” అవతారఘట్టాన్ని తెలుగులోనికి అనువదిస్తున్నాడు. ఆ వరాహమూర్తే పోతనను కాపాడాడు.
🪷🙏🪷
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి