21, అక్టోబర్ 2024, సోమవారం

రాయల రాజనీతి చతురత!



రాయల రాజనీతి చతురత!


*ఆయతికానికీకు మమ*

       *రాలయముఖ్యము లాతఁ డర్థతృ*

*ష్ణాయుతుఁడై నిజోర్వి నగు* 

        *నష్టికిఁ దద్ధనముం దొరల్చి రా*

*జాయతనంబుఁ జేర్చు మఱి*

         *యట్టి దపథ్యము దాన నొంటిఁ గాఁ*

*డే యధికారి గావలయు*

         *నించుక తిన్నను వాఁడె రూపఱున్* 

        _(ఆముక్తమాల్యద:4-218)_


ఈ పద్యము శ్రీకృష్ణదేవరాయలవారు

రచించిన ఆముక్తమాల్యద కావ్యములో

యామునాచార్యుని రాజనీతి బోధ

సందర్భములోనిది..


_"ఆయతికాడు"_ - ఆదాయ-ఆర్థిక శాఖాధికారికి/ప్రభుత్వానికి_ _(Revenue department) ఎప్పుడూ_

_దేవాలయాదాయవ్యయవ్యవస్థపై అధికారమీయరాదు.. తన అసమర్థతచేత, పన్నులు వసూలుచేయలేకపోవుటయో, వ్యయము నియమించలేక నష్టములు వాటిల్లితేనో, లేక ధనార్జనతృష్ణచేతనో..ఆ ఆయతికాడు తన తప్పు కాచుకోవడానికి దేవాలయాదాయములను రాజకోశాగారమునకు తరలిస్తాడు..అలా దేవాలయాదాయములు రాజకోశాగారములను చేరుట ఎప్పటికీ మంచిది కాదు.. వాటిపై అధికారము ప్రత్యేకముగ ఏ ఇతరశాఖకూ సంబంధములేనివానికే ఈయాలి.. అటువంటివాడు ఆ దేవాలయాదాయములలో ఏ కొంచెమో తన స్వప్రయోజనానికి వాడుకున్నా ఆ పాపము చేత వాడే నశిస్తాడు.. కాని దేవాలయవ్యవస్థ బలహీనము కాదు.._

*దేవద్రవ్యోపజీవీ చ*

*స భవే దపబాహుకః*

*దేవద్రవ్యం స్వయం యేన*

*భుక్తం స తు సదా భవేత్*

*రసజ్ఞా విధురః కుబ్జః*

*కణ్డూ సర్వాఙ్గదుఃఖితః*� 


అని శివధర్మోత్తరపురాణ వచనము


శ్రీకృష్ణదేవరాయలవారు..

నన్నయమహర్షి చెప్పినట్లు

_"ఆదిరాజనిభుడు"_


ఆ చక్రవర్తి నేర్వని విద్యలేదు..

అభ్యసించని శాస్త్రము లేదు..

ప్రకటించని పరాక్రమములేదు..


వింధ్యపర్వతశ్రేణినుంచి 

హిందూమహాసముద్రపర్యంతము

సువిశాలసామ్రాజ్యములో

ఎన్నెన్ని దేవాలయములనో

పునరుద్ధరించి .. పోషించి

ప్రజాసంక్షేమకరముగ పరిపాలించిన

మహాప్రభువు..

ప్రపంచచరిత్రలో ఇటువంటి

చక్కవర్తి మరొకడు లేడు..


ఆ మహానుభావుడన్ని 

దేవాలయములనెలా 

పరిరక్షించినాడో..

ఆయనయే ఆముక్తమాల్యద

యామునాచార్యుని రాజనీతిబోధ

సందర్భమున పై పద్యములో

ఆదేశించినాడు..


ఈ పద్యములో..

దేవాదాయపరిరక్షణలో

రాయలవారి దూరదృష్టి..

సూక్ష్మరాజనీతి వివేచన..

విశాలదృక్పథము..

ప్రభుత్వకర్తవ్యము

అన్నీ ప్రతిఫలిస్తాయి..


ఈ నాడా సూత్రమును

పాటింపక దేశమున 

దేవాదాయవ్యవస్థ 

స్వార్థపరులైన రాజకీయనాయకులచేతిలో

ఛిన్నాభిన్నమైనది..


మంచిరోజులకొఱకాశించుటకన్న

మనము చేయగలిగినది లేదు...


సాంప్రతి సురేంద్రనాధ్.

కామెంట్‌లు లేవు: