శివుడి ఏకాదశ (11) అవతారములు( ప్రభల తీర్థ ప్రాశస్త్యం )*** మహా విష్ణువు కి దశ(10) అవతారాలు ఉన్నట్లే రుద్ర నమకం ప్రకారం శివుడు 11 అవతారాలతో ఏకాదశ రుద్రులుగా దర్శనమిస్తాడు. అందులోని అనువాకం ప్రకారం ఏకాదశ రుద్రుల పేర్లు 1) విశ్వేశ్వరుడు 2)మహాదేవుడు 3) త్రయంబకుడు 4) త్రిపురాంతకుడు 5) త్రికాగ్నికాలుడు 6) కాలాగ్ని రుద్రుడు 7) నీలకంఠుడు 8) మృత్యుంజయుడు 9) సర్వేశ్వరుడు 10) సదాశివుడు 11) శ్రీమన్మహాదేవుడు....విశ్వమంతటినీ పాలించే శక్తి సంపన్నుడు కాబట్టి విశ్వేశ్వర రుద్రుడు అని పేరు...మహా అంటే గొప్ప, గొప్ప గుణం సంపన్నుడు కావున మహాదేవ రుద్రుడు అని....అంబకం అంటే కన్ను, త్రయం అంటే మూడు, మూడు కన్నులు కలవాడు కాబట్టి త్రయంబక రుద్రుడు.... తపస్సు శక్తి ద్వారా వరాలు పొంది, గర్వంతో లోకాన్ని పీడిస్తున్న తారకాక్షుడు,కమలాక్షుడు,విద్యున్మాలి అనే తారకాసురుడి కుమారులను వధించుట వల్ల త్రిపురాంతక రుద్రుడు....గార్హపత్య,అహవనీయ, దక్షిణ అనే మూడు అగ్నుల్లో హోమం చేసిన ద్రవ్యాలను స్వీకరించేవాడు కాబట్టి త్రికాగ్నికాల రుద్రుడు అని.... కాలాగ్నితో విభూతిని సృష్టించేవాడు కావున కాలాగ్ని రుద్రుడు ... క్షీరసాగర మథనం లో ఉద్భవించిన హాలాహలాన్ని మింగి తన కంఠంలో బంధించడం వల్ల, విష ప్రభావం వల్ల కంఠం నీలంగా మారడం వల్ల నీలకంఠ రుద్రుడు....అల్పాయుష్కుడైన మార్కండేయుణ్ని మృత్యువు నుండి రక్షించుట వల్ల మృత్యుంజయ రుద్రుడు.....తన శక్తి సామర్థ్యాలతో సర్వులకు అభయమిచ్చి ఆదుకునే వాడు కావున సర్వేశ్వర రుద్రుడు....సదా ఆయన నామాన్ని స్మరిస్తూ ఉండే వారిని సదా కాపాడుతూ ఉంటాడు కావున సదాశివ రుద్రుడు.... విష్ణుమూర్తి భక్తి కి మెచ్చి సుదర్శన చక్రాన్ని ఇచ్చుట వల్ల ఆ సమయంలో ఆనందం తో విష్ణుమూర్తి శివుడిని శ్రీమన్మమహాదేవా అని సంబోధించడం వల్ల శ్రీమన్మహాదేవ రుద్రుడు అని పిలుస్తారు......... ఏకాదశ రుద్రుల ఆలయాలు కోనసీమ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కొలువై ఉండడం విశేషం గా ఉంది....1) విశ్వేశ్వర రుద్రుడు - వాఘ్నేశ్వరం2) మహాదేవ రుద్రుడు - కె.పెదపూడి.3) త్రయంబక రుద్రుడు - ఇరుసుమండ 4) త్రిపురాంతక రుద్రుడు - వక్కలంక 5) త్రికాగ్నికాల రుద్రుడు - నేదునూరు 6) కాలాగ్ని రుద్రుడు - ముక్కామల 7) నీలకంఠ రుద్రుడు - మొసలపల్లి 8) మృత్యుంజయ రుద్రుడు - పాలగుమ్మి 9) సర్వేశ్వర రుద్రుడు - గంగలకుర్రు 10) సదాశివ రుద్రుడు - గంగలకుర్రు 11) శ్రీమన్మహాదేవ రుద్రుడు - పుల్లేటికుర్రు....... ప్రతీ సంవత్సరం కనుమ పండుగ రోజున కోనసీమ జిల్లా జగ్గన్నతోట ప్రభల తీర్థం లో వివిధ ప్రాంతాల్లో నెలవై ఉన్న ఏకాదశ రుద్రులను ఒక చోటికి తీసుకుని వచ్చి సంబరాలు నిర్వహిస్తారు. ఒకేచోట కొలువై ఉన్న ఏకాదశ రుద్రుల దర్శనం మంచిదనే విశ్వాసం తో ఎంతోమంది భక్తులు గుమిగూడడం వల్ల ప్రభల తీర్థంగా విశేష ప్రాశస్త్యం పొందింది..............
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి