*23 - భజగోవిందం / మోహముద్గర*
🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️
*భజగోవిందం శ్లోకం:-21*
స్వామీ చిన్మయానందజీ గీతోపాన్యాసాలు 11-52-52 చూడుము.
*పునరపి జననం పునరపి మరణం*
*పునరపి జననీ జఠరేశయనమ్ ।*
*ఇహ సంసారే బహుదుస్తారేకృపయాఽ పారే పాహి మురారే॥ భజ ॥ 21*.
*ప్రతి॥* పునరపి = మళ్ళీ తిరిగి; జననం = పుట్టుక; పునరపి=మళ్ళీ తిరిగి; మరణం = చావు; పునరపి = మళ్ళీ మళ్ళీ; జననీ = తల్లి యొక్క; జఠ రే= పొట్టయందు; శయ నమ్ = పడివుండటం; ఇహ = ఈ; సంసారే = ప్రపంచమందు; బహు = చాల; దుస్తారే = దాట టానికి దస్తరమైనది; అపా రే= (ఇలాంటి ఈ) అపార సంసారం నుంచి; కృపయా = దయచేసి అనంతమైన స్వభావం కలిగిన; మురారే = మురను చంపిన నీవు: పాహి = రక్షించుమా!
*భావం:-*
మళ్ళీ మళ్ళీ చావు పట్టుకల్లో తిరగడం మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలో పడటం ఈ అపార సంసారములోని యీ పద్ధతి యెంతో తరించలేనట్టిదిగా వుంది. ఓ అనంత దయా మయుడవైన మురారీ ! దయచేసి రక్షించుమా !
*వివరణ:-*
పుట్టుక చావుల చక్రం జీవుని విషయంలో విశ్రాంతి అనేది పొందదు. “అహం” అనేది కోరికలతో ప్రేరేపింపబడి, అపరిమిత భావనలను పెంచి, అలవాట్లకు మరిగి, కోరికలు తీర్చుకోవటానికి బదులు క్రొత్తకోరికల పుంజాన్ని చుట్టూ అలంక రించుకొంటుంది. వాసనా ప్రాబల్యంతో జన్మలోకి వచ్చినతను వాసనలను వదిలించు కోవటానికి బదులు ఆ విధంగావృద్ధిపొందించు కొంటుంది. ఆ యహం ఎందుకని? వదిలించు కోవటం చేతగాక, బాహ్యవస్తువులపై దృష్టి మమత్వ దృష్టితోనే మునుగుతూ వుండటం చేత అంతర్గతమైన దృష్టి యేర్పరచు కొనక బాహ్య వస్తువులకు రంగులు చల్లి విలువలు హెచ్చించటంచేత దానిని “మాయ” అంటాము-- ఆ మాయ చేత.
ఈ ప్రపంచములోకి మనం సహజ వాసనలతో సహా పుట్టినాము. ఇక్కడ అడ్డదిడ్డంగా వుండే వాసనలెన్నో ఆడుతూ వున్నాయి. బాహ్య వస్తువులు, మనిషి ప్రయత్నాలు మొదలైన వాటి అనుభవాలు, సహజ వాసనలతో పుట్టిన వాళ్ళము. క్రొత్త వాసనలను ఎక్కించుకోకుండా వుంటే - అనగా అసక్తతతో కోరికలు లేకుండా అహం భావము ప్రదర్శించకుండా కాలం గడిపినట్లయితే అహంకార భావమూ మమకార భావమూ లేకుండ వున్నట్లయితే- క్రొత్త వాసనలు మీద కెక్కక పాత వాసనలు యీ అనుభవంతో ఖర్చయి పోతవి. నిజానికి ఇదీ అనుసరించాల్సిన మార్గం. అంటే పనులు చెయ్యవద్దా? ప్రపంచములో అని శంక. చెయ్యాలి. తప్పకుండా నిరంతరం చెయ్యాలి. కాని ఆ ప నులన్నీ కర్తవ్యాలన్నీ పరమేశ్వర పరంగా చెయ్యాలి. లోక సంగ్రహార్థం చెయ్యాలి.
యజ్ఞ భావంతో చెయ్యాలి అంటే నేను పరమేశ్వరుడికి చెయ్యి (లేదా ఇంద్రియం) వంటి వాడని, పరమేశ్వరుడు ఈ పని నా కర్తవ్యమన్నాడు. గనుక - చెయ్యి నాకెలా పని చేస్తోందో అలా నేను భగవంతుడి పరంగా పని చేస్తున్నాను అని అలా చేసిన పని ఫలితం నాది కాదు, ఆయనదే. ఆయన అనగా సర్వ ప్రపంచమూనని అర్థం. అందుకని నేను చేసేది లోక సంగ్రహార్థమేననీ భగవంతుడు నడిపించే యీ ప్రపంచమనే యంత్రంలో ఒక "సీల"లా నేనున్నాను. నాకు ఏర్పరచినంత వరకూ నేనూ నా కర్తవ్యం చేస్తున్నాను. "యీ యంత్రము భగవంతుడి కోసమే” అనుకొంటూ ఈ ప్రపంచంలో బ్రతుకుతూ వుండాలి.
అలా, వున్న వాసనలు తగ్గిపోతే, ఆలోచనల ఆటంకాలు తగ్గిపోతాయి. మనోబుద్ధు లావిధంగా తగ్గితగ్గి పరమేశ్వరుణ్ణి చేరిపోతవి.
ఆ తరువత క్రొత్తవాసనలు చేరక పోవటాన, వున్నవాసనలు ఖర్చయిపోవటాన అసలు వాసనలే వుండవు. వాటిని యిక అనుభవించి తీర్చుకొనటమనే ప్రశ్నే ఉదయించదు కనుక తిరిగి పుట్టవలసి అగత్యమే పోతుంది. ఇక అందుకనే జన్మ వుండదని భావము.
పుట్టటం చాల బాధతో కూడినట్టిది-చావు యింకా యెక్కువ బాధాకరం కావచ్చు. అలా వుంచండి- తల్లికి గల చిన్న పొట్టలో పడటం, వత్తిడి, మెలికలు తిరగ టం, ఖైదీలా వుండటం, తల్లియ్కొ భౌతికమైన, మానసికమైన కష్టనిష్ఠూరాలకల్లా తను కూడ చికాకు పడి ఇరుకున పడుతుండటం, ఆమెను తన్నుతుండటం, ఇదంతా చాల కఠినమైనట్టిది, బాధాకరమే కాదు - భయంకరమైనట్టిది, క్రూరమైనట్టిది కూడ.
పరి పూర్ణతనుండి యిలా పడిపోతుంటే కలిగే దుష్టశక్తి చాలా యెక్కువైంది. మనం ఒంటరిగా దాన్ని ఆపలేమేమో. నానుంచి కలిగింది ఈ శక్తి ఈ అహం - అది యింత పెద్దదై వెలుస్తోంది. నన్నే ముంచి వేస్తోంది. ఇలా ఆక్రమిస్తున్న దీని ముందుఅయ్యో నేను వట్టి బానిసనా? అనిపిస్తోంది. లోపలి నిరంకుశుడి నుంచి నేను విడివడ టానికి - నాకు శక్తి కనపడదు - అందుచేత ఇంకొక బలవంతుడైన స్నేహితుని నాకు సాను భూతి చూపేవాడిని ఆశ్రయించాలి. అతడెవరు?
‘‘అహం’’ అనే ‘ముర’ రాక్షసుని చంపిన ఓ కృష్ణా నన్ను రక్షించు, నన్ను రక్షించవయ్యా మహానుభావా! అనే హృదయ విదారకమైన ఆర్తి కలుగుతుంది. అతడి పాదాలను ప్రేమతో ఆశ్రయించటమనే ఒకే ఒక్క మార్గం తప్ప మరొకటి లేదు.
నిజానికి నా స్వంత ఉద్రేకాలకే నేను బానిసనై పోయిన నాకు ఆ పరమేశ్వరుని సహాయం కోరటంకన్న యింక నేమి మిగిలింది? ఆయన్ను ప్రార్థించటం తప్ప:--
"ఓ ప్రభూ! ఇన్నాళ్ళు నీ మీదకు మనస్సు త్రిప్పని మాట నిజమే! అప్పుడు నీకయి సమర్పించటానికి నా కన్నీరు తప్ప యింకొకటిలేదు నా దగ్గర, నాకు ఏమున్నదని చెప్పుకోను? చిల్లర విషయాల్లో పడిన శ్రమ విసుగూ తప్ప! స్వార్థంతో చేసిన పనుల న్యూనత తప్ప! ఉద్రేకాల్లో విడిచిన స్వేద జలం తప్ప నేను రక్షింపబడ్డ తగనట్టి వా నేమొకాని ప్రభూ! అలిసి పోయాను లోవొక్కింతయి లేదు. -- ధైర్యం విలోలంబయ్యె మూర్చ వచ్చే పశ్చాత్తాపంతో కృశించి పోతున్నా. నిస్సహాయుణ్ణి, సంపూర్ణంగా నశిం చాను, నీ మ్రోల !
" నీ ముందు నీ దయావర్షములో నన్ను నేను సమర్పించుకొంటాను నీవునీవు కనుక-నా మొర వినవచ్చు నేను నీ నుంచి కనక, దయా పూర్ణత నాశించవచ్చు. నీవు కృపాసముద్రుడవు గదా! వికాసమూర్తివి, దయామయుడవు. ప్రేమ పూర్ణుడవు! ముర అనే రాక్షసుని చంపిన వాడవు గదా! నీవు తిరిగి ఆ రాక్షసుణ్ణి చంపకూడదా! వాడు మళ్ళీ నా హృదయంలో వున్నాడు. నా దుర్మార్గపు వాసనలే వాడై హృదయంలో వాడుగా వున్నాడు. ఒక్కసారి మళ్ళీ నా మీద దయతలచి వాణ్ణి చంపివేయవూ!! ప్రభూ! నీ దయ - నీవేంచేసినా సరే - నీ మ్రోల నేను నశించనీ పోనీ!
అలా అతడికి సమర్పించుకోవటం నిష్కపటంగా అతడిని ధ్యానించడం వల్ల మంచి వాసనలను మనసులో సృష్టించబడతవి. అవే ఆ అహం అను వానికి మందు. అహంభావ భూయిష్ఠమైన వాసనలు తగ్గటానికి అదే సూత్రం, అవి తగ్గిపోతే మురళీ కృష్ణుని సంగీతరవం వినపడుతుంది. ఆయన హీనకాంతి దృగ్గోచరమవుతుంది. ఆయన మెడలో పూలహారాలను చూరిస్తుంది. ఆయన చేతిలోని నవనీతం అమృతా న్నిస్తుంది. ఆయన యాలింగనం మనలో కరిగిపోయి వుంటుంది.
*ఓమ్ తత్సత్.*
*సశేషం*
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి