19, నవంబర్ 2024, మంగళవారం

సంపూర్ణ మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*విరాట పర్వము పంచమాశ్వాసము*


*200 వ రోజు*

*సుయోధనుని సందేహం*

విరాటరాజు కొలువులో పెళ్ళి సంరంభం జరుగుతుండగా హస్తినకు తిరిగి వెళుతున్న సుయోధనునికి ఇంకా సందేహం నివృత్తి కాలేదు. అతనికి కర్ణుడు, శకుని మాటల మీద ఉన్న నమ్మకం భీష్మునిని పలుకులపై లేదు. సందేహ నివృత్తి కొరకు ధర్మరాజు వద్దకు ఒక దూతను పంపి " ధర్మరాజా ! మీ అజ్ఞాతవాసం ముగియక ముందే అర్జునుడు బయట పడ్డాడు. నీవు లెక్క చూసి ఏది ఉచితమో అది చెయ్యి " అని చెప్పించాడు. ఆ మాటలలో ఉన్న అంతరార్ధం గ్రహించి ధర్మరాజు నవ్వి " మేము సమ్మతించి నట్లు పదమూడు సంవత్సరాలు నిండాయి. ఇది నిజం ఈ మాట నీవు భీష్మ, ద్రోణ, కృపాచార్యులు వింటుండగా సుయోధనునికి తెలియ చెయ్యి " అని దూతతో చెప్పాడు. దూత ఆవిషయాన్ని అలానే చెప్పాడు. సుయోధనుడు తాను దూతను పంపిన విషయం దాచి " తాతాగారూ ! ఆచార్యా ! మనం మోసపోయి అనవసరంగా అర్జునినితో యుద్ధం చేసాము. అర్జునుడు పదమూడేళ్ళు నిండిన తరువాత బయటకు వచ్చాడా లేదా అన్న విషయం మనం సరిగా విచారించ లేదు " అన్నాడు. భీష్ముడు " సుయోధనా ! జరిగింది చాలు ప్రతిజ్ఞా భంగం కాలేదు నీ మాటలు ఇక కట్టి పెట్టు ఎవరైనా వింటే నవ్వగలరు. మారు మాటాడక హస్థినకు పద " అన్నాడు. చేసేది లేక సుయోధనుడు హష్తినకు మరలి వెళ్ళాడు.


*పాండవులు ఉపప్లావ్యం చేరుట బంధుమిత్రుల రాక[*


పాండవులు శమీ వృక్షం దగ్గరకు వెళ్ళి ఆయుధాలకు తగినట్లు పూజించి తమ వెంట తీసుకు వెళ్ళారు. పాడవులు అంతా ఉపప్లావ్యం చేరుకున్నారు. విరాటుని ఆజ్ఞపై ప్రజలంతా పాండవులకు కానుకలు సమర్పించారు. విరాటుడు సమకూర్చిన సౌకర్యాలతో పాండవులు ఉపప్లావ్యంలో సుఖంగా ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు బలరాముడు రుక్మిణి, సత్యభామ, సుభద్ర, అభిమన్యుడు, సాత్యకి, కృతవర్మ, సాంబుడు, ప్రద్యుమ్నుడు, యుయుధానుడు, రుక్మి, అకౄరుడు, ఇంద్రసేనుడు మొదలగు వీరులు వెంట రాగా యాదవప్రముఖులతో ఉపప్లావ్యం చేరాడు. పాండవులు శ్రీకృష్ణునికి ఎదురేగి సాదరంగా ఆహ్వానించారు. దృపద మహారాజు, కాశీరాజు శైబ్యుడు తమతమ భార్యా పుత్రులతో ససైన్యంగా ఉపప్లావ్యం చేరారు. అనేక దేశాలనుండి రాజులు ఉత్తరాభిమన్యుల వివాహానికి ఆహుతులుగా వచ్చారు. వివాహ వేదిక అత్యంత శోభాయమానంగా తయారైంది. ఉత్తరను పెళ్ళి కూతురుగా అలంకరించారు. పాండవులను పెళ్ళికి తరలి రమ్మని పురోహితులతో విరాటరాజు ఆహ్వానం పంపాడు. అభిమన్యుని కూడా పెళ్ళి కుమారునిగా అలంకరించి అందరూ పెళ్ళికి తరలి వెళ్ళారు. విరాటుడు శ్రీకృష్ణుని, పాండవులను సాదరంగా ఆహ్వానించాడు. పెళ్ళి తంతు ఆరంభం కాగానే శ్రీకృష్ణుడు, బలరాముడు, ధర్మరాజు, అర్జునుడు, విరాటరాజు సముఖంలో వధూవరులు తెరదగ్గర నిలిచారు. జ్యోతిష్కులు నిర్ణయించిన శుభమూహూర్తం సమీపించింది అని తెలిపిన పిమ్మట వధూవరులు ఒకరిని ఒకరిని చూసుకుని ఆనందించారు. దోసిళ్ళతో తలంబ్రాలు పోసుకున్న పిమ్మట అభిమన్యుడు ఉత్తరపాణి గ్రహణం చేసి ఆపై ఒకే ఆసనంపై ఆసీనులైయ్యారు. విరాటరాజు పాండవులకు, శ్రీకృష్ణునికి, ద్రౌపతిపకి, సుభద్రకు వస్త్రాభరణాలు బహూకరించాడు. ఉత్తరా భిమన్యుల వివాహం వైభవంగా జరిగింది.

*విరాట పర్వము సమాప్తం*


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కామెంట్‌లు లేవు: