19, నవంబర్ 2024, మంగళవారం

కార్తీక పురాణం - 19

 _*🚩కార్తీక పురాణం - 19 వ అధ్యాయము🚩*_


🕉️🌻🕉️🌻🕉️🌻🕉️🌻🕉️🌻🕉️


*చతుర్మాస్య వ్రత ప్రభావనిరూపణ*


☘☘☘☘☘☘☘☘☘


ఈ విధముగా నైమిశారణ్యమందున్న మహా మునులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞానసిద్దుడను ఒక మహాయోగి *"ఓ దీనబాంధవా ! వేద వేద్యుడవని , వేద వ్యాసుడవని , అద్వితీయుడవని , సూర్యచంద్రులే నేత్రములుగా గల వాడవని , సర్వాంతర్యామివని , బ్రహ్మ రుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడువాడవని , నిత్యుడవని , నిరాకారుడవని సర్వజనులచే స్తుతింపబడుచున్న ఓ మాధవా ! నీకివే మా హృదయపూర్వక నమస్కారములు. సకల ప్రాణికోటికి ఆధార భూతుడవగు ఓ నందనందనా ! మా స్వాగతమును స్వీకరింపుము. నీ దర్శన భాగ్యమువలన మేము మాఆశ్రమములు , మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి. ఓ దయామయా ! మేమీ సంసార బంధము నుండి బైట పడలేకుంటిమి , మమ్ముద్దరింపుము. మానవుడెన్నిపురాణములు చదివినా , యెన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము బడయజాలడు. నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గో చరుడవగుడువు. ఓ గజేంద్రరక్షకా ! ఉపేంద్రా ! శ్రీధరా ! హృషీకేశా ! నన్ను కాపాడుము"* అని మైమరచి స్తోత్రము చేయగా , శ్రీ హరి చిరునవ్వు నవ్వి *"జ్ఞానసిద్దా ! నీ స్తోత్రవచనమునకు నేనెంతయు సంతసించితిని. నీ కిష్ట మొచ్చిన వరమును కోరుకొనుము"* అని పలికెను. అంత జ్ఞానసిద్దుడు *"ప్రద్యుమ్నా ! నేనీ సంసార సాగరము నుండి విముక్తుడను కాలేక శ్లేష్మమున పడిన ఈగవలె కొట్టుకోనుచున్నాను. కనుక , నీ పాద పద్మముల పైనా ధ్యానముండుటనటుల అనుగ్రహింపుము. మరేదియు నాకక్కరలేదు"* అని వేడుకొనెను. అంత శ్రీమన్నారాయణుడు *"ఓ జ్ఞానసిద్దుడా ! నీ కోరిక ప్రకారమటులనే వరమిచ్చితిని. అదియునుగాక , మరొక వరము కూడా కోరుకొనుము యిచ్చెదను. ఈ లోకమందు అనేక మంది దురాచారులై , బుద్దిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు. అట్టి వారల పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను. అ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును. సావధానుడవై ఆలకింపుము.


*నేను ఆషాడ శుద్ద దశమిరోజున లక్ష్మిదేవి సహితముగా పాలసముద్రమున శేషశయ్యపై పవళింతును. తిరిగి కార్తీక మాసమున శుద్దద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు. ఈకాలములో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము. ఈ వ్రతముచేయు వారలకు సకల పాపములు నశించి , నా సన్నీధికి వత్తురు. ఈ చతుర్మాస్యములందు వ్రతములు చేయనివారు నరకకూపమున బడుదురు. ఇతరులచేత కూడా ఆచరింప చేయవలయును. దీని మహాత్మ్యమును తెలిసియుండియు , వ్రతము చేయనివారికి బ్రహ్మహత్యాది పాతకములు గలుగును. వ్రతము చేసినవారికి జన్మ , జరా , వ్యాధుల వలన కలుగు బాధలుండవు. దీనికి నియమితముగా ఆషాడశుద్ద దశమి మొదలు శాకములును , శ్రావణశుద్ద దశమి మొదలు పప్పుదినుసులను విసర్జించవలయును. నా యందు భక్తి గలవారిని పరీక్షించుటకై నేనిట్లు నిద్రావ్యాజమున శయనింతును. ఇప్పుడు నీ వోసంగిన స్తోత్రమును త్రిసంధ్యలయందు భక్తిశ్రద్దలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగ వత్తురు."* అని శ్రీమన్నారాయణుడు మునులకు బోదించి శ్రీమహాలక్ష్మితో గూడి పాలసముద్రమున కేగి శేషపానుపు మీద పవ్వళించెను.


వశిష్టుడు జనకమహారాజుతో *"రాజా ! ఈ విధముగా విష్ణుమూర్తి , జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చతుర్మాస్య వ్రత మహత్మ్యమును ఉపదేశించెను. ఈ వృత్తాంతమును ఆంగీరసుడు ధనలోభునకు తెలియచేసెను. నేను నీకు వివరించినాను గాన ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు , అన్ని జాతులవారును చేయవచ్చును. శ్రీమన్నారాయణుని ఉపదేశము ప్రకారము ముని పుంగవులందరు యీ చతుర్మాస్య వ్రత మాచరించి ధన్యులై వైకుంఠమున కరిగిరి.


*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి ఏకోనవింశోధ్యాయము - పందోమ్మిదోరోజు పారాయణము సమాప్తము.*


🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏

కామెంట్‌లు లేవు: