వందేమాతరం
కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.
*భక్తికి మర్కట మార్జాల సూత్రం*
హిందుత్వం మతం అనేది ప్రపంచమిచ్చిన ఒక విశేషణం మాత్రమే. ఆచరణలో ఇది ధర్మ ఆధారమైన జీవన విధానం. ప్రపంచం మొత్తం సనాతన ధర్మంగా భావించేది హిందుత్వమే. ముఖ్యంగా మానవత్వం, భక్తి అనే రెండు సూత్రాలను సమాంతరంగా సూచించి వ్యక్తిత్వ ఔన్నత్యాన్ని పెంపొందించేది ప్రపంచంలో హిందూ ధర్మం ఒక్కటే.
హిందుత్వం దైవాన్ని చేరుకునేందుకు మానవునికి కావలసిన అంతరదృష్టిని భక్తి మార్గంలో అందింస్తున్నది.
ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. ప్రపంచ వినాశనానికి హైందవేతరములే ఎందుకు కారణం అవుతున్నాయి? హిందుత్వం ఎందుకు కాదు? అని ఆలోచిస్తే, ఇతరుల వినాశనాన్ని కోరుకునేది ముఖ్యంగా మనిషిలోని అహంకారము మరియు స్వార్థమే. మన సనాతన ధర్మంలో వేద కాలం నుంచి కూడా అహంకార నిర్మూలన స్పష్టంగా కనిపిస్తుంది. దాని స్వరూపమే యజ్ఞాలు. యజ్ఞకర్త యజ్ఞ నిర్వహణ సమయంలో తనకు ఉన్నదంతా దానం చేయవలసి ఉంటుంది. అంతేకాదు అసుర నిర్మూలన కూడా భగవంతుడు తన అవతారాలు అయిన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు రూపాల్లో చూపించాడు. ప్రజలకి భగవద్గీత ద్వారా కర్మయోగాన్ని బోధించాడు. ఇలా నిరహంకార వ్యక్తిత్వాన్ని పెంపొందించే మార్గాలు ఇతర సాంప్రదాయాల్లో లేకపోవడమే హిందుత్వానికి భిన్నంగా ఆ మతాలు ఉండడానికి కారణం.
ఇక అసలు విషయానికి వస్తే, దైవాన్ని చేరుకునే మార్గంలో కూడా మర్కటమార్జాల సూత్రం అన్వయింపు చేసుకోవచ్చు. ఈ సూత్రంలోని మర్మాన్ని తెలుసుకొంటే భక్తునికి భగవంతునిపై సంపూర్ణ అవగాహన కలుగుతుంది.
మర్కటమంటే కోతి. మార్జాలమంటే పిల్లి. భక్తులు భగవంతునితో రెండు విధాలుగా వ్యవహరించవచ్చునని ఈ సూత్రం సూచిస్తుంది. మానవుడు భగవత్సాన్నిధ్యం పొందడానికి ప్రత్యేక ప్రయత్నం చేయనక్కరలేదు. భగవంతునికి తన సమస్తములు అర్పించుకొని, ఆత్మనివేదనం చేసుకోంటే చాలు భగవంతుడు సాయుజ్యం ప్రసాదిస్తాడు. పిల్లి తన పిల్లలను, తననోట కరచిపట్టుకొని, సురక్షిత ప్రాంతాలలోకి చేరుస్తుంటుంది. ఇందులో పిల్లి పిల్ల ఏ ప్రయత్నము చేయదు. తన భారమంతా తల్లికే అర్పించి నిశ్చింతగా ఉంటుంది.
ఇక రెండవ విధానంలో భక్తుడు భగవంతుని ఆరాధించే ప్రయత్నం చేయాలి. అట్టి ఆరాధనలోనే అతడు భగవంతుని కృపను పొందుతాడు. తల్లి కోతి పొట్టను పిల్లకోతి గట్టిగా అతుక్కుని పట్టుకుంటుంది. అప్పుడు తల్లి కోతి, పిల్లకోతిని సురక్షిత ప్రాంతానికి చేరుస్తుంది.
భక్తులు అనుసరించే ఈ రెండు మార్గాలు, వారిని భగవంతుని సన్నిధికి చేర్చేవే. నిస్వార్థ పరుడు, నిష్కపటి అయిన భక్తుడికే ఇది సాధ్యపడుతుంది. అటువంటి భక్తుడే పరిపూర్ణుడవుతాడు. అటువంటి నిరహంకార, ద్వేషరహిత మానసిక స్థితి కలవాడు మాత్రమే భగవంతుని సాన్నిద్యానికి అర్హుడు. ఇదే మనకు సనాతన ధర్మం బోధిస్తుంది.
సర్వేజనా సుఖినోభవంతు.
మృశి
దశిక ప్రభాకర శాస్త్రి
15.11.2024
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి