కార్తీక పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలతో.....
కార్తీక పౌర్ణమి విశిష్టత:-
ఆగ్నేయంతు యదావృక్షం కార్తిక్వాం భవతి క్వచిత్
మహతి సా తిథి: జ్ఞేయా స్నాన దానేషు చోత్తమా
యదాతు యామ్యం భవతి ఋక్షం తస్యాం తిథౌ క్వచిత్
తిథి స్వాపి మహాపుణ్యా మునిబి: పరికీర్తితా
ప్రాజాపత్యం యదా ఋక్షం తిథౌ తస్యం నరాధిప
సా మహా కార్తీకీ ప్రోక్తా దేవానామపి దుర్లభా
*అనగా కార్తిక పౌర్ణమి నాడు కృత్తికా నక్షత్ర యోగమున్నచో ఈ పూర్ణిమను ‘మహాపూర్ణ’ లేదా ‘మహాకార్తీకి’గా వ్యవహరిస్తారు.
*భరణి నక్షత్రం ఉన్నచో ‘మహాతిథి’ అని అంటారు. అలాగే రోహిణి ఉన్నా కూడా ‘మహాకార్తీకి’గా వ్యవహరిస్తారు. రోహిణి నక్షత్రంతో కూడిన పూర్ణిమ దేవతలకు కూడా లభించదని హేమాద్రి మరియు బ్రహ్మ పురాణాల ద్వారా తెలుస్తోంది.
*విశాఖాసు యదా భాను: కృత్తికాసుచ చంద్రమా:
సయోగ: పద్మకోనామ పుష్కరే స్వతి దుర్లభ:
పద్మకం పుష్కరే ప్రాప్య కపిలాం య: ప్రయచ్ఛతి
సహిత్వా సర్వపాపాని వైష్ణవం లభతే పదం
*అనగా సూర్యుడు విశాఖ నక్షత్రంలో చంద్రుడు కృత్తికలో ఉన్నచో పద్మక యోగమని, ఈ యోగమున పుష్కర తీర్థమున స్నానమాచరించి కపిల గోదానం చేసినచో పాపవిముక్తులై వైకుంఠమును చేరెదరని పద్మపురాణ వచనం.
*కార్తిక్యాం పుష్కరే స్నాత: సర్వపాపై: ప్రముచ్యతే
మాద్యం స్నాత: ప్రయాగేతు ముచ్యతే సర్వ కిల్బిషై:
*కార్తిక పూర్ణిమ నాడు పుష్కర తీర్థమున స్నానం ఆచరించినా మరియు మాఘపూర్ణిమ నాడు ప్రయాగలో స్నానమాచరించినా పాపవిముక్తులు అగుదురు. కార్తిక పూర్ణిమ నాడు శ్రీహరి మత్స్య రూపం ధరించాడని యమస్మృతి ద్వారా తెలుస్తోంది.
*వరాన్ దత్వా యతో విష్ణువు మత్స్య రూపీ భవేత్ తత:
తస్యాం దత్తం హుతం జప్తం తదక్షయ్య ఫలం స్మృతం
*పద్మపురాణంలోని కార్తిక మహాత్మ్యం ద్వారా కార్తిక పూర్ణిమనాడు శ్రీహరి బ్ర హ్మకు వరమిచ్చి మత్స్యరూపమును ధరించెను కావున ఈనాడు చేసిన దానం, హోమం, జపం అక్షయ ఫలాలను ఇచ్చునని శ్లోకార్థం.
*పౌర్ణమాస్యాంతు సంధ్యానాం కర్తవ్య: త్రిపురోత్స:
దద్యాత్ అనేన మంత్రేణ ప్రదీపాంశ్చ సురాలయే
కీకా: పతంగా: మశకా: వృక్షా: జలే స్థలేయే విచరంతి జీవా:
దృష్ట్వా ప్రదీపం నచ జన్మభాగిన: భవంతి నిత్యం స్వపచాహివిప్రా:
*కార్తిక పూర్ణిమ నాడు సంధ్యాసమయంలో త్రిపురోత్సవాన్ని జరిపి పై మంత్రాన్ని పఠిస్తూ దేవాలయంలో దీపాలను వెలిగించాలి. కీటకాలు, దోమలు మొదలైనవి మరియు చెట్లు, ఉభయచరాలు కూడా ఈ దీపమును దర్శించినచో పునర్జన్మ ఉండదు. ఈ దీపాన్ని దర్శించినవారికి కోరిన ఫలము దక్కును.
*కార్తిక్యాం యో వృషోత్సర్గమ్ కృత్వా నక్తం సమాచరేత్
శైవం పదమవాప్నోతి శివమ్ వ్రత మిదం స్మృతమ్
*కార్తిక పూర్ణిమ నాడు వృషోత్సర్గము చేసిన వారు కైలాసాన్ని పొందుతారని పై శ్లోకార్థం.
*కార్తిక్యాం య: నరోలోకే ధాత్రీ ఫల రసస్నాయి
తులసీ అర్చనం కృత్వా మహావిష్ణుం ప్రపూజ్యచ
బ్రాహ్మణాం పూజయిత్వాచ నపున ర్లభతే భవమ్
*అనగా కార్తికపూర్ణిమ నాడు ఉసిరి రసంతో స్నానమాచరించి తులసిని, శ్రీమహావిష్ణువును పూజించి బ్రాహ్మణులకు, బీదలకు వస్త్రదానం, సంతర్పణ చేసినచో పునర్జన్మ ఉండదు.
*పౌర్ణమి... ప్రతి నెలా వస్తుంది. కానీ చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసి ఉండే కార్తీక పౌర్ణమికి ఉండే ప్రత్యేకత మరే పున్నమికీ ఉండదు.
* ఖగోళపరంగా చూస్తే... ఏడాది వెుత్తమ్మీదా జాబిలి ఆ రోజు ఉన్నంత ప్రకాశంగా మరేరోజూ ఉండదు. *అంతలా వెలిగిపోయే వెన్నెలకే కన్నుకుట్టేలా గుడిప్రాంగణాలూ జలాశయాలూ కార్తీకదీపాలతో శోభాయమానంగా వెలిగిపోతాయి ఈ రోజు.
*ముఖ్యమైన విధులు: ఈ రోజు చేసే ఉపవాసానికి విశేషఫలం ఉంటుంది. కార్తీక పూర్ణిమ నాడు ప్రతి ఒక్కరు తప్పకుండా ఒక్క దీపమైనా వెలిగించి ఈ క్రింది శ్లోకం చదవాలి.
*కీటాఃపతంగాః మశకాశ్చ వృక్షాః
జలే స్థలే యే నివసంతి జీవాః |
దృష్ట్వా ప్రదీపం న హి జన్మభాగినః
భవంతి త్వం శ్వపచాహి విప్రాః ||
*ఈ దీపం చుసిన ప్రభావం చేత కీటకాలు (insects), పక్షులు, దోమలు, చెట్లు,మొక్కలు, ఉభయచరాలు (amphibians) అన్ని కూడా, అవి ఏ ఏ రూపాల్లో ఉన్నాయో, ఆ రూపాల్లోనే అవి మోక్షం పొందాలని, వాటికి మరుజన్మ ఉండకూడదని ప్రార్ధిస్తున్నా అని అర్ధం.
*ఎంతో పుణ్యం చేసుకుంటే మనకీ జన్మ వచ్చింది, ఈ జన్మలో మనం బుద్ధి ఉపయోగించి, వేదం చెప్పినట్టు బ్రతికి, జ్ఞానం పొంది, మోక్షం సాధించవచ్చు.
*కానీ, మిగితా జీవులకు ఆ అవకాశం లేదు. మనకు ఈ ప్రకృతిలో ఉన్న జీవరాశి ఏదో ఒక రకంగా ఉపకారం చేస్తూనే ఉంటాయి.
*వాటికి ప్రత్యుపకారం చేయడం మన ధర్మం. వాటికి ప్రత్యుపకారం చేయడం కోసం, మనకు లాగే అవి భగవంతున్ని చేరుకోవడం కోసం దీపాన్ని వెలిగించి, ఈ స్తోత్రాన్ని చదవాలి.
*కార్తీక పౌర్ణమిని త్రిపురి పౌర్ణమి అని కూడా పిలుస్తారు...
*పూర్వం శివభక్తులైన ముగ్గురు రాక్షసులు ఉండేవారట.
*వారి భక్తికి మెచ్చి పరమేశ్వరుడు ఏదన్నా వరాన్ని కోరుకొనమని అడుగగా తమను బంగారం, వెండి, ఇనుము అనే మూడు పురాలకు అధిపతులుగా చేయమని కోరుకున్నారు.
*అంతేకాదు! అంతరిక్షంలో సంచరించే ఈ మూడు పురాలూ ఎప్పుడైతే ఒకే రేఖ మీదకి వస్తాయో, ఆ రోజున ఒకే బాణంతో వాటిని ఛేదించగలిగినప్పుడే తమకు మరణం కలగాలని వేడుకున్నారు.
*ఇలా అసాధ్యమైన వరాలను కోరుకున్న త్రిపురాసుల ఆగడాలకు అంతు లేకుండా పోయింది. దాంతో ఆ పరమేశ్వరుడే వారిని సంహరించేందుకు పూనుకున్నాడు.
* వేయి సంవత్సరాల అనంతరం ఎప్పుడైతే ఆ మూడు పురాలూ ఒక్క తాటి మీదకు వచ్చాయో, అదను చూసి వాటిని తన బాణంతో ఛేదించి త్రిపురాంతకుడు అయ్యాడు....ఈ సంధర్భంగా పార్వతి దేవి పౌర్ణమి పూజ జరిపించారు అని పురాణం చెబుతుంది...
*కార్తీక పౌర్ణమి రోజు 🌹జ్వాలాతోరణం - 🌹 ప్రాముఖ్యత:-
*శివకేశవులకు ప్రీతికరమైన పవిత్ర కార్తీక మాసంలో అత్యంత మహిమాన్వితమైన రోజు కార్తీక పౌర్ణమి. *మనకు ఆశ్వీయుజ అమావాస్య దీపావళి అయినట్టు, కార్తీక పూర్ణిమ దేవతలకు దీపావళి అని చెప్తారు.
* ఈ రోజు చేసే స్నాన, పాన, దాన, దీప దానములతో పాటు చూసినంత మాత్రంగానే అనంతమైన పుణ్యఫలాలు ప్రసాదించే ఉత్సవం "జ్వాలతోరణం".
*కార్తీకపౌర్ణమి సాయంత్రం శివాలయాల్లో, ఆలయప్రాంగణంలో, ప్రధాన ఆలయానికి ఎదురుగా రెండు ఎత్తైన కర్రలు నాటి, మరొక కర్రను ఆ రెండింటిని కలుపుతూ అడ్డంగా కట్టి, ఆ కర్రను ఎండుగడ్డితో చుట్టి, ఆ గడ్డిని నిప్పుతో వెలిగిస్తారు. *ఇది మండుతూ తోరణ శివలింగంగా ఉంటుంది. దీనికి జ్వాలాతోరణం అని పేరు.
* దీని క్రింది నుంచి పల్లకిలో శివపార్వతులను దాటిస్తారు, భక్తులు కూడా ఈ జ్వాలాతోరణం క్రింది నుంచి దాటుతారు.
దీనికి సంబంధించి రెండు కధలు ఉన్నాయి.
ఒకటి :- త్రిపురాసురలనే 3 రాక్షసులను పరమశివుడు సంహరించింది ఈ రోజునే అని పురాణం చెప్తోంది. అందువల్ల దీనికి త్రిపుర పౌర్ణమి అని పేరు. దుష్టులైన రాక్షసులను సంహరించిన శివుడుం కైలాసానికి చేరగా, తన భర్తకు దృష్టి దోషం (దిష్టి) కలిగిందని భావించిన పార్వతీమాత, దృష్టిదోష పరిహారం కోసం జ్వాలాతోరణం జరిపించింది.
రెండవ కధ :- అమృత మధనానికి సంబంధించినది. కృతయుగంలో అమృతంకోసం దేవతలు,రాక్షసులు కలిసి క్షీరసముద్రాన్ని చిలికినప్పుడు పొగలు కక్కుతూ హాలాహలం (కాలాకూట విషం) పుట్టింది. *హాలాహలం లోకాన్ని నాశనం చేస్తుందన్న భయంతో దేవతలందరూ పరుగుపరుగున పరమశివుడి వద్దకు వెళ్ళి రక్షించమన్నారు.
*జగత్తుకు తల్లిదండ్రులు పార్వతీపరమేశ్వరులు. లోకహితం కోసం పరమశివుడు దానిని స్వీకరించాడు.
* కానీ మ్రింగితే అయన కడుపులో ఉన్న లోకాలు కాలిపోతాయి, బయటకు విడిచిపెడితే, దేవతలకు ప్రమాదం అని భావించి ఆ విషాన్ని తన కంఠంలోనే పెట్టుకున్నాడు.
*అప్పుడు శివుడు గరళ కంఠుడు / నీల కంఠుడు అయ్యాడు. ఇది జరిగాక పరమశివునితో కలిసి పార్వతి దేవి కుటుంబసమేతంగా మూడుసార్లు జ్వాలాతోరణం దాటింది.
*ఈ జ్వాలాతోరణంలో కాలగా మిగిలిన గడ్డిని పశువుల ఆహారంలోనూ, ధాన్యం నిలువ ఉంచే ప్రదేశంలోనూ పెట్టడం చేత పశువృద్ధి, ధాన్యవృద్ధి జరుగుతుంది.
*ఈ జ్వాలాతోరణం దర్శించడం వల్ల సర్వపాపాలు హరింపబడతాయని,ఆరోగ్యం చేకూరుతుందని, అపమృత్యువు నివారింపబడుతుందని శాస్త్రం చెప్తోంది.
*జ్వాలాతోరణం క్రిందినుండి వెళ్ళడం వలన నరకద్వారా ప్రవేశం తొలుగుతుంది.
* మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ దేహం నుంచి బయటకు రాగానే, ఆ ఆత్మను ఒక కుక్క భై అనే గట్టి అరుపులతో తరుముతుంది, తెలిసినా వాళ్ళు ఎవరు ఉండరు, ఎటు వెళ్ళాలో తెలియదు, ఆ పరిస్థితిలో దిక్కుతోచని ఆత్మ చీకటిలోకి వెళ్ళిపోతుంది. *అయినా ఆ కుక్క వెంటబడడం ఆగదు. అలా చాలా దూరం వెళ్ళాక, దూరంగా ఒక కాంతి కనపడుతుంది. అక్కడికి వెళ్తే తప్పించుకోవచ్చన భ్రమతో ఆత్మ ఆ దిశగా పరుగెట్టి, ఒక భయకరంగా మండుతున్న జ్వాలల తోరణాల నుంచి వెళ్ళి, నరకంలోకి ప్రవేశిస్తుంది.
*ఆత్మ వెంటపడి తరిమిన్న కుక్క భైరవుడు, శివగణాలలో ఒకడు.
* అప్పుడు ఆత్మ అనుభవించే బాధా వర్ణనాతీతం. అటువంటి పరిస్థితి రాకూడదని, తన బిడ్డలెవరు బాధపడకూడదని, మన మీద ప్రేమతో జగత్తుకు తండ్రి అయిన పరమశివుడు తనతో కలిసి కార్తీకపౌర్ణమి రోజున జ్వాలతోరణం దాటే వారికి ఈ నరకబాధ నుంచి విముక్తినిస్తాడు.
*అందుకే ప్రతి శివాలయంలో కార్తీకపౌర్ణమి నాడు విశేషంగా జ్వాలతోరణం జరుపుతారు....
*శివ కేశవ బేదం లేని పరమ పవిత్రమైన మాసం లో కార్తీక పౌర్ణమి రోజున జరిగే జ్వాలతోరణ దర్శనం చేస్తే సర్వపాపాలు తొలగుతాయి.
*జ్వాల తోరణ భస్మం ధరిస్తే బూత ప్రేత పిశాచ బాధలన్ని నివారణవుతాయి.
*కార్తీక జ్వాలా దర్శనం వలన మానవులకు, పశుపక్షాదులకు, క్రిమికీటకాలకు సైతం పునర్జన్మ ఉండదని ప్రతీతి....
****ఓం కార్తీక దామోదరాయ నమః ****
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి