27, ఫిబ్రవరి 2025, గురువారం

రావికొండలరావు

 ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు రావికొండలరావు గారు వందలాది చిత్రాల్లో నటించిన బహుముఖ ప్రజ్ఞాశాలి. చాలా చిత్రాలకు మాటల రచయితగా పనిచేశారు. కొన్ని సినిమాలను నిర్మించడంతో పాటు.. దర్శకత్వం కూడా వహించారు. ఈయన భార్య రాధాకుమారి కూడా సినిమా నటి. ఇద్దరూ కలిసి అనేక చిత్రాల్లో భార్యాభర్తలుగా నటించారు.  


రావి కొండలరావు గారు 1932, ఫిబ్రవరి 11న సామర్లకోటలో జన్మించారు. వీరి కుటుంబానిది శ్రీకాకుళం జిల్లా. 1958లో శోభ చిత్రంతో రావికొండలరావు గారి సినీ ప్రస్థానం మొదలైంది. మద్రాసు ఆనందవాణి పత్రికలో సబ్​ఎడిటర్​గా పనిచేస్తూ.. సినిమాల్లో నటించేవారు. బాపు-రమణలకు మంచి ఆప్తులు. కెరీర్ తొలినాళ్లలో ముళ్లపూడి రమణగారింట్లోనే ఉన్నారు. తొలి రోజుల్లో మలయాళం, తమిళ సినిమాలకు డబ్బింగ్ చెప్పేవారు. అక్కడ డబ్బింగ్ కళాకారిణిగా ఉన్న రాధాకుమారిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వీరివురూ చాలా సినిమాల్లో దంపతులుగానూ నటించారు.


"శోభ" సినిమాతో తెరంగేట్రం చేసిన తర్వాత వరకట్నం, పెళ్లికానుక, దసరాబుల్లోడు, అందాలరాముడు, రాధాకల్యాణం, చంటబ్బాయి, ఎదిరింటిమొగుడు పక్కింటి పెళ్లాం, పెళ్లిపుస్తకం, బృందావనం వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించారు. భైరవద్వీపం, బృందావనం, పెళ్లిపుస్తకం సినిమాలకు మాటల రచయతగా పనిచేశారు. ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావుకు సన్నిహితుడైన రావి కొండలరావు.. ఆయన దర్శకత్వం వహించిన భైరవద్వీపం, బృందావనం సినిమాల నిర్మాణ బాధ్యతలు పర్యవేక్షించారు.రావికొండలరావు మంచి కథకులు కూడా..! రావికొండలరావు కథలు, నాటికలు పేరుతో వాటిని వెలువరించారు. అలనాటి సినిమా విశేషాలను తెలుపుతూ బ్లాక్ అండ్ వైట్ అనే సినీ సంకలనం తీసుకొచ్చారు. ఆయన రచించిన హ్యూమరథం అనే పుస్తకం మంచి ప్రాచుర్యం పొందింది. రావికొండలరావును ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణతో గౌరవించింది.

కామెంట్‌లు లేవు: