27, ఫిబ్రవరి 2025, గురువారం

మొగలిచెర్ల అవధూత

 *మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..*


*చల్లటి స్పర్శ..*


"గత సంవత్సరం నుండీ  నాకు కష్టకాలం దాపురించినట్లుగా అనిపిస్తున్నది..ఏ పని చేద్దామని అనుకున్నా..ఏదో ఒక సమస్య తో ఆ పని ఆగిపోవడమో..లేదా..నాకు దక్కకుండా పోవడమో జరుగుతున్నది..జాతకం లో ఏదైనా దోషం ఉన్నదేమో నని..ఇద్దరు ముగ్గురు జ్యోతిష్కుల వద్ద జాతకం చూపించుకున్నాను..వాళ్ళు చెప్పిన పరిహారాలూ చేయించాను..ఈ పరిహారాలకే దాదాపు యాభైవేల రూపాయలు పైగా ఖర్చు చేసాను..అదొక అదనపు భారం పడింది నా మీద..దిక్కుతోచని పరిస్థితి నాది.." అన్నాడు నారాయణ  తన మిత్రుడి తో..


నిజమే..నారాయణ రావు సంవత్సరం క్రిందటి దాకా..బెంగుళూరు లో ఇళ్లు కట్టి అమ్మే వ్యాపారం లో బాగా సంపాదించాడు..కానీ ఉన్నట్టుండి అతని వ్యాపారం దెబ్బతిన్నది..కట్టిన ఇళ్లు అమ్ముడు పోలేదు..వాటి మీద పెట్టిన పెట్టుబడి ఇరుక్కుని పోయింది..తన స్వంత డబ్బులు కాకుండా..బైట నుంచి అప్పు తీసుకొచ్చి మరీ పెట్టుబడి పెట్టాడు..ఆ అప్పుకు వడ్డీ పెరిగి పోతున్నది..అప్పు ఇచ్చిన వాళ్లలో ఒకరిద్దరు తాము ఇచ్చిన డబ్బు వెనక్కు ఇచ్చేయమని వత్తిడి చేయ సాగారు..ఈ సమస్య లతో నారాయణ రావు మనోశాంతి కోల్పోయి బాధపడసాగాడు..


నారాయణ రావు చెప్పిందంతా విన్న మిత్రుడు..ధైర్యం వహించమని ఓదార్చాడు కానీ..అతని ఆర్ధిక బాధలు తీరడానికి ఎటువంటి మార్గము చూపలేకపోయాడు..నారాయణ రావు నిరాశలో కూరుకుపోసాగాడు..


సరిగ్గా ఆ సమయం లో నెల్లూరు లో ఉంటున్న తన బంధువు ఒకరు బెంగుళూరుకు వచ్చారు..అతనితో తన కష్టాన్ని చెప్పుకొని బాధపడ్డాడు..అతను నారాయణరావును నెల్లూరు రమ్మని చెప్పాడు..మూడురోజుల తరువాత నారాయణ రావు నెల్లూరు లోని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు..ఆ సమయం లో ఆ బంధువు పూజ చేసుకుంటున్నాడు..నారాయణ రావు ఓపికగా ఎదురు చూసాడు..

పూజ ముగించుకొని..ఆ బంధువు..నారాయణ రావు ను పలకరించి.."నారాయణా..నీ కొచ్చిన ఇబ్బందుల నుంచి బయట పడాలంటే..ఒక్కసారి మొగలిచెర్ల వెళ్లి, అక్కడ సిద్ధిపొందిన శ్రీ దత్తాత్రేయ స్వామివారి సమాధిని దర్శించు..ఆ స్వామి దయ వుంటే..ఈ కష్టాలన్నీ దూదిపింజల్లా ఎగిరిపోతాయి..నేను స్వయంగా అనుభవించాను..చాలా మహిమగల అవధూత మందిరం అది..ఈ మాట చెప్పి, నిన్ను అక్కడికి తీసుకెళ్లాడానికే నెల్లూరు రమ్మని చెప్పాను..ఇప్పుడే ఇద్దరమూ బయలుదేరి వెళదాము..నా మాట విశ్వసించు.." అన్నాడు..నారాయణ రావు తాను జ్యోతిష్కుల ను నమ్మి..ఎలా ఇబ్బంది పడిందీ వివరించి..ఇప్పుడు తనకు ఏ దేవీ దేవతలను..సిద్ధులను..గురువునూ.. కొలిచే ఓపిక లేదని..తనను బలవంత పెట్టొద్దనీ..చెప్పాడు..కానీ ఆ వ్యక్తి వినలేదు సరికదా..నారాయణ రావు చెవిలో పోరు పెట్టి..ఎట్టకేలకు ఒప్పించాడు..


ఇద్దరూ కలిసి..కారులో మొగలిచెర్ల కు చేరుకొని..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం చేరారు..శ్రీ స్వామివారి సమాధి వద్ద నమస్కారం చేసుకున్నారు..నారాయణ రావు..శ్రీ స్వామివారి సమాధి ముందు సాగిలపడి..తన కష్టాలు చెప్పుకున్నాడు..ముందున్న మంటపం లో కొద్దిసేపు  ఇద్దరూ కూర్చున్నారు..ఒక ఐదు నిమిషాలు గడిచే సరికి..నారాయణ రావు కు తనకు తెలీకుండానే..నిద్ర ముంచుకొచ్చింది..అలానే వాలిపోయి..నిద్ర పోయాడు..నిద్రలో ఎవరో తన వీపుమీద అనునయంగా తడుముతున్నట్టు..చల్లని చేయి తన వళ్ళంతా నిమురుతున్నట్టు తోచింది..నారాయణ రావు లేచి సమయం చూసుకుంటే...తాను సుమారు మూడు గంటల పాటు నిద్రలో ఉన్నట్టు తెలిసింది..తన బంధువు కూడా నిద్ర పోతున్నాడు..అతని మనసంతా తేలికగా ఉంది..తన బంధువు కూడా నిద్ర లేచిన తరువాత..ఇద్దరూ కలిసి..మరొక్కసారి శ్రీ స్వామివారి సమాధికి నమస్కారం చేసుకొని నెల్లూరు వచ్చేసారు.. 


ఆరోజు రాత్రికే నారాయణ రావు బెంగుళూరుకు తిరిగి వచ్చేశాడు..మరో రెండు మూడు రోజుల్లోనే..నారాయణ రావు కట్టిన ఇళ్లకు బేరం వచ్చింది..అదికూడా అతను అనుకున్న దానికన్నా ఎక్కువ రేటుకు..ఈ పరిణామం అతను ఊహించలేదు..ప్రక్కరోజే కొంత నగదు ఇచ్చి అగ్రిమెంట్ వ్రాసుకున్నారు..నారాయణ రావు తన బంధువుకు ఫోన్ చేసి..విషయం చెప్పి..మొగలిచెర్ల స్వామివారి వద్ద తాను పొందిన చల్లటి స్పర్శ ఆ స్వామి వారిదే అనీ..తనను గట్టెక్కించిన ఆ మహానుభావుడి మందిరాన్ని మళ్లీ మళ్లీ దర్శించుకోవాలనీ.. ఉద్వేగంతో చెప్పాడు..


రెండు నెలలు తిరిగే సరికి నారాయణ రావు మామూలు స్థితికి వచ్చేశాడు..అప్పటి నుంచీ అతని మనసంతా శ్రీ స్వామివారే నిండిపోయారు..తన జీవితాన్ని కాపాడిన స్వామివారి మందిరాన్ని  పదే పదే దర్శించుకుంటూ ఉంటాడు..


స్వప్నంలో శ్రీ స్వామివారి చేతి స్పర్శ పొందిన అదృష్టవంతుడు నారాయణరావు..


సర్వం..

శ్రీ దత్త కృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. SPSR నెల్లూరు జిల్లా.. పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).


 *మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..*


*ఆరుబయట దీక్ష..*


కొన్నాళ్ల క్రితం నలుగురు సభ్యులున్న ఒక కుటుంబం  శ్రీ స్వామివారి మందిరం వద్దకు వచ్చింది..చిత్రమైన సమస్యతో బాధపడుతున్నారు వాళ్ళు..భార్యా భర్తా ఇద్దరు కుమారులు..ఆ ఇద్దరు కుమారులు కూడా పదిహేను సంవత్సరాల వయసు పై బడిన వారే..కుటుంబం లో ఉన్న ఇద్దరు పిల్లలకూ మానసిక స్థితి సరిగాలేదు..ఒక గంట ప్రవర్తించినట్లు..మరో గంటలో ప్రవర్తించరు.. ఒక రోజులోనే వాళ్ళ ప్రవర్తన మారిపోతూ ఉంటుంది..ఉన్నట్టుండి బాధ పడుతున్నట్లు మెలికలు తిరిగి పోతారు..మరి కొద్దిసేపటికే మామూలుగా వుంటారు..వీళ్ల ఇద్దరినీ తీసుకొని ఆ తల్లి తండ్రి శ్రీ స్వామివారి మందిరానికి చేరారు..


శ్రీ స్వామివారి మందిరానికి ఉత్తరంగా ఉన్న రావిచెట్టు క్రింద ఉన్న అరుగు మీదే ఉండేవాళ్ళు..రోజూ ఉదయం సాయంత్రం శ్రీ స్వామివారి మందిరం లో ప్రదక్షిణాలు చేయడం మొదలుపెట్టారు..వీళ్ళను నేను గమనిస్తూనే వున్నాను..ఎండగా వున్నా..వర్షం కురుస్తున్నా కూడా ఆ కుటుంబం ఆ అరుగు మీదే వుంటున్నారు తప్ప..తలదాచుకోవడానికి రూము ల్లోకి రావడం లేదు..కొద్దిగా ఆశ్చర్యం గా ఉండేది నాకు..ఆరుబయట..ఏ ఆచ్ఛాదనా లేకుండా..కేవలం రావి చెట్టు నీడలో.. వీళ్ళు ఎలా వుండగలుగుతున్నారా? అని..


ఒకరోజు కుతూహలం ఆపుకోలేక..వీళ్ళ వివరాల కోసం మా సిబ్బందిని అడిగాను..ఈ కుటుంబం..పొన్నలూరు మండలంలోని లింగంగుంట గ్రామం..ఇళ్లు కట్టే మెస్త్రీ పని చేస్తుంటాడు అతను.తనకొచ్చిన ఆదాయం లోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు..ఇద్దరు మొగపిల్లలు..పెద్ద పిల్లవాడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు..రెండవవాడు పదవతరగతి చదువుతున్నారు.. ఉన్నంతలో బాగానే జరిగిపోతున్న సంసారం లో  చిన్న కుమారుడి మానసిక స్థితి లో మార్పు వచ్చింది..పిచ్చి పిచ్చిగా ప్రవర్తించసాగాడు..మరో వారం కల్లా పెద్దకుమారుడూ  అలానే మారిపోయాడు..ఇవన్నీ గ్రహ బాధలనీ..ఇవి తొలగిపోవాలంటే మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామి వారి వద్దకు వెళ్లి కొన్నాళ్ల పాటు శ్రీ స్వామివారి ని కొలుస్తూ వుండమని కొందరు చెప్పారు..ఆ మాట ఈ దంపతుల మనసులో నాటుకుపోయింది..ఒక క్షణం కూడా ఆలస్యం లేకుండా..పిల్లలను తీసుకొని మొగలిచెర్ల లోని శ్రీ స్వామివారి మందిరానికి చేరారు..


ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఉదయం, సాయంత్రం..శ్రీ స్వామివారి సమాధి మందిరానికి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయసాగారు..పది రోజులు గడిచిపోయాయి..పిల్లల ప్రవర్తన లో మార్పు వస్తున్నది.. ముందుగా చిన్న పిల్లవాడు మామూలుగా మారాడు..మరో పదిరోజుల కల్లా పెద్దవాడిి ప్రవర్తన కూడా మారిపోయింది..ఆ తల్లీ తండ్రీ సంతోషానికి అవధులు లేవు..వాళ్ళు శ్రీ స్వామివారి వద్ద నలభై రోజులు ఉంటామని మ్రొక్కుకున్నారు..కానీ ఇరవై రోజుల్లోనే పిల్లలకు స్వస్థత ఏర్పడింది..అంతమాత్రం చేత వాళ్ళు వాళ్ళ ఊరికి వెళ్లిపోలేదు..శ్రీ స్వామివారి మందిరం వద్దే..ఆ చెట్టుకిందే వున్నారు..మందిరం లో చిన్న చిన్న పనులు చేయసాగారు..ఆ భార్యా భర్తా ఇద్దరూ మందిరం వద్ద పనులకు రాసాగారు..క్రమంగా మందిరం వద్దే ఏదో ఒక పని చేసుకుంటూ కాలం గడపసాగారు..నలభై రోజుల పాటు శ్రీ స్వామివారిని కొలుద్దామనుకున్న ఆ కుటుంబం మూడు నెలల పాటు ఉండిపోయింది..పిల్లలిద్దరూ వాళ్ళ ఊరు వెళ్లి తమ తమ పరీక్షలు వ్రాసి వచ్చారు..మంచి మార్కులతోనే పాసయ్యారు..నలభై రోజుల తర్వాత కూడా ఆ కుటుంబం ఆ చెట్టు క్రింద ఉన్న అరుగు వద్ద నుంచి రూము లోకి రాలేదు..అక్కడే వున్నారు..


పిల్లలిద్దరూ పనికిరాకుండా పోతారేమోనని దిగులుపడ్డ ఆ దంపతులకు వాళ్ళు మళ్లీ మామూలు మనుషులవడానికి శ్రీ స్వామివారి ఆశీస్సులే కారణమని ప్రగాఢంగా నమ్మారు..మూడు నెలల తరువాత..వాళ్ళ ఊరికి వెళ్లేముందు..వాళ్ళను అడిగాను.."ఇన్నాళ్లూ ఆ చెట్టు క్రింద ఎలా వుండగలిగారూ?.." అని..


"అయ్యా..మేము అనుకున్నది కాదు..మొదటిరోజు ఇక్కడికి వచ్చినప్పుడు..ఆరోజు రాత్రి నాకు స్వప్నం లో ఒక యోగి కనబడి..మమ్మల్ని ఇక్కడే వుండమని ఆదేశించాడు..అది శ్రీ స్వామివారి ఆదేశం అనుకొని..మేము అక్కడే ఉండిపోయాము..ఎండయినా.. వాన అయినా..అక్కడే వున్నాము..మేము అనుకున్న నలభై రోజుల దీక్ష లో ఇది కూడా ఒక భాగం అనుకున్నాము..చిత్రంగా మాకు ఎటువంటి ఇబ్బందీ కలుగలేదు..ఆ స్వామి మమ్మల్ని కాపాడాడు.." అని చెప్పాడు..


శ్రీ స్వామివారి వద్ద నిరంతరమూ ఉన్నామనీ..అన్ని పనులూ సక్రమంగా చేస్తున్నామనీ..ఒక్కొక్కసారి కొద్దిగా గర్వంగా అనుకుంటాము..ఇటువంటి వారికున్న భక్తిలో ఎంత శాతం మనలో ఉందీ అని మాత్రం అనుకోము.. అందుకే అటువంటి వారిని అన్నివేళలా దైవం అడుగడుగునా కాపాడతాడు..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. SPSR నెల్లూరు జిల్లా.. పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: