27, ఫిబ్రవరి 2025, గురువారం

భాగవతం*

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

         *శ్రీమద్ భాగవతం*

              *(61వ రోజు)*

 *(నిన్నటి భాగం తరువాయి)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

 *భగీరథుడు-గంగావతరణం*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

 *శంకరుని ప్రార్థిస్తూ కఠోర తపస్సు చేశాడు భగీరథుడు. అతని తపస్సును మెచ్చుకున్నాడు శంకరుడు. ప్రత్యక్షమయ్యాడు. భగీరథుని అభీష్టాన్ని నెరవేర్చేందుకు సిద్ధమయ్యాడు.*


*స్వర్గం నుంచి మహావేగంతో దూకుతూ వచ్చింది గంగ. శంకరుని శిరస్సున పడింది. భరించాడు శంకరుడు, తన జటాఝూటాన ధరించాడామెను. నాటి నుంచే శంకరుణ్ణి ‘గంగాధరుడు’ అని వ్యవహరించసాగారంతా.*


*శంకరుని శిరస్సు నుంచి జారి ప్రవహించసాగింది గంగ. రథాన్ని అధిరోహించి భగీరథుడు ముందు పరుగుదీస్తోంటే అతన్ని అనుసరించింది గంగ.* 


*హిమవత్పర్వతం నుంచి మహావాహినిగా భూలోకానికి వచ్చింది. భూలోకానికి వస్తూ వస్తూ జహ్నుముని యజ్ఞవాటికను ముంచి వేసింది గంగ. కోపం వచ్చింది మునికి.*


*గంగను పుక్కిటపట్టాడు. వదలనని పట్టుబట్టాడు. అతన్ని ఎన్నో విధాల ప్రార్థించాడు భగీరథుడు. కరుణించమని కన్నీరు పెట్టుకున్నాడు. అప్పుడు తన చెవిలోనుంచి గంగను వదలిపెట్టాడు జహ్నువు. జహ్నువు చెవి నుండి వెలువడిన కారణంగా గంగకు ‘జాహ్నవి’ అని పేరు వచ్చింది.*


*గంగను రసాతలానికి తీసుకుని వెళ్ళాడు భగీరథుడు. అక్కడ భస్మరాశులుగా పడి ఉన్న పితరులయిన సగరపుత్రుల దగ్గర ఆగాడు. గ్రహించింది గంగ. సగరపుత్రులను స్పృశించింది. అంతే! అరవై వేలమంది సగరపుత్రుల పాపాలన్నీ పటాపంచలయి, వారంతా సద్గతి పొందారు.*


*భగీరథుడు గంగను భూమి మీదకు తీసుకుని వచ్చిన కారణంగా ఆమెను ‘భాగరథి’ అన్నారు. గొప్ప ప్రయత్నం చేసి భగీరథుడు ఇంతటి మహత్కార్యాన్ని సాధించిన కారణంగా ఎవరయినా గొప్ప ప్రయత్నానికి పూనుకుంటే దానిని ‘భగీరథీ ప్రయత్నం’ అంటున్నారు.*


*ఈ వంశంలోనే ఋతుపర్ణుడు జన్మించాడు. అయోధ్య పట్టణాన్ని ఏలిన ప్రముఖుల్లో అతను కూడా ఒకడు. అక్ష హృదయం విద్యలో ఋతుపర్ణుణ్ణి మించిన వారు లేరు. బాహుకుడు అనే పేరుతో నలమహారాజు ఇతని వద్దనే వంటలవాడుగా చేరాడు. నలుని నుంచి అశ్వహృదయం విద్య నేర్చుకుని, తనకు తెలిసిన అక్షహృదయం విద్యను నలునికి నేర్పిన ఘనత కూడా ఋతుపర్ణునిదే!*


*ఇదే సూర్యవంశంలో ఖట్వాంగుడు జన్మించాడు. విష్ణుభక్తునిగా ఉత్తమపదం అందుకున్నాడు. ఖట్వాంగునికి దీర్ఘబాహువు, దీర్ఘబాహువుకి రఘువు జన్మించారు. రఘువుతోనే రఘువంశం ఏర్పడింది. ఈ వంశంలోనే శ్రీరామచంద్రుడు అవతరించాడు. రఘువు కుమారుడు అజమహారాజు. అజమహారాజు పుత్రుడే దశరథుడు. దశరథునికే శ్రీరాముడు జన్మించాడు. శ్రీరాముని కుమారుడే కుశుడు. కుశసంతతి సుమిత్రునితో కలియుగంలో ఇక్ష్వాకువంశం అంతరించిందని వ్యాసుడు పేర్కొన్నాడు.*


*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం )*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

కామెంట్‌లు లేవు: