13, మార్చి 2025, గురువారం

శ్రీమద్ భాగవతం

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

         *శ్రీమద్ భాగవతం*

              *(74వ రోజు)*

   *(క్రితం భాగం తరువాయి)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

       *కృష్ణావతారం*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*భరతవంశం శాఖోపశాఖలయింది. ఈ సంతతివారు అనేక వర్గాలుగా ఏర్పడ్డారు. వేర్వేరు వంశనామాలతో వీరంతా భరతఖండాన్ని పాలించారు.*


*భరత పుత్రుడయిన మన్యువు కుమారులు అయిదుగురిలో గర్గుని సంతతివారు బ్రాహ్మణులయినారు. వారిని ‘గార్గ్యులు’ అన్నారు.*


*అలాగే మహావీర్యునికి పుట్టినవారు కూడా బ్రాహ్మణులయినారు.*


*బృహత్‌క్షత్రునికి సుహోత్రుడు పుట్టాడు. అతని కుమారుడు హస్తి. యమునానదీతీరాన అతను గొప్పనగరాన్ని నిర్మించాడు. అదే హస్తినాపురం. భారతరాజధాని ఢిల్లీ ప్రాంతమే ఒకనాటి హస్తినాపురం. ఈ నగరమే నాడు కౌరవులకూ, పాండవులకూ రాజధాని అయింది.*


*హస్తి సంతతి శాఖోపశాఖలయింది. ఈ సంతతివారే అయిదు విషయాలలో గొప్పవారై పాంచాల రాజులుగా జన్మించారు. ద్రుపదుడు, దృష్టద్యుమ్నుడు, ద్రౌపది తదితరులంతా ఈ వంశానికి చెందినవారే!*


*ముద్గలుని సంతానం బ్రాహ్మణమయమై ‘మౌద్గల్య’ గోత్రికులయ్యారు. ముద్గలుని కుమారుడే దివోదాసుడు. కుమార్తె అహల్య. అహల్య-గౌతములకు శతానందుడు జన్మించాడు. ఈ వంశంలోనే కృపాచార్యుడు, కృపి, అశ్వత్థామ జన్మించారు.*


*అజమీఢుని వంశంలో సంవరుణుడు జన్మించాడు. అతని కుమారుడే కురువు. యజ్ఞం చేసేందుకు ఇతను దున్నిన భూమినే ‘కురుక్షేత్రం’ అన్నారు.*


*జయద్రధుని వంశంలో జరాసంధాదులు జన్మిస్తే, కురుసంతతిలో శంతనుడు, బాహ్లికుడు జన్మించారు.*


*శంతనునికీ-గంగకీ భీష్ముడు జన్మించాడు. శంతనుడికీ-సత్యవతికీ చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు జన్మించారు. చిత్రాంగదుడు చిన్నతనంలోనే మరణించాడు.*


*కాశీరాజు కుమార్తెలు అంబిక, అంబాలికలను విచిత్రవీర్యుడు వివాహమాడాడు. భీష్ముడే వారిని తెచ్చి, విచిత్రవీర్యునికి ఇచ్చి వివాహం జరిపించాడు. ప్రతిజ్ఞకు కట్టుబడి, విచిత్రవీర్యుణ్ణే రాజుని చేశాడతను.*


*రోగపీడితుడై విచిత్రవీర్యుడు, సంతానం లేకుండా మరణించాడు. అప్పుడు సత్యవతి అంగీకారం మేరకు అంబిక, అంబాలికలకు వ్యాసుని కటాక్షంతో ధృతరాష్ట్రుడు, పాండురాజు జన్మించారు. అంబిక దాసికి వ్యాసమహాముని కృపతో విదురుడు జన్మించాడు.*


*శంతనుని వివాహానికి పూర్వం పరాశర మునీంద్రుని కోరిక మేరకు సత్యవతి ఓ కుమారుణ్ణి కన్నది. అతనే కృష్ణద్వైపాయనుడు. వేదాలను విభజించి ‘వ్యాసుడు’ అయినాడతను.*


*గాంధారి-ధృతరాష్ట్రులకు దుర్యోధనాదులు నూరుగురు కుమారులు, ఓ కుమార్తె జన్మించారు. ఆ కుమార్తె పేరే దుశ్శల.*


*తన పత్ని కుంతిని కూడి పాండురాజు సుఖించే యోగం లేకపోయింది. అందుకు ఓ మునిశాపం కారణమయింది. ఫలితంగా యముడు, వాయువు, ఇంద్రుడు కటాక్షంతో వరుసగా ధర్మరాజు, భీముడు, అర్జునులను కుంతి కన్నది. అశ్వినీదేవతల అనుగ్రహంతో పాండురాజు రెండవభార్య మాద్రి నకుల సహదేవుల్ని కన్నది. పంచపాండవులు వీరే!*


*యయాతి కుమారుడు అనుడివంశంలో చాలా మంది జన్మించారు. ఈ వంశానికి చెందినవాడే బలి. అతనికి సంతానం లేదు. అయితే అతని భార్య, దీర్ఘతపుని అనుగ్రహంతో అంగుడు, వంగుడు, కళింగుడు, సింహుడు, పుళిందుడు, ఆంద్రుడు అని ఆరుగురు కుమారులను కన్నది. వారంతా ప్రసిద్ధులై వేరు వేరు దేశాలు పాలించారు. ఆయా దేశాలు వారి పేర్లతోనే ప్రసిద్ధి చెందాయి.*


*ఆంఽద్రుడు పాలించిన దేశమే ‘ఆంధ్రదేశం’ అయింది. ఆయన సంతతి వారే ‘ఆంధ్రులు’ అయినారు.*


*యయాతి జ్యేష్ఠపుత్రుడయిన యదువువంశం ‘యదువంశం’ పేరిట లోకంలో ప్రసిద్ధి చెందింది. శ్రీకృష్ణుడు ఈ వంశంలోనే అవతరించాడు.*


*కృష్ణావతారం:~*


*రామాయణానికి సుందరకాండ, భారతానికి శాంతిపర్వం ఎంత గొప్పవో భాగవతానికి దశమస్కంధం అంత గొప్పది. సాక్షాత్తూ భగవంతుడు అయిన శ్రీకృష్ణుని అవతారకథ యావత్తూ దశమస్కంధంలో అభివర్ణితం కావడమే దీనికి కారణం.*


*భగవంతుని అవతారాలన్నీ ఒక ఎత్తు, శ్రీకృష్ణావతారం ఒక్కటీ ఒక ఎత్తు అంటారు పెద్దలు. దీనికి కారణం ఉంది. భగవంతుడు శ్రీకృష్ణావతారంలో సమగ్రంగా భాసించాడు. మిగిలిన అవతారాల్లో భగవంతుడు అసాధారణంగా కనిపించినప్పటికీ మానవా తీతంగా కనిపించడు. సాధారణ మానవుడిలాగానే భగవంతుడు కష్టసుఖాలు అనుభవించాడు.*


*రామావతారం దీనికి తార్కాణం. అయితే కృష్ణావతారం దీనికి పూర్తి విరుద్ధం. ఈ అవతారంలో కృష్ణుడు పూర్ణపురుషుడు. భగవంతుడు ఇందులో పరిపూర్ణంగా భాసిస్తాడు. నేను భగవంతుణ్ణి! సృష్టి స్థితిలయలకు కారణభూతుణ్ణి నేనే! ఇదంతా నా కల్పితం. మహాయోగులు కూడా నన్ను తెలుసుకోలేరు. నిష్కాములై నన్ను సేవించండి. మీకు ముక్తిని ప్రసాదిస్తాను అన్నది శ్రీకృష్ణుడు ఒక్కడే! తాను భగవంతుణ్ణి అని చెప్పిన అవతారం మరొకటి లేదు. అంతేకాదు, తనని కాదంటే పుట్టగతులు ఉండవు. వాణ్ణి శిక్షించి తీరుతాను. జాగ్రత అని అన్నది కూడా కృష్ణుడే! హెచ్చరించి ఊరుకోలేదు కృష్ణుడు. దానిని ఆచరించి చూపించాడు. కంస, శిశుపాలాదులవధ, కురుక్షేత్ర సంగ్రామంలో అతను నిర్వహించిన పాత్ర ఇందుకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. తన తత్త్వాన్ని గీతోపదేశం ద్వారా లోకానికి చాటిన వాడు కృష్ణుడు. సకల ఉపనిషత్సారం అయిన గీత నాటికీ నేటికీ లోకపూజ్యంగా నిలిచింది. కృష్ణావతారతత్త్వాన్ని పలువురు పలు విధాలుగా వాఖ్యానించారు. సామాన్యదృష్టితోగాక, విశేషదృష్టితో చూస్తేనేగాని కృష్ణావతారతత్త్వాన్ని అవగతం చేసుకోలేమన్నారు. కృష్ణుడు మహామాయగా కనిపిస్తాడు. అంతటి మాయగాడు మరొకడు లేడు. ‘కృష్ణమాయ’ అన్న పదం జగత్ప్రసిద్ధమన్నది అందరికీ తెలిసిందే! ముందు మాయపుట్టి, తర్వాతే కృష్ణుడు పుట్టాడు. అందుకనే అంతా మాయ అంటారు. ఈ మాయ అంతా భగవత్‌ స్వరూపమే! వేలాది గోపికలూ, మీరాబాయిలాంటి భక్తులూ అనేకమంది కృష్ణుని చెలికానిగా, పతిగా, దైవంగా కొలిచి ముక్తిపొందారు. పురుషులను సైతం మోహింపజేసే జగన్మోహనాకారం కృష్ణునిది.*


*కృష్ణుడెంతటి భోగో అంతటి యోగి. ఆ మహానుభావుడు ద్వాపర, కలియుగ సంధికాలంలో యదువంశంలో అవతరించాడు. భగవంతుని కథా, అతని లీలలని సమగ్రంగా చెప్పడమే భాగవత రచనకు మూలం కనుక కృష్ణావతారం కథను భాగవతం దశమస్కంధంలో వ్యాసుడు నిక్షిప్తం చేశాడు. ఈ కథ చదివితేనే భాగవత పఠనానికి ఫలసిద్ధి.*


*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం )*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

కామెంట్‌లు లేవు: