13, మార్చి 2025, గురువారం

🙏 శ్రీ నిత్య కళ్యాణ పెరుమాళ్ ఆలయం -

 🕉  108 శ్రీవైష్ణవ దివ్యదేశాలు ::

 

       92వ దివ్యదేశము  🕉


🙏 శ్రీ నిత్య కళ్యాణ పెరుమాళ్ ఆలయం - 

తిరువేదంతై, 

మహాబలిపురం 🙏


⚜ ప్రధాన దైవం: నిత్యకల్యాణ, శ్రీ లక్ష్మీ వరాహస్వామి పెరుమాళ్

⚜ ప్రధాన దేవత: కోమలవల్లి నచ్చియార్

⚜ పుష్కరిణి: కళ్యాణ తీర్థం

⚜ విమానం: కళ్యాణ విమానం

⚜ ప్రత్యక్షం: మార్కండేయ మహర్షి


🔔 స్థలపురాణం 🔔


💠 శంభుద్వీపము అను ప్రదేశమున సరస్వతీనది తటమున " కుని " అను మునీశ్వరుడు తన శిష్యులతో నివసించు చుండెను . ఒక ముసలి స్త్రీ ఆ మునికి అవసరమైన పనులు , సహాయము చేయుచుండెను . కొంతకాలమున ఆమె కూడ పరిపక్వత నొంది తపస్సు చేయుట ప్రారంభించెను . ఆ సమయమున ఆమె వద్దకు నారదమహర్షి వచ్చి వివాహస్త్రీలు తపస్సు చేసిననే అది ఆమోదయోగ్యము అగును , మరియు మోక్షమును పొందుదురు అని చెప్పగా ఆమె ముని వద్దకు పోయి , ఎవరైన తనను వివాహమాడుదురా అని అడిగెను . 

అంతట " కలవ ముని " తన సమ్మతిని తెలియజేసి వివాహము చేసుకొని ఒక సంవత్సరములో ఆమె యందు 360 స్త్రీ శిశువులకు జన్మనిచ్చెను . ఆ బిడ్డలకు వయస్సు రాగా యోగ్యులగు వరులకిచ్చి వివాహము చేయు విషయమై చింతించుచూ , ఈ స్థలమునకు వచ్చి ఆదివరాహమూర్తి రూపమును ధ్యానములో నుంచుకొని శ్రీ మహావిష్ణువును పూజించెను .


💠 ఒక దినమున శ్రీ మహావిష్ణువు బ్రహ్మచారిగా వచ్చి 360 కన్యలను వివాహము చేసికొందునని కలవమునికి చెప్పి రోజుకి ఒక కన్య చొప్పున 360 రోజులలో వివాహమాడెను . 

అందువలన శ్రీమన్నారాయణుడు ఇచ్చట “ నిత్య కళ్యాణ పెరుమాళ్ " గా వెలసెను . 

ఆ కారణమున ఈ స్థలమునకు " నిత్య కళ్యాణపురి " అనియు , మరియు 360 కన్యలలో ఒక కన్యగా శ్రీ మహాలక్ష్మి " పెరియపిరట్టియార్ " గా అవతరించి నందున " శ్రీపురి " అనియు పేర్లు కలవు . ఇంకనూ శ్రీ మహావిష్ణువు వరాహ అవతారమూర్తిగా కూడ వెలసినందున " వరాహపురి " అను పేరుకూడ కలదు . 


💠360 మందిని వివాహమాడిన పిమ్మట వారెల్లరిని ఒక్కరిగ మార్చెను కావున అమ్మవారికి "అఖిలవల్లి " అను పేరు వచ్చెను. 

అమ్మవారిని తన ఎడమ తొడపై కూర్చుండబెట్టికొనెను. కావున ఈ ప్రెదేశమునకు తిరువిడందై అను పేరు ఏర్పడెను.


💠నిత్య కళ్యాణ మూర్తి కావున స్వామి గడ్డమున ఒక పెద్ద బొట్టు తెలుపు రంగులో ఉండును . 

360 కన్యలలో మొదటిది కోమలవల్లి . కోమలవల్లి తాయారు సన్నిధి వేరుగా నున్నది . 

అఖిలవల్లి తాయారు స్వామి వామ భుజమువైపు , భూమిదేవి కూడ ప్రక్కనే ఉండి దర్శనమిత్తురు . 

 

💠 ఇది వరాహ క్షేత్రము. వివాహార్థులు ఇచట స్వామి వారిని కొలిచెనేని వివాహములు శిఘ్రముగ కుదురునని ఆస్తికుల నమ్మిక.


💠వివాహం చేసుకోవాలని చూస్తున్న భక్తులు పాటించాల్సిన ఆచారం:


💠అబ్బాయి అయినా, అమ్మాయి అయినా వారు అర్చన పదార్థాలతో పాటు రెండు దండలు తీసుకోవాలి. పెరుమాళ్ మరియు తాయార్‌కు పూలమాల వేసిన తరువాత, పూజారి దండలలో ఒకదాన్ని తిరిగి ఇస్తాడు. వివాహం చేసుకోవాలనుకుంటున్న అబ్బాయి లేదా అమ్మాయి దండ ధరించాలి మరియు వారి నిజాయితీ ప్రార్థనలు చేసిన తర్వాత తొమ్మిది సార్లు ప్రదక్షిణలు (ఆలయం లోపలి సమ్మేళనం) చేసి  రావాలి. వివాహం స్థిరపడే వరకు వారు తమ ఇంటిలో దండను భద్రపరచాలి. 

వివాహం పూర్తయిన తర్వాత, వివాహిత జంట మళ్లీ దేవాలయాన్ని సందర్శించి, ఆలయ లో ఉన్న 'చెట్టుపై పూలమాల వేయాలి.


🙏 జై శ్రీమన్నారాయణ 🙏

కామెంట్‌లు లేవు: