1, జులై 2020, బుధవారం

అన్నదానం


అన్నం పరబ్రహ్మ స్వరూపం...ఏది లోపించినా బ్రతకగలం. కానీ ఆహారం లోపిస్తే బ్రతకలేం. దానాలన్నింటిలోకి అన్నదానం మిన్న అని చెప్తారు. ఎందుకంటే ఏది దానంగా ఇచ్చినా... ఎంత ఇచ్చినా కూడా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. కాని అన్నదానంలో మాత్రం దానం తీసుకున్నవారు ఇంక చాలు అని చెప్పి సంతృప్తిగా లేస్తారు. ఏ దానం ఇచ్చినా దానం తీసుకున్నవారిని మనం సంతృప్తిపరచలేకపోవచ్చు కాని అన్నదానం చేస్తే మాత్రం దానం తీసుకున్నవారిని పూర్తిగా సంతృప్తిపరచవచ్చు. అన్నదానాన్ని ఒక యజ్ఞంలా భావించి చేసేవారిని కూడా చూడవచ్చు. అన్నదానం చేయలేకయినా అన్నం పెట్టే ఇంటినన్నా చూపించమని పెద్దలు చెప్తారు. ఆకలితో ఉన్నవాడికి పట్టెడంత అన్నం పెడితే వచ్చే పుణ్యం ఎన్ని యజ్ఞాలు చేసినారాదని పూర్వీకులు చెప్పేవారు.

మనలో చాలా మందికి ” అన్నము” అంటే తెలియదు . బియ్యాన్ని ఉడికించి చేసిన పదార్ధాన్నే అన్నము అంటారని అనుకుంటూ ఉంటారు కానీ నిజానికి ప్రతి మనిషికి పంచ కోశములు అని అయిదు కోశములు ఉంటాయి. అవి అన్నమయ , ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములు . అన్నమయ కోశము స్థూల శరీరానికి సంబంధించినది. ఈ అన్నమయ కోశములో ప్రవేశించే అన్నము ప్రాణశక్తిగా మారుతున్నది.కనుక అన్నమయ కోశములోనికి వెళ్ళే ఆహారమే అన్నము అని అర్ధం. మనము ఏది తిన్నా అది అన్నమే అవుతుంది కేవలం బియ్యం ఉడికించినది మాత్రమే కాదు. అన్నమే అన్నకోశములో ప్రవేశించి ప్రాణంగా మారుతున్నందువలన అన్నదానం అంటే ప్రాణాన్ని దానం చేయడమే . అంతే కాదు ఒక ప్రాణం నిలవడానికి కావలసినది అన్నమే. కనుక అన్నదానం చేయడం శ్రేష్టం అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఏదైనా దానం చేసేప్పుడు విచక్షణ అవసరం కానీ అన్నదానానికి మాత్రం ఈ నియమం లేదు. అన్నదానం చేయడం అంటే వాళ్ళ ప్రాణాన్ని నిలపడమే కనుక అత్యంత శ్రేష్టం అయినది అన్నదానం.

దీనికి సంబంధించి ఒక కథనాన్ని కూడా చెప్తారు. మహాభారత యుద్ధంలో కర్ణుడు మరణించిన తరువాత స్వర్గానికి వెళ్ళాడు. అక్కడ కర్ణునికి అన్ని సౌకర్యాలు లభించాయి. స్వాగత సత్కారాలు లభించాయి. ఏది కావాలంటే అది పొందే అవకాశం ఉంది. అన్నీ అందుబాట్లో ఉన్నాయి. ఏం లాభం...! కర్ణుడికి ఏదో అసంతృప్తి. ఏదో వెలితి. ఎంత తిన్నా కడుపు నిండినట్టుండడంలేదు. సంతృప్తినేది లేదు. ఎందుకు ఈ విధంగా ఉంటుందో అతనికర్థం కావడంలేదు. ఇదే మాట దేవేంద్రుడిని అడిగాడు కర్ణుడు. అప్పుడు దేవేంద్రుడు చిరునవ్వుతో, నీవు అనేక దానాలు చేసావని, అడిగినవాడికి లేదనకుండా ఇచ్చే దానకర్ణుడివని చెప్తారు. మరి.. ఎప్పుడైనా అన్నదానం చేసావా?’’ అనడిగాడు. దానికి సమాధానంగా లేదు.. నేనెన్నో దానాలు చేశాను గాని అన్నదానం మాత్రం చేయలేదు అన్నాడు కర్ణుడు. ‘‘పోనీ అన్నం పెట్టే ఇల్లయినా చూపించావా?’’ అనడిగాడు దేవేంద్రుడు. కాస్త ఆలోచించిన కర్ణుడు చెప్పాడు- ‘‘అవును. ఓ బీద బ్రాహ్మణుడు నా దగ్గరకు వచ్చి అన్నం పెట్టించమని అడిగాడు. అపుడు నేను ఏదో ధ్యాసలో ఉండి, నాకు అవకాశం లేదు గానీ... అక్కడ ఆ ఇంటికి వెళ్ళు అని ఒక ఇంటిని చూపించాను’’ అని. నీవుఅన్నదానం చేసిన ఇంటిని చూపించిన వేలిను నోట్లో పెట్టుకో’’ అన్నాడు ఇంద్రుడు. సరేనని ఆ వేలిని నోట్లో పెట్టుకున్నాడు కర్ణుడు. ఒక్క గుటక వేసాడు. ఆ క్షణంలోనే అతని కడుపు నిండిపోయింది. అంతవరకున్న అసంతృప్తి మటుమాయమైంది. ఎనలేని తృప్తి కలిగింది. ఈ కథనం ద్వారా అన్నదానం యొక్క మహత్మ్యం, దాని ప్రాశస్త్యం తెలుస్తోంది.

నిత్య జీవితంలో మనం ఎదుర్కొనే అనేక ఇబ్బందులనుండి, ఇక్కట్ల నుండి బయటపడడానికి చక్కటి పరిష్కారంగా పనిచేస్తుంది అన్నదానం అని చెప్తారు పండితులు. అన్నదానం వలన ఎన్ని సమస్యలున్నా పరిష్కారమవుతాయని చెప్తారు. ఓ వ్యక్తి ఉపవాసం ఉండి పరమేశ్వరునికి పెట్టే నైవేద్యాన్ని... పరమేశ్వరుడు తాను మాత్రమే స్వీకరించకుండా తాను సృష్టించిన 84 లక్షల జీవరాశులకు పంచిపెడతాడని పురాణాలు చెప్తున్నాయి. అన్నదానం చేసేటప్పుడు దైవభక్తులకు తాంబూలంతో పాటు దక్షిణ ఉంచి దానం ఇస్తే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చని ప్రతీతి. కొందరు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఎంత ప్రయత్నించినా సరైన రాబడి లేకపోవడం, దానికితోడు విపరీతమైన ఖర్చులతో సతమతమవడం జరుగుతుంది. అలాంటివారు అన్నంతో లడ్డు పెట్టి, తాంబూల సహితంగా దానం ఇస్తే అధిక ఆదాయం పొందడంతో పాటు శ్రీమంతులయే అవకాశం ఉందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇక అనారోగ్యంతో బాధపడుతున్నవారు, దీర్ఘ రోగాలతో సతమతమవుతున్నవారు అన్ని రోగాలు తొలగి సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు. కొన్నిసార్లు ఇంటిపై మాంత్రిక దోషాలు కూడా కలుగుతుంటాయి. అటువంటప్పుడు చిత్రాన్నంతోపాటు వడ దానం చేస్తే గృహంపై జరిగే ఏ విధమైన మంత్ర, తంత్ర సంబంధమైన దోషాలైనా తొలగిపోతాయి. బెల్లం అన్నం దానం చేస్తే శ్రీమంతులవుతారు. భోజనం చేసేముందు మొదటి ముద్దను పరమేశ్వరార్పణం చేసి దానిని కాకులకో, ఇతర పక్షులతో ప్రాణులకో పెడతారు. ఇలా చేయడంవలన భగవంతునికి సమర్పించినట్లు అవుతుంది. ఇక అన్నం తినేముందు కొద్దిగా అన్నాన్ని కాకులకు వేయడం వలన శని దోషాలనుంచి బయటపడవచ్చని కూడా చెప్తారు.ఆకలి అన్నవారికి అన్నం పెట్టడం, దాహం అన్నవారికి నీళ్ళివ్వడం ప్రతి మనిషి చేయాల్సిన కనీస ధర్మం. అన్ని దానాలకన్నా అన్నదానం గొప్పది. వేయి ఏనుగులు, కోటి ఆవులు, లెక్కకు మిక్కిలి బంగారం, వెండి, భూములు, జీవితం మొత్తం ఓ వంశానికి సేవ చేయడం, కోటి మంది మహిళలకు వివాహం చేసినా అన్నదానానికి సాటిరావు.

'అన్నం' గురించి నలుగురు మంచి మనుషులు చెప్పిన నాలుగు గొప్ప మాటలు...

1. " నేను వంటింట్లోకి వేరే పనిమీదవెళ్ళినా కూడా , వంట చేస్తున్న మా అమ్మగారు. " పెట్టేస్తా నాన్నా ఒక్క అయిదు నిముషాలు " అనేవారు నొచ్చుకుంటూ- నేను అన్నం కోసం వచ్చాననుకుని ! ఎంతయినా అమ్మ అంటే అన్నం. అన్నం అంటే అమ్మ ! అంతే ! - జంధ్యాలగారు

2. మంచి భోజనం లేని పెళ్ళికి వెళ్ళటం - సంతాపసభకి వెళ్ళినదానితో సమానం ! - విశ్వనాధ సత్యనారాయణ గారు

3. రాళ్లు తిని అరిగించుకోగల వయసులో వున్నప్పుడు తినటానికి మరమరాలు కూడా దొరకలేదు ! వజ్రాలూ , వైడూర్యాలూ పోగేసుకున్న ఈ వయసులో మరమరాలు కూడా అరగట్లేదు ! అదే విధి ! - రేలంగి వెంకట్రామయ్య గారు

4. ఆరురోజుల పస్తులవాడి ఆకలి కన్నా, మూడురోజుల పస్తులవాడి ఆకలి మరీ ప్రమాదం ! ఆహారం దొరికినప్పుడు ముందు వాడ్నే తిననివ్వాలి ! - ముళ్ళపూడి వెంకటరమణ గారు

5. ఏటా వందబస్తాల బియ్యం మాకు ఇంటికి వచ్చినా మా తండ్రిగారు " అన్నీ మనవికావు నాయనా " అని బీదసాదలకి చేటలతో పంచేసేవారు. అన్నీ మనవికావు అనటంలో వున్న వేదార్ధం నాకు పెద్దయితేనేగానీ అర్ధం కాలేదు ! - ఆత్రేయ గారు

6. అమ్మ చేతి అన్నం తింటున్నాను అని చెప్పగలిగినవాడు ధన్యుడు ! - చాగంటి కోటే శ్వర రావుగారు

7. ఆకలితో వున్న వాని మాటలకు ఆగ్రహించవద్దు ! - గౌతమ బుద్దుడు

8. ఆత్మీయులతో కలసి తినే భోజనానికి రుచి ఎక్కువ ! చారుకూడా అమృతంలా రుచిస్తుంది ! - మాతా అమృతానందమయి

9. vమీ పిల్లలు ఎంతదూరంలో, ఎక్కడవున్నా , వేళపట్టున ఇంత అన్నం తినగలుగుతున్నారంటే అది వాళ్ళ గొప్పాకాదూ , మీ గొప్పాకాదు మీ పూర్వీకుల పుణ్యఫలమే అని గుర్తించు. "అన్ని దానము లలో అన్నదానము మిన్న "

కామెంట్‌లు లేవు: