-10- చంపకమాల :
గురుతరలీలఁ బీఠపురి కుక్కుటలింగమహాప్రభుండవై
బరగెడు నిన్ను నేనిపుడు భక్తి
దలిర్పఁగ నాశ్రయింతు నీ
వరకరుణానిరీక్షణము వాలెము
నాపయి నిల్పి ప్రోవవే
చిరవిభవా ! భవా ! విజితచిత్తభవా ! యభవా ! మహాభవా🙏
టీకా :
గురుతర = ఘనమైన , లీలఁ = వైభవముతో , (బీ)పీఠపురి = (ప్రస్తుత ..)పిఠాపురమున ,
కుక్కుటలింగమహాప్రభుండవై = కుక్కుటలింగమహేశ్వరుడు అను
పేరున , (బ)పరగెడు = ప్రసిద్ధి గాంచిన , నిన్ను , నేనిపుడు , భక్తి ,
(ద)తలిర్పఁగన్ = చిగురింపగా ,
+ ఆశ్రయింతు(..ను) , నీ ,
వర = దివ్యమైన , కరుణా , నిరీక్షణము = దృష్టి ని , వాలెము = వాలాయము యొక్క రూపాంతరము = సర్వకాలము ,
నాపయి నిల్పి , ప్రోవవే = ప్రోవుము తండ్రీ ..
శివా ! ..
[ ఈ మకుటార్థము
ప్రతి పద్యమునకును అన్వయము ..
చిరవిభవా ! = శాశ్వతమైన విభవము గలవాడా ! , భవా ! = శివా !
< విజిత = జయించబడిన ,
చిత్తభవా ! = మన్మథుని గలవాడా > =
మన్మథుని జయించినవాడా ! (య)అభవా ! = (జనన మరణ
చక్రబంధ క్రమమున ..) జన్మ లేనివాడా !
మహాభవా ! = ౘచ్చి , పుట్టునటువంటిది కాని గొప్ప పుట్టుక కలవాడా = శాశ్వతుడా..]🙏
భావము : !
చిరవిభవా ! భవా !
విజితచిత్తభవా ! యభవా ! మహాభవా !
ఘనమైన వైభవముతో (ప్రస్తుత ..)పిఠాపురమున కుక్కుటలింగమహేశ్వరుడు అను పేరున ప్రసిద్ధి గాంచిన నిన్ను నేనిపుడు భక్తి చిగురింపగా ఆశ్రయించెదను ..
నీ దివ్యమైన కరుణాదృష్టిని సర్వకాలము నా పయిన నిల్పి ప్రోవుము తండ్రీ .. శివా ! ..🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి