--- శ్రీమద్రామాయణావతరణము ---
శ్రీహరి నామమ్ము చెలువార బలుకుచు
సర్వ జగమ్మున సంచరించు
ఘన తపః స్వాధ్యాయి కమనీయ సంయమి
వాగ్విదాంవర సురవంద్యుడైన
నారదు ప్రశ్నించె నతమస్తకుండౌచు
విమలుడౌ వాల్మీకి వినయముగను
" వీక్షించ నిప్పుడీ విశ్వంబు నందున
సద్గుణుం డెవ్వడు ? సాహ సెవడు ?
ధర్మజ్ఞు డెవ్వడు ? తాత్వికుం డెవ్వడు
దృఢమతి యెవ్వండు ? ధీరు డెవడు ?
సతత కృతజ్ఞత సాత్వికుం డెవ్వడు ?
సచ్చరిత్రు డెవడు ? సాధు వెవడు ?
సర్వభూతహితుడు సద్వర్తనుండును
నిశ్చయాత్ము డెవడు? నియతు డెవడు ?
భీకరాహవశాలి ప్రియదర్శనుండును
విజితాత్ము డెవ్వడు ? విమలు డెవడు ?
యలిగిన నెవ్వాని యాహవమ్మందున
యతిభీతి నొందెదరమరులైన
ఆట్టి వానిని నెరుగంగ నంతరమున
నమితమైనట్టి కౌతుక మగుచు నుండె
వాని నామమ్ము దెలుపగ వసుధ యందు
నెవరు లేరింక మునివరా ! నీవు దక్క. 01
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి