*నోటికి నియంత్రణ..*
"చూడని గుడి లేదు..మొక్కని దేవుడు లేడు..మాకు తెలిసిన క్షేత్రాలన్నీ తిరిగాము..ఇతరులు చెప్పిన తీర్ధాలూ క్షేత్రాలూ కూడా చూసి, మొక్కుకొని వచ్చామండీ..గత రెండేళ్లుగా అబ్బాయికి ఎప్పుడు సెలవు దొరికితే అప్పుడు ఏదో ఒక గుడికి వెళుతూనే ఉన్నాము..ఇదిగో..ఇక్కడికి కూడా..మా దూరపుబంధువు చెపితే..చూసి పోదామని వచ్చాము..ఉన్నది ఒక్కగానొక్క కొడుకు..మా వారు కూడా కాలం చేసి ఐదేళ్లు అయింది..నాకు వాడూ, వాడికి నేనూ తోడుగా వుంటున్నాము..పిల్లవాడు చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నాడు..మంచి జీతం వస్తున్నది..కానీ ఏం లాభం?..ఇప్పుడు వాడికి ముప్పై మూడేళ్ల వయసు..ఇంకా వివాహం కాలేదు..వాడికి పెళ్లై..పిల్లలతో హాయిగా సంసారం చేసుకుంటుంటే చూసి కన్నుమూద్దామని అనుకుంటున్నాను..ఏ దేవుడూ కరుణించలేదు..ఇప్పటికీ వివాహం కాకపోతే..ఇక బ్రహ్మచారిగా ఉండిపోవాల్సిందే నని ఒకటే బెంగగా ఉంది.." అంటూ ఆ ల్వచ్చిన పార్వతమ్మ గారు వాపోతున్నారు..
ఆవిడ అలా బాధపడటం లో తప్పులేదు..తన కుమారుడు త్వరగా పెళ్లిచేసుకొని, జీవితం లో స్థిరపడాలని కోరుకోవడం తల్లిగా ఆవిడ బాధ్యత..అబ్బాయి ఉద్యోగం లో చేరి సుమారు తొమ్మిదేళ్లు అవుతోంది..మొదట్లో సంబంధాలు వచ్చాయి..అమ్మాయి రంగు తక్కువనీ..లేదా..జాతకం సరిపోలేదనీ..అదీ కాకుంటే..తమ కుమారుడి కంటే అమ్మాయి ఎక్కువ చదువుకున్నదనీ..రకరకాల కారణాల తో చాలా సంబంధాలు పార్వతమ్మ గారు తిరస్కరించారు..పార్వతమ్మ గారి భర్త గారు ఉన్నంతవరకూ కొద్దో గొప్పో వచ్చిన పెళ్లి సంబంధాలు..ఆయన మరణించిన తరువాత..రాలేదు..పార్వతమ్మ గారి ప్రవర్తన కూడా కొంత కారణం కావొచ్చు..మెల్లిగా భర్త వైపు బంధువుల రాకపోకలూ తగ్గాయి..
"అంకుల్..ఇప్పుడు మేము ఏం చేయాలి? ఇక్కడి పూజలూ వాటి విధానాలూ మాకు తెలియవు..మీరు చెప్పండి.." అని పార్వతమ్మ గారి అబ్బాయి అడిగాడు.."ఈరోజు శనివారం..మరికొద్దిసేపట్లో పల్లకీసేవ మొదలవుతుంది..నువ్వు అందులో పాల్గొను..వీలైతే పల్లకీ కనీసం ఒక ప్రదక్షిణ చేసేవరకూ మోయి..రేపుదయం స్వామివారి సమాధి దర్శనాన్ని మీ తల్లీకొడుకులు చేసుకోండి..నీ కోరికను, స్వామివారి సమాధి వద్ద చెప్పుకో..స్థూలంగా ఇదీ విషయం.." అని చెప్పాను..సరే అన్నాడు..
పల్లకీసేవ లో పాల్గొన్నాడు..పల్లకీని ఒకటి రెండు ప్రదక్షిణాలు అయ్యేదాకా మోసాడు..పార్వతమ్మ గారు కూడా పల్లకీ తోపాటు మందిరం చుట్టూరా మూడు సార్లు తిరిగారు..తమ రూముకు వెళ్లిపోయారు..తెల్లవారి ఆదివారం నాడు ఉదయాన్నే ఆ తల్లీ కొడుకులు గుడిలోకి వచ్చారు..శ్రీ స్వామివారి సమాధికి అర్చక స్వాముల చే జరుగుతున్న అభిషేకము, విశేష హారతులూ చూసారు..ఆ తరువాత..ఇద్దరూ స్వామివారి సమాధి దర్శనం చేసుకున్నారు..
"మేము వెళ్ళొస్తామండీ..ఆ నాయన సమాధి వద్ద వీడి వివాహం గురించి మొక్కుకున్నాను..మా ప్రాప్తం ఎలా వుందో..?స్వామి దయవల్ల వీడికి త్వరలో పెళ్లి కుదిరితే..ఇక్కడే వివాహం జరిపిస్తానని మొక్కుకున్నాను..అదికూడా ఆదివారం నాడే వివాహం చేస్తాను.. ఇంతకు ముందు లాగా నేను కూడా చిన్న చిన్న విషయాల్లో పట్టు బట్టను..ఎందుకనో ఇన్నాళ్లూ నా తప్పుకూడా ఉందని అనిపించింది..లేనిపోని పట్టింపులకు పోయాను..స్వామివారే అలా నాలో మార్పు తెచ్చారేమో..వచ్చిన భక్తులందరికీ భోజనం పెడతాను..అనికూడా మొక్కుకున్నాను..ఇక అంతా ఆ స్వామి దయ.." అని చెప్పి, స్వామివారి విభూతి గంధం తీసుకొని తమ ఊరు వెళ్లిపోయారు..ఇలాటి కోరికలతో చాలామంది వస్తుంటారు కనుక.. నేనూ, మా సిబ్బందీ..ఈ తల్లీకొడుకుల విషయం త్వరగా మర్చిపోయాము..
నాలుగు నెలలు గడిచిపోయాయి..ఆరోజు బుధవారం..ఉదయం పది గంటల వేళ..పార్వతమ్మ గారు, ఆమె కుమారుడు ఇద్దరూ కారు లో వచ్చారు..స్వామివారి మందిరం లో ఉన్న నా దగ్గరకు నేరుగా వచ్చి, "అంకుల్..వచ్చే ఆదివారమే నా పెళ్లి..ఉదయం తొమ్మిది గంటలకు..ఇక్కడే చేసుకుందామని నిర్ణయించుకున్నాము..ఈ సంబంధం కుదిరింది కూడా మొన్న సోమవారమే..స్వామివారి కృప మా మీద ఉన్నది..ఇక్కడినుంచి వెళ్లిన తరువాత నాకు మొత్తం మూడు సంబంధాలు వచ్చాయి..అందులో ఇప్పుడు చేసుకోబోయే అమ్మాయి వాళ్ళది కుదిరింది..అంతా స్వామి దయ..అందుకే వాళ్లకు చెప్పుకొని..ఒప్పించి..వివాహం ఇక్కడే జరుపుకునేటట్లు నిర్ణయించుకున్నాము.." అన్నాడు..ఆ ఇద్దరి ముఖాల్లో ఆనందం తాండవిస్తోంది.."ఇంతకుముందు లాగా నేను ఏ విషయం లోనూ జోక్యం చేసుకోలేదు..అంతా మా మరిది గారు, తోడికోడలు మాట్లాడారు..స్వామివారు ముందు నా నోటికి తాళం వేసి, ఆపై మా అబ్బాయికి పెళ్లి కుదిర్చాడు బాబూ.." అని నిండుగా నవ్వారు పార్వతమ్మగారు..
ఆ మరుసటి ఆదివారం ఆ అబ్బాయి వివాహం శ్రీ స్వామివారి సమక్షంలో జరిగిపోయింది..అనుకున్న విధంగా ఆరోజు భక్తులకు భోజనం పార్వతమ్మ గారే ఏర్పాటు చేశారు..
ముందుగా తల్లిని నియంత్రించి..ఆపై కొడుక్కి వివాహం చేశారు స్వామివారు..
సర్వం..
శ్రీ దత్తకృప!
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి