2, జనవరి 2021, శనివారం

శ్రీమద్రామాయణావతరణము

          ---  శ్రీమద్రామాయణావతరణము --- 


శ్రీహరి నామమ్ము చెలువార బలుకుచు

          సర్వ జగమ్మున సంచరించు

ఘన తపః స్వాధ్యాయి  కమనీయ సంయమి

           వాగ్విదాంవర సురవంద్యుడైన

నారదు ప్రశ్నించె  నతమస్తకుండౌచు

           విమలుడౌ వాల్మీకి వినయముగను

" వీక్షించ నిప్పుడీ విశ్వంబు నందున

          సద్గుణుం  డెవ్వడు ?  సాహ సెవడు ?

ధర్మజ్ఞు డెవ్వడు ?  తాత్వికుం డెవ్వడు

           దృఢమతి యెవ్వండు ? ధీరు డెవడు ?

సతత కృతజ్ఞత సాత్వికుం డెవ్వడు ?

          సచ్చరిత్రు డెవడు  ? సాధు వెవడు  ?

సర్వభూతహితుడు సద్వర్తనుండును

          నిశ్చయాత్ము డెవడు? నియతు డెవడు ?

భీకరాహవశాలి  ప్రియదర్శనుండును

          విజితాత్ము డెవ్వడు ? విమలు డెవడు ?

యలిగిన నెవ్వాని యాహవమ్మందున

          యతిభీతి నొందెదరమరులైన

ఆట్టి వానిని నెరుగంగ  నంతరమున

నమితమైనట్టి కౌతుక మగుచు నుండె

వాని నామమ్ము  దెలుపగ వసుధ యందు

నెవరు లేరింక మునివరా !  నీవు దక్క.           01 


భవ్యుడౌ వాల్మీకి ప్రార్థించనారీతి

           నారదుం డిట్లనె  నయము గాను

" నీవు జెప్పిన యట్టి  నిఖిల సద్గుణములు

         దొరకుట నొకనిలో దుర్లభమ్ము

యైననూ యోచించి  యమ్మహా పూరుషు

          స్మృతి యందు నెఱిఁగియు  చెప్పె దిపుడు

అట్టి యా సుగుణము లరయంగ  నిప్పుడు

           నొకని యందే నుండె  నుర్వి యందు

వైభవ యిక్ష్వాకు వంశమ్ము నందున

           ప్రభవించె నాతడు  ప్రముఖునిగను

" రాముడు "  యనియెడి  రాపట్టి  యాతడు

          యవనిపై బుట్టిన  యనఘు డతడు

అవని రఘువంశ మందున నవతరించి

పుడమి నున్నట్టి దశరథ పుత్రు డతడు

పడతి కౌసల్య వరముల పంట యతడు

పుడమి  వెల్గొందు పరిపూర్ణ పురుషు డతడు    02 


వీరుండు ధీరుండు విజితేంద్రియుండును

        దివ్యతేజోమయదేహు డతడు

ఆజానుబాహుండు యరవిందనేత్రుండు

          సువిశాల గాత్రుండు  సుందరుండు     

సమ విభక్తాగుండు  సత్ఫాల యుక్తుండు

            కమనీయ గాత్రుండు కంబు గ్రీవి

వేదాంగవేద్యుండు విజ్ఞాననిలయుండు

          గాంభీర్యమందున కడలిసముడు

సౌమ్యవచోనిత్య సత్యసంధుండును

        సదమలహృదయుండు  మృదులభాషి

సర్వ లోక హితుడు  సాత్విక హృదయుండు

         కరుణాంత రంగుండు  ధర నుతుండు

అట్టి రఘువంశ  శ్రీరాము డవని నేడు

ధార్మికోన్నత సోదరత్రయము తోడ

నాల్గుపాదాల ధర్మము నడచుచుండ

పాలనము సేయుచుండెను భవ్యముగను       03



✍️గోపాలుని మధుసూదన రావు🙏

కామెంట్‌లు లేవు: