*విష్ణు సహస్ర నామం..*
దాదాపు తొమ్మిది పది సంవత్సరాల క్రితం.."మేము చాలా దూరం నుంచీ వస్తున్నామండీ..మిట్టపాలెం నారాయణస్వామి వారి ఆలయం, భైరవకోన, సిద్దేశ్వరీ ఆలయం అన్నీ చూసుకొని ఇక్కడకు వచ్చాము..మాకు ఈరాత్రికి ఇక్కడ ఉండటానికి బస ఏదైనా ఉన్నదా?..మేము మొత్తం ఇరవై మంది దాకా ఉన్నాము.." అని ఒక శనివారం సాయంత్రం నాలుగు గంటల వేళ ఆ వచ్చిన వాళ్ళు అడిగారు..మా సిబ్బంది తో మాట్లాడి..ఒక రేకుల షెడ్ (ఆరోజుల్లో ఉన్న వసతి అదే..) వాళ్లకు కేటాయించాము..అందరూ స్నానాలు చేసి మరో గంట కల్లా మందిరం లోపలికి వచ్చేసారు..ఆరోజు జరుగబోయే పల్లకీసేవ గురించి అడిగి తెలుసుకున్నారు..తామూ అందులో పాల్గొంటామని చెప్పారు..అందరి పేర్లూ నమోదు చేసుకున్నారు..
"అయ్యా..ఈరోజు రాత్రికి పల్లకీసేవ తరువాత భజన కార్యక్రమం ఉన్నది కదా..భజన చేసే మాస్టారు తనకు ఆరోగ్యం బాగా లేనందున రాలేకపోతున్నానని ఇప్పుడే కబురు పెట్టాడు..మనం ఈరోజు ప్రత్యేకంగా భజన ఉన్నది అని ముందుగా అందరికీ చెప్పి ఉన్నాము..ఇప్పుడేమి చేద్దాం?" అని మా సిబ్బంది వచ్చి తెలిపారు..కొంచెం సేపు ఆలోచించాను..ఏమీ తోచలేదు..ప్రతి శనివారం పల్లకీసేవ తరువాత స్వామివారి మంటపం లో భజన కార్యక్రమం ఉంటుంది..భక్తులు చాలా ఉత్సాహంగా పాల్గొంటారు..ఆ కార్యక్రమ నిర్వహణ కొఱకు భజన పాటలు పాడే వ్యక్తిని నియమించుకున్నాము..అతనికి వాయిద్య సహకారం అందించే వాళ్ళనూ ఏర్పాటు చేసుకున్నాము..శనివారం రాత్రి 9.30 గంటల నుండి 11.30 వరకూ ఆ భజన పాటలు సామూహికంగా పాడుతారు..అదొక కోలాహలంగా జరిగే కార్యక్రమం..ఆ కార్యక్రమానికి అంతరాయం ఏర్పడుతుందేమో ననే సంశయం మనసులో ఏర్పడింది..
మరో అరగంటకు పల్లకీసేవ ప్రారంభం అవుతుంది అనుకునే సమయం లో ఇరవై మంది ఒకే బృందం గా వచ్చిన వాళ్ళు నేరుగా నా దగ్గరకు వచ్చి.."అయ్యా..పల్లకీసేవ కు ఇంకెంత సమయం ఉన్నది?.." అని అడిగారు.."ఓ అరగంట మాత్రమే ఉన్నది..సరిగ్గా ఏడు గంటలకు మొదలు పెడతాము..ఇప్పుడు ఆరున్నర సమయం.." అని చెప్పాను..కొద్దిగా నిరుత్సాహ పడ్డట్టు గా చూసారు.."ఏమిటి విషయం..?" అన్నాను.."మా వాళ్లలో ఒక ఐదుగురు ఆడవాళ్లు వున్నారు..విష్ణు సహస్రనామం రాగయుక్తం గా ఆలపించాలని అనుకుంటున్నారు..కనీసం యాభై నిమిషాలు సమయం కావాలి..మేము ఇంకొంత ముందుగా మిమ్మల్ని అడిగి వుండ వలసింది..వాళ్ళు ఈ వాతావరణం చూసి..ఇక్కడ విష్ణు సహస్రనామం గానం చేయాలని ఉత్సాహ పడ్డారు.." అన్నారు.."మీరు కొద్దిగా ఓపిక పడితే..పల్లకీసేవ పూర్తి కాగానే..పల్లకీ ఉన్న ప్రదేశం లోనే..ఆ మండపం లోనే..మీ వాళ్ళ చేత విష్ణు సహస్రనామం గానం చేయించే అవకాశం కల్పిస్తాను..ఈరోజు రాత్రి 9.30 కి ఇక్కడ భజన కార్యక్రమం ఉన్నది..భజన పాటలు పాడే మాస్టారు రాలేదు..ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నాము..మీరు సమ్మతిస్తే ఇలా చేద్దాము.." అన్నాను..విష్ణు సహస్రనామం గానం చేస్తామని చెప్పిన ఐదుగురు ఆడవాళ్ళూ సంతోషంగా ఒప్పుకున్నారు..
ఆరోజు రాత్రి 9.30 గంటలకు భక్తులందరూ మండపం లో కూర్చున్న తరువాత..విష్ణు సహస్రనామం రాగయుక్తం గా ఆలపించారు..అద్భుతంగా గానం చేశారు..సుమారు గంట సేపు పట్టింది..అది పూర్తి కాగానే హనుమాన్ చాలీసా గానం చేశారు.."అయ్యా..ఏదో ఒక క్షేత్రం లో మేము ఇలా గానం చేయాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాము..కానీ ఇక్కడ మాకు అవకాశం దొరికింది..మీరు అనుమతి ఇస్తే..మేము ఐదుగురమూ..మరో నాలుగు శనివారాలు ఇదే సమయానికి ఇలాగే వచ్చి గానం చేసి వెళతాము..మొత్తం ఐదు వారాలు ఇక్కడ విష్ణు సహస్రనామం గానం చేద్దామని అనుకున్నాము.." అన్నారు.."తప్పకుండా ఏర్పాటు చేస్తాను..మీరు మరో నాలుగు శనివారాలు రావడం మాత్రం మానుకోవద్దు.." అని చెప్పాను..
ఆ తరువాత నాలుగు శనివారాలు ఆ ఐదుగురు ఆడవాళ్ళూ క్రమం తప్పకుండా వచ్చి స్వామివారి సన్నిధిలో విష్ణు సహస్రనామం, హనుమాన్ చాలీసా గానం చేసి, ప్రక్కరోజు ఉదయం స్వామివారి సమాధి దర్శనం చేసుకొని వెళ్లారు..కనీసం వాళ్ళ రాకపోకలకు అయ్యే వ్యయాన్ని కూడా తీసుకోలేదు.."ఒక్క పైసా కూడా వద్దండీ..మేము స్వామివారికి ఈరకంగా సేవ చేయాలని అనుకున్నాము..చేస్తున్నాము..మా పుణ్యం కొద్దీ మాకు ఈ అవకాశం దొరికింది.." అని చెప్పారు..
భజన మాస్టారు రాకపోవడం..అదే సమయానికి ఈ ఆడవాళ్లు వచ్చి విష్ణు సహస్రనామం గానం చేయడం..ఒకవారం మాత్రమే కాకుండా వరుసగా ఐదు వారాలు అలా కొనసాగడం ..ఏదో కాకతాళీయం గా జరిగే ఘటన కాదు..స్వామివారి సంకల్పం మాత్రమే!!
సర్వం..
శ్రీ దత్తకృప!
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి