18, ఫిబ్రవరి 2021, గురువారం

నన్ను కన్నరోజు

 🕉️ *నన్ను కన్నరోజు (ఓ కథ)*

 

 *సౌదామిని వంట పూర్తి చేసి రెండోసారి కాఫీ చేసి పేపర్ చదువుతున్న భర్త అశోక్ కు ఇచ్చి తానూ తాగుతూ అక్కడే కూర్చోబోయింది.*


 *ఇంతలో లాండ్ లైన్ మ్రోగింది. ఒక చేత్తో కాఫీ కప్పు పట్టుకుని రెండో చేత్తో ఫోన్ రిసీవర్ ఎత్తింది.* 


 “ *హలో అమ్మా!  ఏం చేస్తున్నావ్? నేను చెప్పింది గుర్తుందిగా. తొందరగా పని తెముల్చుకుని ఐదుగంటల వరకు రెడీగా ఉండండి.*  *నేనిచ్చిన కొత్తచీర మాత్రమే కట్టుకోవాలి . బ్లౌజ్ కూడా కుట్టించాకదా. నాన్నగారికి కూడా చెప్పు. నేను కార్ పంపిస్తా..లేట్ చేయొద్దు మరి.“ అని హడావిడిగా చెప్పింది కూతురు భావన..* 


 *“అమ్మలూ... నీ* *పుట్టినరోజు నాడు కూడా ఈ హడావిడి ఎందుకురా? నీ ఆఫీసు ప్రోగ్రాం కాగానే పిల్లలు, అల్లుడు గారితో కలిసి ఇంటికొచ్చేయి. నీకిష్టమైనవి చేసి ఉంచుతా. అందరం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కలిసి తిందాం.. ఎన్ని రోజులైంది మనమంతా కలిసి. నువ్వేమో ఎప్పుడూ బిజీ బిజీ అంటావు”  అనునయంగా చెప్పింది సౌదామిని.* 


 *“అమ్మా! పది రోజుల* *మందునుండి చెప్తున్నా. ఇవాళ మా ఆఫీసు* *వార్షికోత్సవంతోబాటు నాకు అవార్డు ఇస్తున్నారు.  నా పుట్టినరోజు కూడా  అని నిన్నూ, నాన్నగారిని రమ్మని. మళ్లీ ఇప్పుడిలా అంటావేంటి. నా మాటంటే అసలు లెక్కలేదా నీకు. అవునులే.. నిన్ను రమ్మన్నాను చూడు నాదే తెలివితక్కువతనం. ఇంతకీ వస్తున్నావా లేదా. ఆఖరిసారి అడుగుతున్నా!” కోపంగా అరిచింది భావన.* 


 *“వస్తున్నా తల్లీ! అంత నిష్టూరాలెందుకు? నువ్వు ఇచ్చిన చీరనే కట్టుకునే వస్తాను. సరేనా!!  ఐదుగంటలకు కార్ పంపించు“ నవ్వుకుంటూ చెప్పింది.*


*పేపర్ చదువుతూనే ఇటువైపో చెవి వేసిన అశోక్ కూడా గుంభనంగా నవ్వుకున్నాడు..*


*ఫోన్ పెట్టేసి తర్వాత సౌదామిని నిశ్శబ్దంగా కూర్చుంది. ఏమీ మాట్లాడలేదు. అశోక్ అలసిపోయినట్టుంది అని కాస్సేపు చూసాడు. కాని తన ధోరణిలో మార్పు రాలేదు.*


*“ఏంటి సౌదా! ఏమైంది? ఈ మధ్య నువ్వు చాలా డల్ గా ఉంటున్నావు. ఆరోగ్యం బావుంది కదా. ఏధైనా జరిగిందా. నాకు చెప్పొచ్చుగా.. ఇంట్లో ఉన్నదే మనమిద్దరం. నువ్విలా ఉంటే ఎలా?”*


*“అంత సీరియస్ ఏమీ లేదండి. బాధ్యతలేమీ లేవు, పిల్లలు ఎవరి సంసారాల్లో వాళ్లు సంతోషంగా ఉన్నారు. అబ్బాయి కూడా మనకు దగ్గరలో లేడు. వాడి పిల్లలను కూడా చూడలేదు మనం.*


 *అయిదేళ్లయిపోయింది వాడు ఇండియా వచ్చి. రమ్మంటే సెలవులు లేవంటాడు.  అమ్మాయి పిల్లలు కూడా పెద్దవాళ్లయ్యారు. వాళ్లు స్కూళ్లు అంటూ మనకు కనపడడం తగ్గిపోయింది.*


 *వాళ్లను నేనేమీ అనడం లేదు, కాని ఈ ఒంటరితనాన్ని కాదు గాని, ఖాళీ సమయాన్ని భరించలేకపోతున్నాను.*


 *మనిద్దరికి వంట చేయడం, పూజ, పుస్తకాలు తప్ప నాకు వేరే పనేమీ లేదు. మీరన్నా కనీసం స్నేహితులతో క్లబ్బులో కలుస్తుంటారు..” ఉదాసీనంగా అంది సౌదామిని.*


*“అలాంటప్పుడు నువ్వు మళ్లీ ఎందుకు చదువుకోకూడదు. రోజూ కాలేజీకి వెళ్లేపని లేకుండా దూరవిద్యలో చేరు. పెళ్లప్పుడు ఎమ్.ఏ.తో ఆపేసావు కదా. ఇంకా చదువు. మనకు డబ్బులకేమీ కొదువ లేదు. నీకు తీరిక సమయం కూడా చాలా ఉంది.  ఎమ్.ఫిల్. లేదా పిహెచ్.డి చేయొచ్చుగా.. కాలక్షేపం ఉంటుంది. ఈ నిరాశ, నిరాసక్తత కూడా మాయమైపోతుంది.”  అన్నాడు అశోక్.*


*“ఇప్పుడు చదువా? అందరూ నవ్వుతారేమోనండి.. చదువంటే నాకు ఇష్టమే కాని చిన్నపిల్లలతో కలిసి పరీక్షలు రాయడం.. అదీ నావల్ల కాదేమో.. సరేలెండి చూద్దాం. ఏది ఎలా జరగాలనుందో” అంటూ లేచి వంటింట్లోకి వెళ్లి సర్దడం మొదలుపెట్టింది. కాని తన ఆలోచనల్లో మౌనంగా మారిపోయింది.*

*****


*సాయంత్రం సరిగ్గా ఐదుగంటలకు భావన పంపిన కారు వచ్చింది.* *అప్పటికే తయారై ఉన్న సౌదామిని, అశోక్ లు ఇంటికి తాళం వేసి బయలుదేరారు.* 

*వాళ్లు భావన ఆఫీసు ప్రాంగణానికి చేరుకునేసరికి, అక్కడంతా కోలాహలంగా ఉంది. ఉద్యోగులంతా హాలులోకి ప్రవేశిస్తున్నారు.*


 *తల్లిదండ్రులను చూసిన భావన వారికి ఎదురొచ్చి అమాంతంగా తల్లిని కౌగిలించుకుంది.*


 *“అమ్మా! ఈ నెమలిపింఛం రంగు  పట్టుచీర నీకు ఎంత బావుందో... చాలా అందంగా కనిపిస్తున్నావు.*

*కదా నాన్నగారు?” అని అడిగింది.*


*అశోక్ మందహాసం చేసాడు.  సౌదామిని మాత్రం సిగ్గుపడిపోయింది. భావన వాళ్లిద్దరినీ మొదటి వరుసలో కూర్చోబెట్టి మళ్లీ కలుస్తానని స్టేజి వెనుకవైపు వెళ్లిపోయింది.*


*మెల్లిగా హాలు నిండిపోయింది. కంపెనీ 10వ వార్షికోత్సవంతోబాటు, ఇటీవలే ఒక పెద్ద విదేశీ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసినందుకు చాలా ఘనంగా ఏర్పాట్లు చేసారు.*


 *ఈ కార్యక్రమానికి ప్రాజెక్ట్ మానేజర్ భావన కాబట్టి తనకి ఇంకా ఎక్కువ భాధ్యతలు ఉన్నాయి. కంపెనీలోని అన్ని విభాగాలలో పనిచేసే ఉద్యోగులందరూ వచ్చినట్టున్నారు. కోలాహలంగా ఉంది హాలంతా..*


*భావన పిల్లలను అల్లుడు తీసుకుని వస్తాడని వాళ్లకోసం ఎదురు చూడసాగింది  సౌదామిని.* 

*****

*మరోగంటలో ముఖ్య అతిధి రాగానే కార్యక్రమం మొదలైంది. కంపెనీ డైరెక్టర్లు, ముఖ్య అతిధి ప్రసంగాలు ముగిసిన తర్వాత ప్రాజెక్టులో పాల్గొన్నవారందరికీ బహుమతులు ఇచ్చారు.*


 *వాళ్ల నాయకురాలిగా ఎంతో సమర్ధవంతంగా పనిచేసిన భావనను అందరూ ప్రశంసించారు.*


 *అంతేకాకుండా ఈరోజు భావన పుట్టినరోజు కాబట్టి  మరింత ఘనంగా శుభాకాంక్షలు అందిద్దామని కంపెనీ చైర్మన్ ప్రకటించాడు.*


 *సౌదామిని భావన పిల్లలకోసం అటూఇటూ చూస్తూనే భావనకు  వస్తోన్న అభినందనలు చూసి మురిసిపోతోంది.*

*పది నిమిషాల్లో ఒక పెద్ద కేకును స్టేజ్ మధ్యలో టేబుల్ మీద పెట్టారు. స్టేజ్ మొత్తం రంగురంగుల బెలూన్లను కట్టారు. భావనను పిలిచారు. భావన ముందుకొచ్చింది.*


*కాని “ఒక్క నిమిషం“ అంటూ మైక్ దగ్గరకు వెళ్లి “అమ్మా! ఒక్కసారి స్టేజ్ మీదకు రావా? నాన్నగారు కూడా రావాలి. నాకోసం..” అని పిలిచింది. వెంటనే అందరూ చప్పట్లు కొట్టారు.*


*మేమెందుకు అనుకుంటూ సందేహంగానే సౌదామిని, భర్తతో కలిసి స్టేజ్ మీదకు వచ్చింది. భావన తల్లిని కేక్ ముందు నిలబెట్టింది. అటు, ఇటు తను, తండ్రి నిలబడ్డారు. కేక్ మీద రాసింది చదివిన సౌదామిని నివ్వెరపోయింది..  భావనకు బదులు తన పేరు కనఫడింది. అమ్మకు శుభాకాంక్షలు అని..*


 *అయోమయంగా కూతురివైపు చూసింది.*

*భావన చిరునవ్వుతో మైక్ ముందుకు వచ్చి “ ఫ్రెండ్స్! ఇవాళ కంపెనీ విజయోత్సవాలతోబాటుగా నా  పుట్టినరోజు కూడా జరపాలని అనుకోవడం చాలా సంతోషంగా ఉంది. కాని ఇవాళ నా పుట్టినరోజు కాదు” అని ఆగింది..*


 *“అవును.. ఇది నా పుట్టినరోజు కాదు. మా అమ్మ, నన్ను కన్నరోజు. తను అమ్మగా మారినరోజు.  ఈ రోజు నా జన్మకు కారణమైన నా తల్లికి కాక నాకు ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వడమేంటి?*

*అందుకే ఈ రోజును మా అమ్మ నన్ను కన్నరోజుగా జరుపుకోవాలనుకుంటున్నాను. చిన్నప్పుడు ప్రతీ సంవత్సరం అమ్మ మన పుట్టినరోజు పండగలా జరుపుతుంది. కొత్తబట్టలు, చాక్లెట్లు, స్వీట్లు... ఎన్ని చేసేదో, కాని పెద్దయ్యాక మన  పుట్టినరోజులో అమ్మ అంతగా కనిపించదు. స్నేహితులు, కాబోయే భర్త లేదా అత్తవారింటివారు మాత్రమే ఉంటారు. కాని  మన పుట్టుకకు కారణమైన అమ్మలేని మన పుట్టినరోజును ఎంత ఘనంగా జరుపుకున్నా  వృధాయే కదా. అందుకే ఈ విజయోత్సవ వేళ  అమ్మకే  ఈ రోజు అంకితం.. అమ్మా! అటు చూడు"అంటూ స్టేజ్ కుడివైపుకు చూపించింది..*


*అది చూసిన సౌదామిని ఆశ్చర్యపోయింది. తను చూస్తుంది కలయా? నిజమా ? అని నమ్మలేకపోయింది.*

*అమెరికాలో ఉండే  సౌదామిని కొడుకు అన్వేష్, కోడలు స్వప్న, మనవరాళ్లు శిల్ప, శ్రేయ కనబడ్డారు. వారి వెనకాలే అల్లుడు, మనవళ్లు  నేహాంత్, శ్రేయాంశ్...* *మనవరాళ్లు ముచ్చటగా పట్టుపరికిణీలలో, మనవళ్లు సిల్క్ కుర్తా పైజామాలు వేసుకుని ఎంత ముద్దుగా ఉన్నారో..*


*సౌదామిని తన కొడుకును చూసి అయిదేళ్లయింది.  మనవరాళ్లను కూడా మొదటిసారి ప్రత్యక్షంగా చూస్తోంది. వాళ్లు పుట్టినప్పటినుండి వాళ్ల ఆటలన్నీ స్కైప్ లోనే చూడడం. వాళ్లంతా వచ్చి సౌదామినిని చుట్టుముట్టారు. మనవళ్లు, మనవరాళ్లు అమ్మమ్మా! బామ్మా! అంటూ కౌగిలించుకున్నారు..*

*సౌదామినికి సంతోషంతో కళ్లనీళ్లు వచ్చేసాయి.  అది చూసి హాల్లో ఉన్నవారికి కూడా మనసు చెమరించింది.*


*భావన పిలవగానే పిల్లలు నలుగురూ వచ్చి మైక్ ముందు నిలబడి నెల రోజులనించి ప్రాక్టీసు చేసిన, సౌదామినికి ఇష్టమైన అన్నమయ్య కీర్తనను పాడారు.*

  

*కంపెనీ చైర్మన్, డైరెక్టర్లు కూడా ఈ ఏర్పాట్లు ముందే తెలుసన్నట్టు చిరునవ్వులతో నిలబడ్డారు*.


*అన్వేష్ వచ్చి మైక్ అందుకున్నాడు..” ఫ్రెంఢ్స్.. నిజానికి ఇది అక్కకి సంబంధించిన ప్రోగ్రామ్.. తన కంపెనీ, తన ప్రాజెక్టు విజయంతోపాటు తన పుట్టినరోజు కూడా..  కాని ఇలా తన పుట్టినరోజను అమ్మ కన్నరోజుగా మార్చడం అన్న ఆలోచన వచ్చినందుకు నిజంగా హాట్సాఫ్ అక్కా.. నువ్వు చెప్పింది నిజమే..*


 *అమ్మలేకుండా మనం లేము.  మన పుట్టినరోజును అమ్మ ఎప్పుటికీ మర్చిపోదు కారణం తను నవమాసాలు మోసి కని, అల్లారుమద్దుగా, క్రమశిక్షణతో పెంచుతుంది. అమ్మకు తోడుగా నాన్న ఎప్పుడూ వెన్నంటే ఉన్నారు. నాన్న డబ్బులు కట్టినంత మాత్రాన మనం  ఇంజనీర్లు, డాక్టర్లం అయిపోతామా.. మనకోసం, మన చదువులు, సంతోషంకోసం నాన్న సంపాదనలో బిజీగా ఉంటారని, మన ప్రతీ ఆవసరం అమ్మకు తెలుసుకుంటుంది..ఎంత కష్టమైనా తీర్చడానికి ప్రయత్నిస్తుంది. నాన్నను, మనను, మన పిల్లలను కూడా జాగ్రత్తగా చూసుకుంటుంది అమ్మ*.


 *కాని తన అవసరాలు, ఇష్టాల గురించి ఎవరికి ఎంత తెలుసని. కనీసం తన  పుట్టినరోజు కూడా మనం గుర్తుపెట్టుకోము. ఎందుకంటే మనం మన ఉద్యోగ, వ్యాపార, కుటుంబ వ్యవహారాల్లో బిజీ కాబట్టి...*


 *ఇప్పుడు అక్క కారణంగా నేను చేస్తున్న తప్పు కూడా తెలిసి వచ్చింది. అందుకే  సెలవులు లేవు, తీరిక లేదు అంటూ అమ్మ దగ్గరకు రావడాన్ని వాయిదా వేస్తున్న నేను వెంటనే వచ్చేసా. నేను రావడమే అమ్మకు పెద్ద బహుమతి అని నాకు తెలుసు కదా” అని ఉద్వేగంతో మాట్లాడిన అన్వేష్ కళ్లు తుడుచుకుంటూ తల్లి దగ్గరకు వెళ్లాడు.*


*సౌదామిని ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఏం మాట్లాడాలో కూడా తెలీడం లేదు. కూతురి ఆలోచనకు సంతోషించాలా? తన  పిల్లలు తనను ఇంతగా ప్రేమిస్తూ, గౌరవిస్తున్నందుకు సంతోషించాలా అర్దం కాని స్థితిలో ఉంది.  భర్త, పిల్లలు, మనవళ్లతో  కేక్ కట్ చేసింది. హాలు మొత్తం కరతాళ ధ్వనులతో మారుమ్రోగిపోయింది.*


*“అమ్మా! మీరు మా అందరికీ  రెండు మంచి మాటలు చెప్పండి. తల్లిమీద ఇంత మంచి అభిప్రాయం , ప్రేమ, ఆఫ్యాయతలు ఉన్న మీ పిల్లలను చూస్తే మీ పెంపకం, మీరు నేర్పిన సంస్కారం కనిపిస్తున్నాయి. ఇవి ఈనాటి పిల్లలందరికీ  అర్ధమవ్వాలి. చెప్పండి ప్లీజ్.. ” అని రిక్వెస్ట్ చేసాడు కంపెనీ చైర్మన్ నారాయణరావు..*

 

*“అయ్యో! నేనేం మాట్లాడగలను.  మీరనుకున్నంత గొప్పదాన్నేమీ కాదు. అందరిలాంటి తల్లినే. వద్దు” అంటూ చేతులు జోడించి మొహమాటంగా చెప్పింది సౌదామిని.*


*“మాట్లాడాలి....మాట్లాడాలి.. “అంటూ హాల్లో కేకలు వినపడ్డాయి..*


*భావన కూడా తల్లిని మాట్లాడమనడంతో తప్పనిసరై మైక్ ముందుకు వచ్చింది.*


*“వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక క్రింద ఉన్న పెద్దలకు నమస్కారాలు. పిల్లలకు ఆశీర్వాదాలు. మా పిల్లలు నామీద ఉన్న ప్రేమతో మరీ గొప్పగా చెప్తున్నారు కాని నేను చేసిందేమీ లేదు. అందరు అమ్మలలాగానే నా  పిల్లలు కూడా గొప్ప చదువులు చదవాలి, మంచి ఉద్యోగంలో స్థిరపడాలి. పిల్లాపాపలతో సంతోషంగా ఉండాలని కోరుకున్నాను. వారికి తగిన సహాయ సహకారాలను అందించాను.*


 *కాని మీరంతా నా పిల్లల ఈడువాళ్లే కాబట్టి ఒక్క మాట మాత్రం చెప్పాలనుకుంటున్నాను.*

*పెద్ద చదువులు చదవండి. ఉద్యోగాలు చేయండి. సంపాదించండి.*


*కాని కుటుంబాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయకండి. కుటుంబం అంటే తల్లిదండ్రులే కాదు భాగస్వామి, పిల్లలు కూడా... మీరు ఎంత సంపాదించినా మీకోసం మీ పిల్లలకోసమే కదా. మీరు మీ భాగస్వామితో , పిల్లలతో ఆనందంగా ఉండడానకి కావలసినంత సంపాదించండి చాలు.*


 *తరతరాలకు సంపాదించడం కోసం ఇప్పటి మీ సంతోషాలను, జీవితాలను పణంగా పెట్టకండి. యంత్రాలలా కాకుండా మనుషుల్లా మీ మనసుకు తగినట్టుగా బ్రతకండి.. అంతే..*


*మరొక్కమాట.. మీ పుట్టినరోజు సంబరాలు  మీకు మాత్రమే  సొంతం కాదు. మీ జన్మకు కారణమైన అమ్మానాన్నలు కూడా ఉన్నారని మాత్రం మరచిపోవద్దు. ఉంటాను “  అని వినయంగా చెప్పింది.*

 

*కంపెనీ ఉద్యోగులు, చైర్మన్, డైరెక్టర్ల కరతాళ ధ్వనులతో హాలంతా మారుమ్రోగిపోయింది.*

*భర్త, పిల్లలతో కలిసి సంతోషంగా ఇంటికి బయలుదేరింది సౌదామిని.*


 *ఇప్పుడు ఆమెకు ప్రపంచాన్ని జయించినంత సంతోషంగా ఉంది.. కారులో కూడా మనవళ్లు, మనవరాళ్లతో తెగ కబుర్లు చెప్పసాగింది, వాళ్ల కబుర్లు వింటూ చిన్నపిల్లలా మారిపోయింది..  తన కూతురు, కొడుకు కలిసి చేసిన ఈ కార్యక్రమంలో తన వంతు బాధ్యతను పూర్తి చేసానన్న తృప్తితో ఆ మనోహరమైన దృశ్యాన్ని అశోక్ చూస్తూ ఉండిపోయాడు.*


*ఇంటికి రాగానే అందరూ హాల్లో చేరారు. వాళ్లకు భోజనం ఏర్పాట్లు చేయడానికి వంటింట్లోకి వెళ్లబోతున్న సౌదామినిని బలవంతంగా హాల్లోనే కూర్చోబెట్టారు. అంతలోనే హోటల్ నుండి ఆర్డర్ చేసిన భోజనం వచ్చేసింది.*


 *సౌదామిని, భర్తను, పిల్లలను, వాళ్ల పిల్లలను చూసుకుంటూ  పట్టరాని ఆనందంతో పొంగిపోయింది. వాళ్లు రావడం ఒక ఎత్తైతే తను కన్నరోజు అంటూ అంత గొప్ప గౌరవాన్ని ఇవ్వడం గురించి తలుచుకుని ఇంకా ఆశ్చర్యంగానే ఉంది.*


*తమ పిల్లలతో పాటు అమ్మకు అటు ఇటు కూర్చున్న భావన, అన్వేష్ కలిసి తాము నెలరోజులనుండి ప్లాన్ చేసిన ఈ కార్యక్రమం గురించి తల్లికి వివరించసాగారు.  వాళ్లకు తోడుగా నిలిచిన  కోడలు, అల్లుడు, అశోక్ దూరం నుండే వాళ్లను చూసి నవ్వుకున్నారు.  వాళ్ల మాటలు ఎంతకీ ఆగడం లేదు..*


*“సౌదా! ఇదిగో నా తరఫున నీకో చిన్న బహుమతి. నీకు చాలా ఇష్టమైనదే అని నాకు తెలుసు” అంటూ అశోక్ ఒక కవర్ ఆమె చేతిలో పెట్టాడు.*


*“అయ్యో! ఇప్పుడు మీరు కూడా బహుమతి ఇవ్వాలా? పిల్లలకు తోడుగా ఉండి ఇదంతా చేయించారు చాలదూ.. ఏముంది ఈ కవర్ లో?” అంటూ కవర్ తెరిచింది.*


*పిల్లలందరూ కూడా ఆ కవర్ లో ఏముందా అని ఆసక్తిగా చూసారు.*


*సౌదామిని పేరు మీద ఎమ్.ఫిల్  అఫ్లికేషన్ ఫారమ్ పూర్తిగా నింపి, కావలసిన సర్టిఫికెట్లు జతచేసి ఉన్న కాగితాలవి. సంతకం పెట్టి సబ్మిట్ చేస్తే చాలు.*


*అది చూసి పిల్లలంతా సంతోషంగా చప్పట్లు కొట్టారు.. ఆ నవ్వులు, కేరింతలు సౌదామిని మొహంలో  కూడా ప్రస్ఫుటంగా కనిపించాయి.*

కామెంట్‌లు లేవు: