23, ఫిబ్రవరి 2021, మంగళవారం

మొగలిచెర్ల

 *జ్వరం కాదు దుష్ట గ్రహం..*


"అయ్యగారూ మా అబ్బాయి పెళ్లి స్వామివారి సన్నిధిలో చేయాలని అనుకున్నాము..వచ్చేనెలలో మూడో ఆదివారం ఉదయం 10 గంటలకు ముహూర్తం వున్నదని పూజారిగారు చెప్పారు..ఖాయం చేసుకున్నాము..ఇక్కడ వివాహం చేయాలంటే..వరుడు, వధువు ఇద్దరూ మేజర్లు అయివుండాలని..అందుకు సంబంధించిన పత్రాలు కావాలని మీ సిబ్బంది చెప్పారు..అన్నీ సిద్ధంగా ఉన్నాయి..మీకు ఒకమాట చెప్పి..మీరు సరే అంటే..మా ఏర్పాట్లలో మేము ఉంటాము..అన్నట్టు మరో విషయం..మా అబ్బాయి పెళ్లి ఆదివారం నాడు అన్నాముకదా..ఆరోజు మధ్యాహ్నం మా పెళ్ళివాళ్ళతో పాటు ఈ గుడికి వచ్చిన భక్తులకు కూడా మేమే భోజనాలు ఏర్పాటు చేస్తాము..వీడి పెళ్లి పుణ్యమా అని ఆ అవకాశం మాకు కల్పించండి.." అని వెంకటరత్నం నాతో చెప్పాడు..


వెంకటరత్నం కుమారుడు వెంకట రమణ..అతని వివాహం స్వామివారి సన్నిధిలో జరపడానికి ఒక కారణం ఉన్నది..వెంకటరమణ కు పన్నెండేళ్ల వయసులో జ్వరం వచ్చింది..కందుకూరులో డాక్టర్ల కు చూపించారు..రెండురోజులకు తగ్గినట్లే తగ్గి మళ్లీ జ్వరం వచ్చింది..ఆరోజుల్లో అందుబాటులో ఉన్న పరీక్షలు (ఆరోజుల్లో అంటే 2004, 2005 సంవత్సరాల సమయం లో) చేశారు..మందులు వాడుతున్నారు..ఒక వారం జ్వరం తగ్గడం..మళ్లీ రావడం..పిల్లవాడు బలహీనపడుతున్నాడు..కానీ ఫలితం కనబడలేదు..ఒంగోలు లోని డాక్టర్లు చెన్నై తీసుకెళ్లామన్నారు..చెన్నై విజయా హాస్పిటల్ కు తీసుకెళ్లారు..సుమారు 10 రోజుల వైద్యం అనంతరం..పిల్లవాడికి తగ్గింది..తీసుకెళ్లండి అని వైద్యులు చెప్పారు..తమ ఊరికి తీసుకొచ్చారు..మళ్లీ వారం కల్లా జ్వరం వచ్చింది..వెంకటరత్నం దంపతులకు దిక్కు తోచలేదు..డబ్బుకు డబ్బు ఖర్చు అయింది..ఫలితం కనబడలేదు..


ఏం చెయ్యాలో తెలీని పరిస్థితుల్లో..వెంకటరత్నం భార్య.." పిల్లవాడిని తీసుకొని మొగిలిచెర్ల దత్తాత్రేయ స్వామి దగ్గరకు తీసుకుపోయి మొక్కుకుందాము..స్వామివద్ద నిద్ర చేస్తే ఏ పీడలు వున్నా పోతాయని అంటున్నారు..ఒక్కసారి అక్కడకు పోదాము.." అని భర్తతో చెప్పింది.."ఎంతోమంది వైద్యులకు చూపించినా తగ్గని జబ్బు, ఆ స్వామి సమాధి వద్దకు పోయి మొక్కుకుంటే తగ్గుతుందా..?.." అన్నాడు వెంకటరత్నం.."ఇంత డబ్బు ఖర్చు పెట్టాము..నా మాటవిని ఒక్కసారి స్వామి దగ్గరకు మన బిడ్డను తీసుకొని పోదామయ్యా.." అని గట్టిగా చెప్పింది..వెంకటరత్నం ఎట్టకేలకు సరే అన్నాడు..ఆ మరుసటి రోజే ఆ దంపతులు తమ బిడ్డను తీసుకొని మొగిలిచెర్ల దత్తాత్రేయుడి సన్నిధికి చేరారు..స్వామివారి మంటపం లో పిల్లవాడిని పడుకోబెట్టారు..ఆ సమయం లో పిల్లవాడికి బాగా జ్వరం గా ఉన్నది..వెంకటరత్నం దంపతులు ఇద్దరూ మందిరం బైట ఉన్న బావి వద్దకు వెళ్లి తలారా స్నానం చేసి..ఆ తడి బట్టలతోనే మంటపం లోకి వచ్చి..స్వామివారి సమాధికి ఎదురుగా సాగిలపడి..మొక్కుకున్నారు..పూజారి గారు సాయంత్రం హారతి ఇచ్చి..అందరికీ తీర్ధం ఇస్తూ..ఈ దంపతలకూ ఇచ్చారు.."పంతులు గారూ మా అబ్బాయికి కూడా తీర్ధం ఇవ్వండి "అని వెంకటరత్నం భార్య అడిగింది.."మీ అబ్బాయి పేరేమిటి..?" అన్నారు పూజారి గారు.."వెంకట రమణ.." అన్నది.."వెంకటరమణా..వచ్చి తీర్ధం తీసుకో.." అన్నారు పూజారి గారు..మంటపం లో జ్వరం తో పడుకొని ఉన్న వెంకటరమణ..లేచి వచ్చి..పూజారి గారి వద్ద తీర్ధం తీసుకున్నాడు..ఆ రాత్రికి ఆ పిల్లవాడు మంటపం లోనే ఏ బాధ లేకుండా నిద్ర పోయాడు..ప్రక్కరోజు ఉదయం వెంకటరమణ కొద్దిగా ఉషారుగా వున్నాడు..కొద్దిగా ఆహారం తీసుకున్నాడు..మూడు పూటలా స్వామివారి హారతి బిడ్డకు ఇప్పించడం..స్వామివారి తీర్ధాన్ని ఇవ్వడం..స్వామివారి విభూతి ని తమ కుమారుడి నుదుటిపై పెట్టడం చేయసాగారు..వెంకటరత్నం దంపతులు స్వామివారి సన్నిధిలో వారం రోజులు వున్నారు..ఒక్కరోజు కూడా తమ బిడ్డ జ్వరం తో బాధపడలేదని..తమ బిడ్డకు తాము ఇన్నాళ్లూ జ్వరం అని భ్రమ పడ్డామని..అది జ్వరం కాదు..ఏదో గ్రహ పీడ అనీ..స్వామివారి వద్దకు వచ్చిన తరువాత ఆ దుష్టగ్రహం వదలిపోయిందనీ..ఒకరికొకరు చెప్పుకొని సంతోషించారు..వారం తరువాత స్వామివారికి పొంగలి నైవేద్యం గా పెట్టి..తమ ఊరు వెళ్లారు..ఆరోజు తరువాత ఆ పిల్లవాడికి అనారోగ్యం దరి చేరలేదు..చక్కగా చదువుకున్నాడు..


వెంకటరత్నానికి తన భార్య ఇచ్చిన సలహా ఎంత విలువైనదో అర్ధం అయింది..ఒక్కగానొక్క కుమారుడు లక్షణంగా తన కళ్ళముందు తిరుగుతుంటే..ఏ తండ్రికి ఆనందం ఉండదు.?..తమ కుమారుడి వివాహం మొగిలిచెర్ల దత్తాత్రేయుడి సన్నిధిలో జరుపుతామని ఆనాడే ఆ దంపతులు గట్టిగా మొక్కుకున్నారు..అనుకున్న విధంగానే కుమారుడి వివాహం స్వామివారి సన్నిధిలో జరిపించి..వధూవరులను స్వామివారి సమాధివద్దకు తీసుకెళ్లి నమస్కారం చేయించారు..


"మా బిడ్డ లక్షణంగా వున్నాడు అంటే కారణం ఈ దత్తాత్రేయుడే.." అని ఆ దంపతులు ఇప్పటికీ చెప్పుకుంటూ వుంటారు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: