* .
**************
*అనంతావధానం*
- *డాక్టర్* *రాయారావు* *సూర్యప్రకాశ్* *రావు*
9441046839
*************
వంటిల్లు అనంతావధానానికి మౌనసాక్షి
ఊయలలోని పాప ఏడుపు
అంతరార్థం కోసం అమ్మ అన్వేషణ
చీమ కుట్టిందో
దోమ కుట్టిందో
కల వచ్చిందో
కుల్లా కరిచిందో
పూరణానికి ఆ తల్లికో సమస్య
పాలల్లో బూస్టు వద్దని ఒకరు
హార్లిక్సు సరిపడదని మరొకరు
నిషిద్ధాక్షరిని ప్రయోగించే
గడుగ్గాయి పిల్ల పృచ్ఛకులు
ఇంట్లో లేని కూరలనే వడ్డించమని
న్యస్తాక్షరి ప్రశ్నలా నిలుస్తారు మామగారు
నాలుగు పూటలా ఏమేం కావాలో
ఆదేశాలు జారీ చేస్తూ
దత్తపది అవతారమెత్తుతారు అత్తగారు
ఏదో ఒక విషయంపై కథ చెప్పమని
మారాం చేస్తూ
వర్ణన సమస్య ఇస్తారు పిల్లలు
జీతం రాకముందే
ఠంచనుగా ఫస్టుకు డబ్బులడిగే
పాలవాడికి ఆశుకథాశ్రవణం అందించవలసిందే
వంట మధ్యలో పిలిచి
కూర మాడేందుకు కారణమయ్యే పక్కింటి ఆంటీ
గొప్ప అప్రస్తుత ప్రసంగీకురాలు
సరిగ్గా ఊపిరి పీల్చేందుకు సమయం లేనప్పుడే
సీరియల్ కథలు వల్లె వేస్తుంది
పనిలో ఉన్నప్పుడే వచ్చే
పేపర్ బిల్లూ
కేబుల్ బిల్లూ
లాండ్రీ బిల్లూ
అప్రస్తుత ప్రసంగాలకు అంకెల రూపంగా కనబడతాయి
అత్తమామలకు అర్థం కాకుండా
పక్కింటి ఆంటీ తోనూ భర్తతోనూ మాట్లాడే
‘క’ భాషో ‘గ’ భాషో
ఛందోభాషణానికి ఉదాహరణ అవుతుంది
బ్యాగు సర్దావా?
బాక్సు పెట్టావా?
పుస్తకాలు అన్నీ ఉన్నాయా?
నీళ్ల సీసా ఉందా?
అన్నీ అవధాన ప్రశ్నలే
వంటిల్లు ఒక అవధాన క్షేత్రం
ఇల్లాలు అవధాన సరస్వతి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి