9, మార్చి 2021, మంగళవారం

మొగలిచెర్ల

 *జానకమ్మ నమ్మకం..*


"బుధవారం నుంచీ ఆదివారం దాకా ఐదు రోజులు ఉండాలని అనుకుంటున్నాను..నాకోసం ప్రత్యేకంగా రూము అక్కరలేదు..స్వామిసన్నిధిలోనే ఉంటాను..నీకు అభ్యంతరం లేదు కదా?" అని ఆ పెద్దావిడ నన్ను అడిగింది..ఆవిడపేరు జానకమ్మ గారు.ఆవిడకు పెళ్లై ఇద్దరు పిల్లలు పుట్టిన ఆరేడు ఏళ్లకే..ఆవిడ భర్త మరణించాడు..ఆ చిన్న పిల్లలను తన రెక్కల కష్టం తోటి పెంచి పెద్దచేశారు..అమ్మాయిని తన అన్నయ్య కుమారుడితో వివాహం జరిపించారు..కొడుకు కూడా వివాహం చేసుకొని ఉద్యోగం చేసుకుంటున్నాడు..ప్రస్తుతం కుమారుడి వద్ద ఉంటున్నది..


భర్త చనిపోయిన తరువాత ఒకనాడు జానకమ్మ గారు మొగిలిచెర్ల రావడం జరిగింది..అప్పటికి శ్రీ స్వామివారు సిద్ధిపొంది రెండు మూడేళ్లు అవుతోంది..మొగిలిచెర్ల గ్రామం నుంచీ నడుచుకుంటూ వచ్చి స్వామివారి సమాధి దర్శనం చేసుకున్నది..తననూ తన బిడ్డలనూ చల్లంగా చూడు స్వామీ అని మనసులో ప్రార్ధించుకున్నది..ఆ మరుసటి సంవత్సరం కూతురికి అమ్మవారు పోసి..వళ్ళంతా పొక్కులు పొక్కులు గా వస్తే..మళ్లీ మొగిలిచెర్ల వచ్చి..కూతురి ఆరోగ్యం బాగుపడితే..తలనీలాలు సమర్పించుకొంటానని స్వామివారిని వేడుకున్నది..వారం రోజుల్లో అమ్మాయి ఆరోగ్యం బాగుపడింది..అనుకున్న విధంగానే తన తలనీలాలు స్వామివారి వద్ద సమర్పించుకున్నది..ఆనాటి నుంచీ ఏ కష్టం వచ్చినా..నేరుగా మొగిలిచెర్ల వచ్చి..స్వామివారి సన్నిధిలో నిద్ర చేసి..తన కష్టాన్ని స్వామివారికి విన్నవించుకొని వెళ్లడం జానకమ్మ గారికి అలవాటు..


"అమ్మా..ఈసారి ఏదైనా పెద్ద సమస్య ఎదురైందా..? ఐదు రోజులు ఇక్కడే ఉండాలని అనుకున్నారు.." అని అడిగాను.."అవును నాయనా..మా అమ్మాయి ప్రసూన తెలుసుకదా..దానికి ఇద్దరు బిడ్డలు..ఇద్దరూ ఆడపిల్లలే..పెద్దదానికి పెళ్లి చేసింది..రెండో కూతురికి సంబంధాలు చూస్తున్నది..ఈ పిల్లకు చిన్న లోపం ఉంది..అప్పుడప్పుడూ మూర్ఛ లాగా వస్తుంది..వైద్యం చేయిస్తున్నారు కానీ..ఇంకా పూర్తిగా నయం కాలేదు..ఈ స్వామివారి వద్ద ఐదు రాత్రిళ్ళు నిద్ర చేయించు..నీ కూతురికి అన్ని రోగాలూ నయమైపోతాయి అని మా అమ్మాయికి నచ్చ చెప్పాను..అయితే దానిని నువ్వే అక్కడికి తీసుకెళ్లు..ఐదు రోజులూ అక్కడే వుండండి..నీ మాట ప్రకారం దానికి జబ్బు నయం అయితే..నేనూ, మా ఆయన కూడా స్వామివారికి తలనీలాలు ఇచ్చి..అన్నదానం చేస్తాము..అని నా కూతురు చెప్పింది..అందుకని నా మనుమరాలిని వెంటబెట్టుకొని వచ్చాను..ఈ ఐదు రోజులూ ఇక్కడే ఉంటాము.." అన్నది..


జానకమ్మ గారి పర్యవేక్షణలో..ఆమె మనుమరాలు ఐదు రోజులూ ఉదయం సాయంత్రం స్వామివారి మందిరం లో నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసింది..ఇద్దరూ స్వామివారి మంటపం లోనే పడుకునే వారు..ప్రతిరోజూ ఉదయం స్వామివారి సమాధి వద్దకు వెళ్లి నమస్కారం చేసుకొని వచ్చేవారు..ఆ ఐదురోజుల్లో ఒక్కసారి కూడా ఆ అమ్మాయికి మూర్ఛ వ్యాధి కనబడలేదు..సోమవారం ఉదయం తన మనుమరాలిని తీసుకొని ఊరికి వెళుతూ.."అయ్యా ప్రసాదూ..ఈ పిల్లకు నయం అయింది..నేను గట్టిగా చెప్పగలను..దీని తల్లీతండ్రీ కూడా నిర్ధారించుకొని త్వరలో వచ్చి తలనీలాలు ఇస్తారు..తప్పదు..స్వామికిచ్చిన మాట కదా..అన్నదానం కూడా చేస్తారు..చూస్తూ ఉండు..స్వామి మహిమ నాకు తెలుసుకదా.." అని చెప్పి మరీ వెళ్లారు..


మరో నెలకల్లా జానకమ్మ గారి వెంట  కూతురు, అల్లుడూ, మనుమరాలు స్వామివారి మందిరానికి వచ్చారు.."ఈ స్వామివారి మహత్తు గురించి మా అమ్మ నమ్మకంగా చెప్పిన మాటే నిజం అయిందండీ..అమ్మాయికి పూర్తిగా నయం అయింది..అందుకే మేము స్వామికి మొక్కు చెల్లించుకోవడానికి వచ్చాము..రేపటిరోజు అన్నదానానికి అయ్యే ఖర్చు మేమే భరిస్తాము.." అని జానకమ్మ గారి కూతురు చెప్పింది.."స్వామిని నలభై ఏళ్ల నుంచీ కొలుస్తున్నాను..ఏ కష్టం వచ్చినా నా వెంటే వుండి తీర్చాడు..మహానుభావుడు.." అంటూ జానకమ్మ గారు కళ్లనీళ్ళతో చెప్పారు..


స్వామివారి పై జానకమ్మ గారికి అపరిమిత భక్తీ విశ్వాసం..ఆ రెండే ఆమెను స్వామివారి దగ్గరకు చేర్చాయి..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: