*🙏మహర్షుల దివ్య చరిత్రలు🙏*
*8.అంగిరో మహర్షి*
మనం ఇప్పుడు ' అంగిరస ' మహర్షి గురించి తెలుసుకుంటున్నాము . ఈ మహర్షి ఎలా పుట్టాడో తెలుసా ! బ్రహ్మదేవుడు ముఖం నుంచి . బ్రహ్మ మానసపుత్రులు అంటూంటారు మీరెప్పుడైనా విన్నారా .... అందులో మూడవవాడు ఈ అంగిరస మహర్షి అంగిరస మహర్షి వేదమంత్రాలు నేర్చుకుని తపస్సు చేసి గొప్ప విజ్ఞానాన్ని వివేకాన్ని పొంది గొప్ప తేజస్సుతో వెలుగుతున్నాడు . కర్దమ , ప్రజాపతి అనే ఆయన పదివేల సంవత్సరాలు తపస్సు చేసి తొమ్మిది మంది కూతుళ్ళని పొందాడు . అందులో శ్రద్ధ అనే పేరు గల అమ్మాయిని అంగిరస మహర్షికిచ్చి పెళ్ళి చేశాడు . బ్రహ్మదేవుడు అంగిరస మహర్షిని సృష్టి చెయ్యడంలో సాయం చెయ్యమని అడిగాడు కదా ... అందుకే అంగిరస మహర్షి శ్రద్ధా దేవికి ఏడుగురు కూతుళ్ళని , ఏడుగురు కొడుకుల్ని అనుగ్రహించాడు . వాళ్లకి మళ్ళీ పిల్లలు , ఆ పిల్లలకు మళ్లీ పిల్లలు అలా వంశం వృద్ధి పొందింది . ఆయన ఇలా ఒక వంశానికి మూలపురుషుడయ్యాడు . ఒకసారి అగ్నిదేవుడికి కోపం వచ్చి ఎక్కడికో వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటున్నాడు .
దేవతలు యజ్ఞాలు చేస్తుంటే అగ్నిదేవుడు లేడు కదా ? ఏం చెయ్యాలి ? ఆలోచిస్తుంటే బ్రహ్మదేవుడు కల్పించుకొని , అంతకంటే గొప్పవాడు అంగిరసుడు వున్నాడు కదా ! ఆయన్నే అగ్నిదేవుడుగా అనుకొని యజ్ఞం పూర్తిచేసుకోండి అన్నాడు . ఇది విని నిజం అగ్నిదేవుడు అమ్మో ! నా పదవి అంగిరసుడికి ఇచ్చేస్తున్నారని కోపం అక్కడే వదిలేసి పరిగెత్తుకొని వచ్చేశాడు . అప్పటి నుంచి అంగిరసుడు రెండో అగ్నిదేవుడయ్యాడు .
శూరసేన దేశాన్ని చిత్రకేతుడు అనే రాజు పరిపాలించే వాడు . అతనికి చాలా సంపద , కోటిమంది అందమయిన భార్యలు ఉన్నారు . కానీ , అతనికి పిల్లలు లేరు . అంగిరస మహర్షిని ప్రార్థించాడు . కృతద్యుతి అనే పేరుగల భార్య యందు ఒక కొడుకు పుట్టాడు . మిగిలిన భార్యలు ఆ అబ్బాయికి విషం పెట్టి చంపేశారు . మహారాజు దుఃఖంతో మూర్ఛపోయాడు . అంగిరస మహర్షికి ఈ విషయం తెలిసి చిత్రకేతుడి దగ్గరికి వెళ్ళి లోకంలో చావు పుట్టుకలు తప్పవు . ఇపుడు నీకు కొడుకయినా పూర్వజన్మలో వాడు ఏమిటో నీకు తెలుసా .
ప్రతిజీవుడు చస్తూనే ఉంటాడు ఇంత బాధపడవద్దని నారద మహర్షి సాయంతో చచ్చిపోయిన కొడుకిని బతికించి చూపించి నువ్వు తెలుసేమో అడుగు అతనికి అన్నారు . చిత్రకేతుడు “ నాయనా ! ” అని పిలుస్తే ఆ కొడుకేమో నువ్వు ఎవరో నాకు తెలియదన్నాడు . ఈ విధంగా అంగిరసుడు , చిత్రకేతుడికి భార్య పిల్లలు , సంపదలు , భోగభాగ్యాలు ఇవన్నీ ఋణంతో కూడుకున్నవే . కానీ , భగవంతుడు మాత్రం సత్యం అని ఉపదేశం చేశాడు . తర్వాత అంగిరస మహర్షి తీర్థయాత్రలకి బయలుదేరి ఎక్కడెక్కడ ఎన్నెన్ని పుణ్యనదులున్నాయో అన్నింటిలోను స్నానం చేసి తిరిగి ఆశ్రమానికి వచ్చాడు . ఒకసారి గౌతమ మహర్షి అంగిరసుడిని ఇన్ని తీర్థాల్లో స్నానం చేశారు కదా ... వాటి గురించి కొంచెం చెప్పండని అడిగాడు . మనం కూడా కొన్నింటి గురించైనా తెలుసుకుంటే బాగుంటుందేమో ! పోనీ తెలుసుకుందాం . మనం కూడ ఎవరకయినా చెప్పచ్చు కదా ! చంద్రభాగ అనే తీర్థంలో వరుసగా ఏడురోజులు స్నానం చేస్తే చాలా సంపదలు , ముక్తి కలుగుతాయి . పుష్కర తీర్థ , ప్రభాస , నైమిష , దేవిక , ఇంద్రమార్గ , స్వర్ణబిందు అనే తీర్థాల్లో స్నానం చేస్తే స్వర్గలోకం చేరుతారు .
కుశేశయ , దేవాంతము , ఇంద్రతోయ , కరతోయ , కన్యాకూపసుందరికాహ్రద , వైమానిక , విపాశ , కాళికాశ్రమం , కృత్తికాశ్రమం , దేవదారువనం , ద్రోణశర్మపదము ఇలా ఎన్నెన్నో తీర్థాలు , పుణ్యక్షేత్రాలు లెక్కలేనన్ని ఉన్నాయి . అలాగే గంగా యమునల సంగమం , ప్రయాగ మొదలయిన వాటి గురించి కూడ అంగిరస మహర్షి గౌతముడికి చెప్పాడు . ఒకసారి అగ్నిదేవుడు ఋషుల భార్యలని చూసి ఇష్టపడి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ముని వేషం వేసుకుని ఆ భార్యతో గడపటం మొదలు పెట్టాడు . అంగిరస మహర్షికి కోపం వచ్చి ఋషుల భార్యల్ని భూలోకంలో పుట్టండి అని శపించాడు . పాపం వాళ్ళు తమ దగ్గరకు వచ్చింది . భర్త అనుకున్నారే గానీ , అగ్నిదేవుడే అలా చేస్తాడని తెలియదు కదా ! భూలోకంలో బ్రాహ్మణులకు భార్యలుగా పుట్టి శ్రీకృష్ణుడి సేవ చేసుకున్నారు .
పోన్లే భగవంతుణ్ణి సేవించుకున్నారు హాయిగా కదా ..... శాపం ఇస్తే ఇచ్చాడు కానీ మంచే జరిగింది . శౌనక మహర్షి అంగిరస మహర్షి దగ్గరకు వచ్చి బ్రహ్మవిద్యని గురించి చెప్పమన్నాడు . అప్పడు అంగిరస మహర్షి ఇలా చెప్పాడు.
విద్యలు రెండు రకాలు . ఒకటి పరవిద్య- రెండవది అపరవిద్య . అపరవిద్య అంటే వేదాలు , శిక్ష , వ్యాకరణము , కల్పము , నిరుక్తము , జ్యోతిషము , ఛందస్సు మొదలయినవి . అపరవిద్య అంటే భగవంతుడ్ని గురించిన జ్ఞానము . ముక్తి పొందడానికి రెండు మార్గాలున్నాయి . ఒకటి కర్మ మార్గం . రెండవది జ్ఞానమార్గం . యజ్ఞాలు , యాగాలు చెయ్యడం , మనస్సు మంచిగ ఉంచుకోవడం , భగవంతుడికోసం పూజలు , వ్రతాలు చెయ్యడం మొదలయినవి కర్మమార్గం . తపస్సు చెయ్యడం గురువు ద్వారా జ్ఞానం పొందడం గురువు చెప్పన విధంగా నడుచుకొని భగవంతుణ్ణి చూడడం ఇది జ్ఞానమార్గం . భగవంతుడు ఎక్కడయినా ఉంటాడు అని ఎందుకు చెప్తారో తెలుసా ! అంగిరస మహర్షి కూడా శౌనక మహర్షికి ఇదే చెప్పాడు . భగవంతుడు సర్వవ్యాపి అంటారు కదా . ప్రహ్లాదుడు కూడా అదే చెప్పాడు కదా .... అది ఏమిటో తెలుసుకుందాం ఏం ? భగవంతుడికి తల అగ్ని , కళ్ళు సూర్యచంద్రులు , చెవులు దిక్కులు , మాట వేదము , ప్రాణము వాయువు , హృదయం ప్రపంచం , భూమి పాదాలు . ఇంక ఆయన లేనిదెక్కడ ? ఆ అలుక సర్వవ్యాపి , అర్ధమయిందా ?
అంగిరస మహర్షి మహాతపశ్శాలి , మహాభక్తుడు , మహావిజ్ఞాని , బ్రహ్మానిష్టాగరిష్టుడు అని చదువుకున్నాం కదా . ఆయన ' అంగిరస్కృృతి ' అనే ధర్మశాస్త్రం కూడా రాశాడు . దీంట్లో వరిషత్తు అంటే ఉత్తములయిన నూట ఇరవయి ఒక్కమంది వేదవిదులుండాలనీ మనిషి శాస్త్ర ప్రకారమే కర్మలు చెయ్యాలనీ , పశుపక్షి సంతతిని చంపకూడదనీ , మాంసాహారం మానాలనీ , బ్రాహ్మణుడైనా మహాదోషాలు చేస్తే క్షమించకూడదనీ , తప్పులు చేసినప్పుడు దానికి తగిన ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలనీ ఇలాగే చాలా విషయాల గురించి వున్నాయి . అంగిరస మహర్షి వంశంలో పుట్టిన వాళ్ళందరూ బ్రహ్మదేవుడి సృష్టిలో మొట్టమొదటి వాళ్లన్నమాట . అశ్వమేధయాగం చేసేటప్పుడు చదివే అధర్వణవేదాన్ని అంగిరసులు చదివేవాళ్ళు . అందుకే దానికి అంగిరోవేదం అని కూడ పేరుంది . మహారాజులకి అంగిరసులు పురోహితులుగా , బ్రహ్మవిద్యను బోధించేవారుగా కూడా ఉండేవాళ్ళు . మీకు తెలుసా ? గౌతమ బుద్ధుడికి అంగిరసుడు అని కూడ పేరుంది . అంగిరస మహర్షి తన తండ్రి బ్రహ్మదేవుడికి సృష్టికార్యంలో సహాయపడి గొప్ప జ్ఞానుల్ని తపస్సంపన్నుల్ని , విద్యాధికుల్ని తయారు చేశాడన్న మాట .
*8.అంగిరో మహర్షి*
*Note:- మహర్షుల దివ్య చరిత్రను ఫార్వర్డ్ చేసి ప్రతి ఒక్క హిందూ చేత చదివిద్దాం. ఆ మహర్షుల దివ్య ఆశీస్సులు పొందు దాము*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి