25, జూన్ 2021, శుక్రవారం

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*భూతము..వైద్యము..*


శ్రీ స్వామివారి వద్దకు ఆరోజు ఉదయం తొమ్మిది గంటల లోపే వెళ్ళిపోయాను..నేను వెళ్ళేసరికే అక్కడ, ఆశ్రమనిర్మాణానికి సహాయం చేస్తున్న శ్రీ బొగ్గవరపు చిన మీరాశెట్టి గారు వారి శ్రీమతి గారు వచ్చి శ్రీ స్వామివారి కెదురుగా కూర్చుని వున్నారు..శ్రీ స్వామివారు నన్ను చూసి పలకరింపుగా నవ్వి, నా చేతిలోని స్టీల్ డబ్బా తీసుకొని ఓ ప్రక్కగా పెట్టారు..


మీరాశెట్టి గారికి నన్ను చూపిస్తూ.."ప్రసాద్ అని శ్రీధరరావు గారి రెండవ అబ్బాయి మీరాశెట్టీ.." అన్నారు..మీరాశెట్టి గారు, "నాకు తెలుసు స్వామీ..ఇంతకుముందు రెండు మూడు సార్లు మొగలిచెర్ల లో ఇంటి వద్ద చూసాను.." అన్నారు..మీరాశెట్టి గారు నాతో అమ్మానాన్న గార్ల గురించి అడుగుతూ వున్నారు..ఇంతలో సుమారు యాభై ఏళ్ళ పైబడిన దంపతులిద్దరు వచ్చి పాక బైట నిలబడ్డారు..


మీరాశెట్టి గారు వాళ్ళను చూసి.. "ఎవరు మీరు?..ఏం పని మీద ఇక్కడకు వచ్చారు?.." అన్నారు..


"అయ్యా! మాది తిమ్మారెడ్డిపల్లె..వ్యవసాయం చేసుకుంటూ వున్నాము..ఇదిగో ఈమె కు రెండు నెలల నుంచీ బాగాలేదు..ఇక్కడొక స్వామి వున్నాడని తెలిసి..చూపించుకుందామని వచ్చాము.." అన్నాడు..


అప్పటిదాకా అంతా వింటున్న శ్రీ స్వామివారు తాను కూర్చున్న చోటునుంచి లేచి, పాక బైటకు వచ్చి..

"ఏమయ్యా..నేను వైద్యుడి లాగా కనిపిస్తున్నానా?..నేనేదో తపస్సు చేసుకుంటున్నాను.. " అంటూ..ఆ ఆడమనిషి వైపు తిరిగి.."ఎన్నాళ్ల నుంచి ఈ విధంగా బాధపెడుతున్నావు?.." అన్నారు పరమ శాంతంగా చూస్తూ..


శ్రీ స్వామివారు అడిగిన ప్రశ్నకు ఆమె ఎటువంటి సమాధానం చెప్పకపోగా..ఉన్నట్టుండి వెఱ్ఱికేక పెట్టి ..నేలమీద కూలబడి పోయింది..చూస్తున్న నాకు భయమేసింది..గబుక్కున మీరాశెట్టి గారి ప్రక్కకెళ్లి నిలుచున్నాను..


శ్రీ స్వామివారు చిరునవ్వుతో చూస్తూ.."ఇదిగో పెద్దాయనా.. మీ ఇంటి పెరట్లో పెద్ద మునగ చెట్టు వున్నదా?.."అన్నారు..


"ఉంది స్వామీ.." అన్నాడు..


"ఇంటికెళ్లి, తక్షణమే ఆ చెట్టును మొదలు కూడా లేకుండా తీసివేయించు.. అన్నీ సర్దుకుంటాయి.." అన్నారు..


"అలాగే స్వామీ.." అన్నాడు వచ్చినతను.. కొద్దిసేపటికే అతని భార్య కోలుకుని లేచి నిలబడింది..


"వెళ్ళిరండి..శుభం జరుగుతుంది.." అన్నారు శ్రీ స్వామివారు..వాళ్లిద్దరూ శ్రీ స్వామివారికి నమస్కరించి వెళ్లిపోయారు..


"మీరాశెట్టీ..వాళ్ళింట్లో ఉన్న మునగచెట్టు ను ఆశ్రయించుకొని కొన్ని దుష్ట శక్తులున్నాయి.. ఆ ఇల్లాలిని కూడా బాధపెడుతున్నాయి..అందుకే ఆవిధంగా చెప్పాల్సి వచ్చింది.." అన్నారు శ్రీ స్వామివారు..


వాళ్ళ ఇంటిలో ఫలానా చెట్టును ఆశ్రయించుకొని దుష్ట శక్తులు ఉన్నాయని శ్రీ స్వామివారికెలా తెలిసింది?..


మీరాశెట్టి దంపతులు కూడా నాతోబాటు మొగలిచెర్ల కు వస్తామని బయలుదేరారు..అందరమూ శ్రీ స్వామివారి దగ్గర శెలవు తీసుకొని వచ్చేసాము..ఇంటికి వచ్చిన తరువాత జరిగిందంతా అమ్మ నాన్న గార్లకు చెప్పాను.."ఆ ఆడమనిషి కేకలు పెట్టేసారికి అబ్బాయి భయపడ్డాడు.." అని మీరాశెట్టి గారు నాన్నతో చెప్పారు..నాన్నగారు నవ్వి ఊరుకున్నారు..


సంక్రాంతి పండుగ కాగానే నేను తిరిగి కనిగిరి కి వెళ్ళిపోయాను..మళ్లీ వేసవి సెలవుల్లోనే నేను మొగలిచెర్ల రావడం జరిగింది..ఆసరికి ఆశ్రమ నిర్మాణం దాదాపు పూర్తి అయిపోయింది..


మరో అనుభవం..రేపటి భాగంలో..


పాఠకులకు విజ్ఞప్తి..శ్రీ స్వామివారి తో పరిచయం ఏర్పడ్డ నాటి నుంచి..శ్రీ స్వామివారు సిద్ధిపొందే వరకూ..ఆపై శ్రీ స్వామివారి సమాధి మందిర నిర్వహణా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నేటివరకూ నేను స్వయంగా పొందిన అనుభవాలూ..మరియు ఎందరో భక్తుల అనుభవాలను పాఠకులకు ఈ మాధ్యమం ద్వారా అందించే ప్రయత్నం ఇది..ఆదరిస్తారని ఆశిస్తున్నాను..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీదత్తాత్రేయస్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా.. పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: