🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*
. ♦️ *ఆర్య చాణక్య*♦️
*పార్ట్ - 89*
ఆ స్వాగత ద్వారము అపూర్వ శిల్పకళా నైపుణ్యము ఉట్టిపడుతూ చూపరుల ప్రశంసలను అందుకుంటోంది. ఆ ద్వారము మధ్య భాగంలో నిర్మించబడిన పద్మము చాలా పెద్దది. 'ఊరేగింపు ఆ ద్వారం మధ్యకు రాగానే ఆ పద్మము రేకులువిచ్చుకుంటాయని, దాని మధ్య నుండి అపూర్వ పుష్ప వర్షము చక్రవర్తిపై కురుస్తుందని' ఆ ప్రాంతాన గుమిగూడిన ప్రజలు చెప్పుకోవడం చాణక్యుని చెవుల పడింది.
"ఆ ద్వారము నిర్మించిన వారు ఎవరు ?" అని చాణక్యుడు అడిగిన ప్రశ్నకు "దారువర్మ" అని ఎవరో జవాబిచ్చారు. చాణక్యుడు తల తిప్పి ఆ జవాబు ఇచ్చిన వానివైపు చూసాడు. చాణక్యుని దృష్టి తన మీద పడగానే ఆ వ్యక్తి చిరునవ్వు నవ్వాడు. ఆ వ్యక్తి ప్రచ్చన్న దుస్తుల్లో ఉన్న సేనాని బాగురాయణుడు.
చాణక్యుడి పెదాల మీద వికృత మందహాసమొకటి తళుక్కున మెరిసి మాయమైంది. అతడు తన గుర్రాన్ని పక్కకు తప్పించి రాజమార్గం ప్రక్కన జనం వెనక నిలిపాడు.
ఊరేగింపు క్రమంగా ఆ ద్వారాన్ని సమీపించింది. ఒక్కొక్క బృందమే ద్వారం క్రిందినుంచి సాగిపోతోంది. భద్రగజం చంద్రరేఖ ద్వారాన్ని సమీపించింది. జనాలు బిగ్గరగా "జయహో... చంద్రగుప్త మహారాజ్ కి జయ... జయ.." అంటూ ఉత్సాహంతో నినాదాలు చేస్తున్నారు.
చాణక్యుడు జనం చాటునుంచి రెప్పవాల్చకుండా ఆ ద్వారం మధ్యన అమర్చిన యాంత్రిక పద్మం వైపు చూస్తున్నాడు. చంద్రరేఖ సరిగ్గా యాంత్రిక పద్మం క్రిందికి వచ్చింది.
అప్పుడు... అప్పుడు...
చంద్రోదయాన్ని కాంచగానే వికసించిన కమలంలా పద్మం రేఖలు యాంత్రికంగా విచ్చుకున్నాయి. విచ్చుకున్న పద్మదళాల మధ్యనుంచి పుష్ప వర్షం కురుస్తోంది. పుష్ప వర్షం మధ్య నుంచి మెరుపులా భద్రగజం మీదకి దూకాడో వ్యక్తి. అతడు ఏనుగు మీదికి దూకుతూనే బొడ్డులోంచి బాకుతీసి మహారాజు గుండెల్లో పొడిచాడు.
"అడుగో వాడే దారువర్మ... చక్రవర్తిని పొడిచేశాడు..."
అరుపులతో పాటు మహారాజు గిలగిలా తన్నుకుంటూ భద్రగజం పైనుంచి కిందికి జారి నేలమీద పడి ప్రాణాలు వదిలాడు. అతడి ముఖానికి అడ్డుగా వ్రేలాడుతున్న పూలహారాలు తొలగిపోయాయి. అతను చంద్రగుప్తుడు కాడని అందరికీ అర్థమైంది.
"వాడే దారువర్మ... హంతకుడు... వధించండి..." జనం వెనుకనుంచి భీకరస్వరంతో గర్జించాడు చాణక్యుడు. అంతలో భద్రగజానికి ఇరువైపులా అంగరక్షకులుగా వస్తున్న పర్వతక సైనికులు వైరోచనుడి మృతదేహాన్ని చూసి ఆవేశపడుతూ "మోసం ... కుట్ర... ఇదంతా మాగధుల వంచన ... దెబ్బకి దెబ్బ... రక్తానికి రక్తం..." అని అరుస్తూ కత్తులు దూశారు. అదే సమయంలో బాగురాయణుడి సైగలు అందుకొని, జనం వెనుకనుంచి ముందుకు వురికిన మగధసైనికులు వైరోచనుడి అంగరక్షకులను ఎక్కడున్న వాళ్ళని అక్కడే, ఎలావున్న వాళ్ళని అలా నరికి పారేశారు.
ఆ గొడవ, గందరగోళాలకి భద్రగజం బెదిరి చిందులు తొక్కింది. ఆ కుదుపులకు దానిపైనుంచి దారువర్మ జారి క్రిందపడ్డాడు. భద్రగజం చంద్రరేఖ తన కాళ్ళతో దారువర్మని దారుణంగా తొక్కి చంపేసింది. అదంతా కొద్ది క్షణాలలోనే ... 'ఏం జరిగిందో' జనం గ్రహించే లోపే జరిగిపోయింది... అంతలో...
"జయహో ... మౌర్య చంద్రగుప్త సార్వభౌమా.... జయహో... జయహో..." అంటూ పెద్ద పెట్టున నినాదాలు ప్రతిధ్వనించసాగాయి.
అశ్వారుడుడై వేగంగా అక్కడికి చేరుకున్నాడు చంద్రగుప్తుడు. అంతలో రాచబాటపై పడివున్న పర్వతసైనిక మృతదేహాలను మగధసైనికులు క్షణంలో తొలగించివేశారు. చాణక్యుడు జనం మధ్యనుంచి ముందుకు వచ్చి భద్రగజం పైనున్న మావటికి సైగచేశాడు. మావటివాడు భద్రగజాన్ని చంద్రుని సమక్షంలో కూర్చుండబెట్టాడు. 'భద్రగజాన్ని అధిరోహించమన్నట్టు' చిరునవ్వుతో చంద్రుని సూచించాడు చాణుక్యుడు.
చంద్రుడు మోకాళ్ళమీద వంగి చాణక్యుడికి నమస్కరించాడు. చాణక్యుడు అపరిమితమైన వాత్సల్యంతో చంద్రుని లేవదీసి కౌగిలించుకున్నాడు. ఆ అపూర్వ దృశ్యాన్ని చూస్తూ...
"జయహో .... మౌర్య చంద్రగుప్త సార్వభౌమా .... జయహో .... జయహో ...."
"జయహో... మౌర్య సామ్రాజ్య స్థాపనాచార్యా.... ఆర్యచాణక్యదేవా .... జయహో.... జయహో..."
దశదిశలా ప్రతిధ్వనించేలా ఆ ప్రజల నినాదాలు మిన్నుముట్టుతుండగా... వైతాళికులు జయగీతికలు ఆలపిస్తుండగా చంద్రగుప్త మౌర్యుడు ఆర్యచాణక్యుల వారి ఆదేశానుసారం భద్రగజం చంద్రరేఖని అధిరోహించాడు. మరుక్షణం మంగళతూర్య భేరి నినాదాలు ఉధృతంగా ప్రతిధ్వనిస్తూ ఉత్సాహపూరిత వాతావరణాన్ని వుత్తేజితం చేశాయి.
చాణక్యుడు చరచర ముందుకెళ్లి వేదాంగ వేత్తలు, పండిత, పురోహిత బృందంతో కలిసి వేద పఠనం చేస్తూ ముందుకు నడిచాడు. మాగధుల జయహోషలతో, దారిపొడవునా పూలవర్షపు జల్లులతో సాగిన ఊరేగింపు సుగాంగ ప్రసాదాన్ని చేరుకుంది.
రాజపురోహితులు, పండితులు, ' పనస ' చదువుతూ పూర్ణకుంభంతో చంద్రగుప్తునికి స్వాగతం పలికారు. సముద్రతరంగంలా పోటెత్తిన జయజయధ్వనుల మధ్య సుగాంగ ప్రాసాదంలో అడుగుపెట్టాడు చంద్రగుప్తుడు.
(ఇంకా ఉంది)...🙏
*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి